నిర్మల్ అర్బన్, ఏప్రిల్ 22 : పదోతరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ విద్యాశాఖ అధికారులకు సూచించారు. పట్టణంలోని కలెక్టరేట్ కార్యాలయంలో శుక్రవారం వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని శాఖల సమన్వయంతో పదో తరగతి విద్యార్థులు మంచి ఫలితాలు సాధించేలా చూడాలని పేర్కొన్నారు. రెండు సంవత్సరాల అనంతరం పూర్తి స్థాయిలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసేలా ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు.
పరీక్షలను విజయవంతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌తో పాటు భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని తెలిపారు. డిప్యూటీ తహసీల్దార్ స్థాయి అధికారులను ఫ్లయింగ్ స్కాడ్‌గా నియమించాలని, పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులకు అన్ని రూట్లలో ఆర్టీసీ బస్సులను నడిపించాలన్నారు.
వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని, నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా 163 ప్రభుత్వ పాఠశాలల్లో 6,625 మంది, 103 ప్రైవేట్ పాఠశాలల్లో 3,068 మంది కలిపి మొత్తం 9693 మంది పరీక్షకు హాజరవుతున్నారని అన్నారు.
మే 23 నుంచి జూన్ 1 వరకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్ష కొనసాగుతుందని తెలిపారు. ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు ఫీజుల విషయంలో ఆటంకం కలిగించవద్దని, హాల్ టికెట్ విద్యార్థులందరికీ అందించాలని, ఆన్లైన్ నుంచి సైతం డౌన్లోడ్ చేసుకోవచ్చని చెప్పారు. అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, రాంబాబు, డీఈవో రవీందర్ రెడ్డి, పరీక్షల సహాయ కమిషనర్ ఎస్ పద్మ, జిల్లా వైద్యాధికారి ధన్‌రాజ్, జిల్లా రవాణా శాఖ అధికారి అజయ్ కుమార్ రెడ్డి, ఆర్టీసీ డీఎం సాయన్న, ఇంటర్మీడియట్ నోడల్ అధికారి పరశురాం, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.