తమకున్న కొంచెంపాటి భూమిలో వరికి బదులు ఇతర పంటలు సాగు చేస్తూ మంచి దిగుబడితో ఆర్థికంగా లాభాలు గడిస్తున్నారు ఓ చిన్నకారు రైతు కుటుంబం. ఆదిలాబాద్ జిల్లాలోనే మొట్టమొదటిసారిగా రెడ్ క్యాబేజీని ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహం, అధికారుల సూచనలు, కొత్త పంటలు వేయాలనే ఆలోచనను సద్వినియోగం చేసుకొని అధిక దిగుబడి సాధిస్తున్నారు.
పంట జిల్లాలో కొత్తదే అయినా, మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడంతో మంచి ఆదాయం పొందుతున్నారు. వినూత్నంగా సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న ఈ రైతుకుటుంబాన్ని ఆదర్శంగా తీసుకొని మరికొందరు ఈ పంట వైపు ఆసక్తి చూపుతున్నారు. -ఆదిలాబాద్ టౌన్,
ఆదిలాబాద్ మండలం శివఘాట్ గ్రామానికి చెందిన లాయర్ విఠల్, లక్ష్మి దంపతులది చిన్న వ్యవసాయ కుటుంబం. రెండెకరాల భూమిని సాగు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. కుమారులు లాయర్ మధు, సాయిలు కూడా సాగు పనుల్లో వారికి సహకరిస్తుంటారు.
పత్తితో పాటు ఆకు కూరలు, కూరగాయలు సాగు చేస్తున్నారు. ఈ ఏడాది వానకాలంలో బీర, కాకర వేశారు. అన్నీ పోనూ రూ.2 లక్షలు మిగిలాయి. తరువాత యాసంగిలో ఒక ఎకరంలో శనగ వేసి పంటతీశారు. మిగులు రూ.30 వేలు. ప్రస్తుతం శనగ తీసిన భూమిలో కూరగాయలున్నాయి. మిగతా ఒక ఎకరంలో రెడ్ క్యాబేజీ వేశారు.
– ఆదిలాబాద్ టౌన్, ఏప్రిల్ 22
యువరైతు లాయర్ మధు ఒకసారి హైదరాబాద్ వెళ్లినపుడు అక్కడ హైదర్‌గూడలోని హెరిటేజ్‌లో రెడ్క్యాబేజీ గమనించాడు. సాధారణంగా తెల్లక్యాబేజీ, కాలీఫ్లవర్ మాత్రమే తనకు తెలుసు. కొత్తగా ఉందని ఆసక్తితో విత్తనాలు తెచ్చి, ఒక ఎకరంలో గత జనవరిలో వేశాడు. దాదాపుగా 10 వేల విత్తనాలకు రూ.3 వేలు వెచ్చించాడు. ప్రస్తుతం ఈ పంట చేతికి రాగా, మార్కెట్‌కు తరలిస్తున్నారు.
ఆదిలాబాద్ ఉద్యానవన శాఖాధికారి శ్రీనివాస్‌రెడ్డి ప్రోత్సాహంతో ఈ రైతు ఉత్సాహంగా సాగు చేస్తున్నాడు. సొంతంగానే బోర్ వేసుకున్నారు. ఐదేళ్ల క్రితం రూ.2 లక్షల విలువగల డ్రిప్‌ను ప్రభుత్వం సమకూర్చింది. అంతేగాక పందిరి సాగు కోసం షెడ్లు ఇచ్చింది. చేనులో ఉన్న బోర్‌తో డ్రిప్ ద్వారా నీటి తడులిస్తున్నారు. పశువులు,గొర్రెల ఎరువులు వాడుతున్నారు. ఈ రెడ్క్యాబేజీ విస్తీర్ణంలోనే పందిరి సాగుగా చిక్కుడు, బీరకాయ , కాకర కూడా వేశారు. ఇక మిగతా ఒక ఎకరంలో కూరగాయలు ఉన్నాయి. మూడు నెలల స్వల్పకాలిక సమయంలోనే ఈ క్యాబేజీ ఇపుడు మార్కెట్లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నది. కాగా ఆదిలాబాద్ జిల్లాలోనే ఈ రకం క్యాబేజీ మొట్టమొదటిసారి ఇక్కడ సాగవుతున్నదని హార్టికల్చర్ అధికారి ఎం.శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.
పోషకాలు ఉన్న ఈ క్యాబేజీ స్థానికంగా రూ.100 కిలోగా పెట్టవచ్చని రైతు అంటున్నా డు. ఇదే క్యాబేజీ హైదరాబాద్ ఇతర మహానగరాల్లో రూ.200 కిలో పలుకుతుందని చెప్తున్నారు. సలాడ్, కర్రీ, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, సూపర్మార్కెట్లో దీనిని వాడుతుంటారు. ఇపుడే ఆదిలాబాద్‌కు పరిచయమవుతున్న ఈ క్యాబేజీతో ఈ రైతు కుటుంబం కనీసంగా సగటున రూ.7లక్షల నుంచి 10లక్షల ఆదాయం పొందనున్నది. ఒక క్యాబేజీ మొక్కకు ఒక కాయ వస్తుంది. ఇది ఒకేసారి కాత ఉంటుంది. దానితో కనీసంగా 50 క్వింటాళ్లు అనుకుంటే మొత్తం ఖర్చు పోనూ రూ. 6- 7 లక్షలు మిగులుతాయి. జిల్లాలో ఈ రెడ్క్యాబేజీ సాగు వెలుగులోకి వస్తే మరికొందరు రైతులు ఆసక్తి చూపే అవకాశం ఉన్నది.
రెడ్ క్యాబేజీ బరువు తగ్గిస్తుంది. పోషకాలు మెండుగా ఉంటాయి. విటమిన్ బీ, సీ, కే, ఏలు ఉంటాయి. గుండె సంబంధిత వ్యాధులకు నివారణ ఔషధంగా పనిచేస్తుంది. జింకు , రోగనిరోధక శక్తి ఉంటుంది. మతిమరుపు తగ్గుతుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. రక్తపోటు రాదు . కరోనా సమయంలో నగరాల్లో వాడకం బాగా పెరిగింది.
రైతులు తమకు తక్కువ భూమి ఉన్నా కొం త నీటిసదుపాయం చేసుకుని ప్రభుత్వ పథకాలు ఉపయోగించుకుంటూ ముందు కు పోవాలి. ఈ రెడ్క్యాబేజీ అనేది ఆరోగ్య వంతమైన ఆహారం. మా తాతల కాలం నుంచి మేము జల్దిన అచ్చేటి కూరగాయ లు, ఆకుకూరలనే పండిస్తున్నం. ఇగ విత్త నం ఏసిన్నుంచయితే పంట చేతికి అచ్చినంక సుకా అది వినియోగదారు లకు చేరేదాకా మా పాత్రనే ఉంటది.
రెడ్క్యాబేజీని అందరూ ఆదరిస్తారని భావిస్తున్నా. రైతు కుటుంబాల్లోని చదువుకున్న యువత మార్కెట్‌కు అనుగుణంగా లాభదాయక పంటలవైపు అడుగు వేయాలి. డిగ్రీ చదివిన నాకు ఎవుసం అంటేనే ఇష్టం. ప్రభుత్వం పాలీహౌజ్ మంజూరు చేస్తే బాగుంటుంది.
– లాయర్ మధు, యువరైతు, శివఘాట్, ఆదిలాబాద్ మండలం
సాగులో నిరంతరం మార్పులు అనివార్యం. తరాల నుంచి ఈ కుటుంబం ..లాభాల స్వల్పకాలిక పంటలసాగుపై ఉండడం మంచి విషయం. ఈ రైతు ఆసక్తి గమనించిన మేము డ్రిప్ అందించినం. ఈ రెడ్క్యాబేజీ గురించి చెప్పిన తరువాత ప్రోత్సహించినం .. విటమిన్ కే ,జింక్ పుష్కలంగా ఉండే ఈ రెడ్క్యాబేజీకి నగరాల్లో డిమాండ్ బాగా ఉన్నది. రోగ నిరోధక శక్తి ఉన్న ఈ క్యాబేజీ సలాడ్‌లో వాడుతారు. చిన్న రైతు ఒక కొత్త పంటను స్థానికంగా పరిచయం చేయడం అభినందనీయం . ఇదే విస్తీర్ణంలో పందిరిసాగుకూడా చేస్తూ రెండు పంటలు తీస్తున్నారు. ఈ క్యాబేజీ చాలా రోజులు నిలువ ఉండే గుణం కలిగి ఉన్నది. మిగతా రైతులు కూడా ఇలాంటి పంటలపై దృష్టిపెట్టాలి.
– ఎం.శ్రీనివాస్‌రెడ్డి ,ఉద్యానవన పట్టుపరిశ్రమశాఖ జిల్లా అధికారి, ఆదిలాబాద్