ఎదులాపురం, ఏప్రిల్ 22 : పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే సంకల్పంతో ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా ఏర్పాటు చేస్తున్న వైద్య శిబిరాలను వినియోగించుకోవాలని ఆదిలాబాద్ డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్ తెలిపారు. రిమ్స్‌లో శుక్రవారం మెగావైద్య శిబిరం నిర్వహించారు. ఆయా విభాగాల వైద్యులు రోగులను పరీక్షించారు. అవసరమైన టెస్టులు, మందులను అందజేశారు. మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, రిమ్స్ పర్యవేక్షకుడు అశోక్‌తో కలిసి అక్కడే ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. ఆయుష్మాన్ భారత్ కార్డు జారీని పరిశీలించారు.
ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్ మాట్లాడుతూ.. గిరిజన ప్రాంతమైన ఆదిలాబాద్‌లో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. పీహెచ్‌సీతో పాటు రిమ్స్‌లోని వైద్యులు ఇక్కడ అందుబాటులో ఉండి అన్ని రకాల వైద్య సేవలను అందించారని పేర్కొన్నారు. అనంతరం రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ మాట్లాడుతూ.. పేదలకు అన్ని రకాల వైద్య సేవలు అందించేందుకు ఒక్కరోజు మెగా వైద్య శిబిరం నిర్వహించినట్లు తెలిపారు. పీడియాట్రిక్, న్యూరో, యూరాలజీ, అప్తామాలజీ, ఆర్థోలతో పాటు ఆయా విభాగాల వైద్యులు సేవలు అందించారని పేర్కొన్నారు. ఇలాంటి వైద్య శిబిరాలను మరిన్న నిర్వహించేందుకు కృషి చేయాలని కోరారు.
ఆరోగ్య శ్రీ కార్డు మాదిరిగానే కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ కార్డును అందిస్తున్నదని తెలిపారు. దేశ వ్యాప్తంగా రూ.5 లక్షల వరకు వివిధ వైద్యశాలల్లో చికిత్సలు పొందేందుకు వీలుంటుందన్నారు. మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ మాట్లాడుతూ.. పేదలకు నాణ్యమైన వైద్యం అందించేలా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఇలాంటి శిబిరాలకు వచ్చి వారి ఆరోగ్య సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. అనంతరం రిమ్స్‌లో పనిచేస్తున్న శానిటేషన్ సిబ్బంది రక్తదానం చేశారు. వైద్యులు శిరీష్, కరుణాకర్, వైసీ శ్రీనివాస్, సామాజిక కార్యకర్త బండారి దేవన్న పాల్గొన్నారు.