ప్రణీతా తీరానికి పదో రోజు శుక్రవారం భక్తజనం పోటెత్తింది. నదిలో పుణ్నస్నానాలు చేస్తూ పులకించిపోయింది. అర్జునగుట్ట, వేమనపల్లి, తుమ్మిడిహట్టి తీరాల్లో ఆధ్మాత్మిక శోభ సంతరించుకుంది. ఆయా తీరాలకు సుమారు లక్షా 35 వేల మందికిపైగా తరలిరాగా, పిండప్రదానాలు, దేవతలకు మొక్కులు తీర్చుకుంటూ భక్తిపారవశ్యంలో జనమంతా మునిగిపోయింది. ఆదివారంతో పుష్కర పండుగ ముగియనుండగా, ఆఖరిరోజు భక్తుల తాకిడి మరింత పెరిగే అవకాశం ఉందని అధికార యంత్రాంగం భావిస్తున్నది.
కోటపల్లి/వేమనపల్లి/కౌటాల, ఏప్రిల్ 22: ప్రాణహిత పుష్కరాలు పదో రోజుకు చేరుకున్నాయి. రేపటితో ముగియనుండగా, భక్తులు రోజురోజుకూ పెరుగుతున్నారు. శుక్రవారం ఒక్కరోజే సుమారు లక్షా 35 వేల మందికి పైగా పుణ్యస్నానాలు ఆచరించి, ప్రత్యేక పూజలు చేశారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం అర్జునగుట్ట ప్రాణహిత పుష్కర తీరంలోనే సుమారు లక్ష మంది పుణ్యస్నానాలు ఆచరించారు.
పుష్కరాల ముగింపునకు ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉండడంతో భక్తులు అంతకంతకూ పెరుగుతున్నారు. అర్జున గుట్ట వద్ద కుమ్రం భీం ఆసిఫాబాద్ జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి, ఆ జిల్లా ప్రజాప్రతినిధులు, నాయకులు ప్రత్యేక బస్సుల్లో తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించారు. జైపూర్ ఏసీపీ నరేందర్, చెన్నూర్ రూరల్ సీఐ నాగరాజు, కోటపల్లి ఎస్ఐ రవి కుమార్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. పోలీస్ కంట్రోల్ రూం ద్వారా భక్తులకు సూచనలు చేస్తున్నారు.
పురాణం సతీశ్ కుమార్ యువసేన ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేపట్టగా, ఆసిఫాబాద్ జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్ ప్రారంభించారు. వేమనపల్లి తీరానికీ భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సుమారు 30 వేల మంది భక్తులు స్నానాలు ఆచరించారు. మహిళలు సైకత లింగాలను ఏర్పాటు చేసి పూజలు చేశారు. వేమనపల్లి తీరంలో ఇప్పటి వరకు లక్షా 36 వేల మంది భక్తులు పుణ్యస్నానాలు చేసినట్లు దేవాదాయ శాఖ అధికారి రవి తెలిపారు. ఓ వ్యక్తి సెల్ఫోన్ పోగా పోలీసులు వెతికించి, అప్పగించారు.
ఘాట్ వద్ద టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కోలి వేణుమాధవ్రావు ఏర్పాటు చేసిన నిత్యాన్నదానంలో భక్తులు భోజనాలు చేశారు. వేమనపల్లి ఐకేపీ అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ రాంశెట్టి ఉమారాణి, హెల్త్ అసిస్టెంట్ రాంశెట్టి బాపు దంపతులు వివాహ వార్షికోత్సవం సందర్భంగా భక్తులకు అల్పాహారం పంపిణీ చేశారు. సర్పంచ్లు కుబిడె మధుకర్, జెల్ల మొండి, మోర్ల పద్మ, సీనియర్ నాయకులు పురాణం లక్ష్మీకాంత్, కుర్రు వెంకటేశం, ఆకుల లింగౌడ్, కో ఆప్షన్ ముజ్జు, రైతు మండల కో ఆర్డినేటర్ భీమన్న, మండల ఉపాధ్యక్షుడు కుమ్మరి బాపు, తదితరులున్నారు.
తుమ్మిడిహట్టి తీరంలో జిల్లా మాజీ ఎస్పీ వైవీఎస్ సుధీంద్ర కుటుంబ సమేతంగా పుణ్య స్నానాలు ఆచరించి గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. హైదరాబాద్, విజయవాడ, వరంగల్, కరీంనగర్ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. డీఆర్డీవో సురేందర్, ఎంపీపీ విశ్వనాథ్, సీఐ బుద్దె స్వామి, పుష్కర ఘాట్ ఇన్చార్జి వేణుగోపాల్ గుప్తా, ఎంపీవో శ్రీధర్ రాజు, తదితరులున్నారు.