నిర్మల్ అర్బన్, మే 3 : నీళ్లు, నిధులు, కొలువుల కోసం కొట్లాది సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రంలోనే నిరుద్యోగులకు లక్షలాది ఉద్యోగాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందని, స్వరాష్ట్రంలోనే జోరుగా ఉద్యోగాల భర్తీ సాగుతుందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ పట్టణంలోని ఆర్కే కన్వెన్షన్‌లో గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న ఉద్యోగార్థులకు మంగళవారం నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ ఉద్యోగాలతో పాటు గ్రూప్-1 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ను జారీ చేసిందని చెప్పారు. ప్రణాళికాబద్ధంగా చదువుకొని కొలువులను సాధించాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వెలువరించిన ఖాళీల్లో జిల్లా ప్రజలు అత్యధిక ఉద్యోగాలు సాధించాలన్న ధ్యేయంతో ఐకేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ అందిస్తున్నామని చెప్పారు. శిక్షణలో అధ్యాపకులు సూచించిన విధంగా ఓ ప్రణాళికతో చదివితే తప్పకుండా అందరూ ఉద్యోగాలు సాధించవచ్చని పేర్కొన్నారు.
సమయాన్ని వృథా చేయకుండా చదివి తల్లిదండ్రుల కలలను నెరవేర్చాలని సూచించారు. అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, జిల్లా పరిషత్ చైర్పర్సన్ విజయ లక్ష్మి, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, పట్టణాధ్యక్షుడు మారుగొండ రాము, దేవరకోట ఆలయ మాజీ చైర్మన్ ఆమెడ కిషన్, ముత్యం రెడ్డి పాల్గొన్నారు.
సోన్, మే 3 : సోన్ మండలంలోని మాదాపూ ర్ ఎక్స్‌రోడ్డు వద్ద గల బేతేల చర్చి ఫాస్టర్ సులోమాన్ రాజ్ (చంటి) కుమారుడు క్రాంతి-శ్రావ్య వివాహ రిసెప్షన్‌కు మంగళవారం రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి హాజరయ్యారు. వధూవరులను ఆశీర్వదించారు. మంత్రి వెంట జడ్పీటీసీ జీవన్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ అంపోలి కృష్ణప్రసాద్‌రెడ్డి, టీఆర్ఎస్ సోన్ మండల కన్వీనర్ మోహినొద్దీన్, సోన్ ఉప సర్పంచ్ దాసరి రాజేశ్వర్, నాయకులు అంపోలి మురళీధర్‌రెడ్డి, నర్సయ్య, కాంతయ్య, కొత్తకాపు రాజేశ్వర్ ఉన్నారు.
నిర్మల్ టౌన్, మే 3 : మహాత్మా బసవేశ్వరుడి మార్గం సదా ఆచరణీయమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో మహాత్మా బసవేశ్వరుడి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. బసవేశ్వర చిత్రపటానికి పూజలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బసవేశ్వర ఆశయాలను గుర్తించి రాష్ట్రంలో వీరశైవలింగాయత్, లింగబలిజాలు సమాజంలో గౌరవం పొందేలా అధికారికంగా వేడుకలను నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారని పేర్కొన్నారు.
అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, నిర్మల్ ఎంపీపీ రామేశ్వర్‌రెడ్డి, జిల్లా బీసీ సంక్షేమశాఖ జిల్లా అధికారి రాజేశ్వర్‌గౌడ్, టీఆర్ఎస్ నాయకులు రాంకిషన్‌రెడ్డి, మారుగొండ రాము, బిట్లింగ్ నవీన్, కోటగిరి అశోక్, బీసీ సంక్షేమశాఖ సహాయ అధికారి నాగారావు పాల్గొన్నారు.