ఖానాపూర్‌రూరల్, ఏప్రిల్ 21 : ఉపాధి కూలీలను ఎవరైననా డబ్బులు అడిగితే జైలుకేనని డీఆర్డీవో విజయలక్ష్మి హెచ్చరించారు. మండలంలోని సూర్జాపూర్, బాదనకుర్తిలో శుక్రవారం ఆమె పర్యటించారు. సూర్జాపూర్లో ఉపాధి హామీ పనులను పరిశీలించారు. పనుల నిర్వహణ, జాబ్ కార్డుల వివరాలు, హాజరు శాతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా డీఆర్డీవో మాట్లాడారు. కూలీలను అధికారులు లేదా మధ్యవర్తులు డబ్బులు అడిగితే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు రావాలని సూచించారు. వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అనంతరం బాదనకుర్తిలో పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించారు. గ్రామంలోని అడవి శివారులో చెరువు కోసం స్థలాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో సర్పంచ్ పార్శపు శ్రీనివాస్,ఏపీవో ప్రమీల, కార్యదర్శులు పాల్గొన్నారు.
నిర్మల్ టౌన్, ఏప్రిల్ 22 : మహిళా సంఘాల తోడ్పాటుకు బ్యాంకు ద్వారా రుణాలను అందిం చి వ్యాపార రంగంలో రాణించేలా ప్రత్యేక కృషి చేస్తున్నట్లు డీఆర్డీవో విజయలక్ష్మి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో జిల్లా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో మహిళా ప్రగతి రూరల్ మార్ట్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభించారు. నాబార్డు ఆర్థికసాయంతో జిల్లాలో మార్కెట్‌ను ప్రోత్సహించేందుకు వివిధ వ్యాపార దుకాణాలకు రుణాలు అందిస్తున్నట్లు చెప్పారు. మహిళలు సంఘటితంగా ఉండి సంఘాన్ని ప్రగతిపథంలో తీసుకెళ్లాలని కోరారు. ఏపీడీ గోవింద్రావు, డీపీఎం సాయిప్రసాద్, ఐకేపీ సిబ్బంది ఉన్నారు.