ఏ యేటికి ఆ యేడు భూగోళం వేడెక్కుతున్నది. భూతల్లి తల్లడిల్లుతున్నది. గ్రీన్హౌస్ విష వాయువుల నుంచి కాపాడమంటున్నది. భగభగమంటూ పెరుగుతున్న భూతాపం ప్రభావంతో మానవాళి మనుగడ ప్రశ్నార్థకమవుతున్నది. మానవుడు విచ్చలవిడిగా చేస్తున్న ప్రకృతిమేధంతో, భావితరాలకు తీరని కష్టాన్ని మిగులుస్తున్నది. శుక్రవారం ప్రపంచ భూగోళ సంరక్షణ దినం సందర్భంగా ప్రకృతి విధ్వంసం, పెరుగుతున్న భూతాపం, మానవుడి జీవన శైలిపై ‘నమసే’ప్రత్యేక కథనం..
మంచిర్యాల, ఏప్రిల్ 21, నమస్తే తెలంగాణ : మానవుడితో పాటు సకల ప్రాణి కోటి మనుగడకు ఆధారం ఏకైక జీవగ్రహం భూగోళం. సూర్యకుటుంబంలోనే ఏ ఇతర గ్రహాలకు లేని అత్యంత ప్రత్యేకత మనం జీవించేందుకు కారణమైన అమ్మ లాంటిది ఈ భూగోళమే. ఈ ధరిత్రి మీదనే కోట్లాది సంవత్సరాలకు పూర్వం జీవకోటి ఆవిర్భావం జరిగి ఇంతకాలం మనుగడ సాగించగలుగుతున్నది. కానీ నేటి మానవుడు అతి విలాసవంతమైన జీవన విధానంతో, మితిమీరిన కోర్కెలతో ప్రకృతి వనరులను విచ్చలవిడిగా వాడుకుంటూ భావితరాలకు మిగల్చకుండా చేస్తున్నాడు. పర్యావరణాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాడు.
దీంతో భగభగమంటూ పెరుగుతున్న భూతాపం ప్రభావంతో జీవజాతుల మనుగడ ప్రశ్నార్థకమే అంటూ పర్యావరణ నేతలు ఘోషిస్తున్నారు. ప్రాణికోటి భారాన్ని మోసేది మన భూగోళమే.. మనల్ని తల్లిలా కంటికి రెప్పలా కాపాడే ధరిత్రి పరిరక్షణ కోసం ప్రత్యేకంగా చర్యలు తీసుకోకున్నా పర్వాలేదు కానీ, కనీసం హాని కలిగించకుండా ఉంటే అదే పదివేలు. భూగోళం భవిష్యత్తు ప్రశ్నార్థకమవడానికి ప్రకృతి విధ్వంసమే మూలకారణం. మానవ తప్పిదాలతోనే పెనుముప్పు కలుగుతున్నది. ప్రపంచవ్యాప్తంగా 175 పైగా దేశాలు ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఐక్యరాజ్యసమితి ప్రజల్లో అవగాహన కలిగిస్తున్నది.
ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 22న భూగోళ (ధరిత్రి) సంరక్షణ దినోత్సవం గా జరుపుకుంటున్నారు. భూమి, పర్యావరణ పరరక్షణ గురించి ప్రజల్లో అవగాహన కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశం. మొదట ఐక్యరాజ్యసమితి 1969 మార్చిలో జాన్‌మెక్కల్‌తో ప్రారంభించింది. అనంతరం అమెరికా రాజకీయవేత్త గేలార్డ్ నెల్సన్ ప్రారంభించారు. 1962లో సెనెటర్ నెల్సన్‌కు వచ్చిన ఆలోచనకు ప్రతిరూపమే ఈ ధరిత్రీ దినోత్సవం. 1970 ఏప్రిల్ 22న మొదటి ధరిత్రీ దినోత్సవం అమెరికాలో నిర్వహించారు. అనంతరం ఈ ఉత్సవం ప్రపంచవ్యాపితమైంది.
తరిగిపోయే వనరులకు బదులు, తరగని, పునర్వినియోగించుకోగల వనరుల ఆధారంగానే సుస్థిరాభివృద్ధి జరుగుతుంది. ఇదే ధరిత్రికి సుస్థిర భవిష్యత్తును చేకూరుస్తుంది. ఆర్థికాభివృద్ధి, సామాజిక ప్రగతి, పర్యావరణ పరిరక్షణ, హరితార్థికాభివృద్ధికి, సుస్థిర భవిష్యత్తుకు మూలాధారం. భూమి, నీరు వంటి మౌలిక వనరులను గరిష్ట సామర్థ్యంతో వినియోగించాలి. గ్రీన్హౌస్ వాయువుల విడుదలను కనీస స్థాయికి తగ్గించగల సాంకేతికతను వినియోగించాలి. అడవుల సంరక్షణ, పునర్ పెంపకం, సుస్థిర యాజమాన్య పద్ధతులు, జీవ వైవిధ్య సంరక్షణ, సమర్థవంతమైన ప్రజా రవాణా వ్యవస్థ ఏర్పాటు, వ్యక్తిగత రవాణాను నిరుత్సాహ పరిచే విధానంతో ప్రజలకు అవగాహన కల్పించాలి.
తల్లిలాంటి భూగోళం బాగుంటేనే మేలు. లేదంటే మానవాళి భవిష్యత్ అంధకారమే అవుతుంది. అనాలోచిత మానవ చర్యలతో కలుగుతున్న ప్రకృతి వి ధ్వంసాన్ని నిలువరించాలన్న బృహత్తర లక్ష్యంతో ధరిత్రి దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. శిలాజ ఇం ధనాలను విచ్చలవిడిగా వాడడంతో వాయు కాలు ష్యం పెచ్చుమీరుతున్నది. పట్టణాలు, నగరాల నుంచి వెలువడుతున్న వ్యర్థాలతో కాలుష్యం పెరిగిపోతున్నది. వ్యవసాయంలో రసాయనాలు విచ్చలవిడిగా వాడుతూ పది కాలాల పాటు పదిలంగా చూసుకోవాల్సిన భూమిని నిస్సారంగా మారుస్తున్నాం.
మానవుడు తోటి ప్రాణులను ఆనందంగా బతుకనివ్వకుండా భూగోళాన్ని అతలాకుతలం చేస్తున్నాడు. మనం ఎక్కిన చెట్టును మనమే నరుక్కున్నట్లు మానవాళి మనుగడకు ప్రధానమైన ధరిత్రిని నాశనం చేయడం, వేడెక్కడానికి కారణమైన గ్రీన్హౌస్ విష వాయువులను మోతాదుకు మించి విడుదల చేయడం వంటి పనులతో ఇబ్బందులు సృష్టిస్తున్నారు., ఇకనైనా మేల్కొని భూగోళానికి ప్రాణకోటికి సంబంధాన్ని తెలుపుతూ పలు కార్యక్రమాలు నిర్వహించి పర్యావరణం మెరుగుదలకు కృషి చేయాలి.
వ్యక్తి నుంచి అంతర్జాతీయ కార్పొరేషన్ల వరకు అందరూ పర్యావరణ విద్య, విధానాల ప్రచారంపై దృష్టి సారించాలి. గ్రీన్ హౌస్ వాయువులైన కార్బన్ డై ఆక్సైడ్, నితిన్ మిథేన్, నీటి ఆవరితో క్లోరో ఫ్లోరో కార్బన్స్, హైడ్రో క్లోరో కార్బన్ విడుదలను నియంత్రించే పర్యావరణ మిత్ర అలవాట్లను అందరూ అలవర్చుకోవాలి.
శిలాజ ఇంధనాలను చాలా మితంగా వినియోగించాలి. ప్రజా రవాణాను అధికంగా వాడాలి. విరివిగా మొక్కలు నాటి సంరక్షించాలి. గాలిలో క్లోరో ఫ్లోరో కార్బన్లను నియంత్రించాలి. పర్యావరణ మిత్ర ఉత్పత్తులను ఉపయోగించాలి. సాధ్యమైనంత వరకు రీసైక్లింగ్‌కు అవకాశం ఉండే వస్తువులనే వాడాలి.
– గుండేటి యోగేశ్వర్, పర్యావరణ వేత్త, మంచిర్యాల