
ఆత్మకూరు, జనవరి 30: కేంద్రంలో బీజేపీ అధికారంలో వచ్చాక దేశంలో ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేస్తోందని ఇఫ్టూ జిల్లా అధ్యక్షుడు అరుణ్‌కుమార్ విమర్శించారు. స్థానిక మార్కెట్‌యార్డ్ ప్రాంగణంలో ఇఫ్టూ జిల్లా కార్మిక సదస్సును ఆదివారం నిర్వహించగా అరుణ్‌కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సేవ్ నేషన్.. సేవ్ పీపుల్స్ నినాదంతో బీజేపీపై పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కార్మిక వ్యవస్థను అస్థిర పరిచేలా ప్రవేశపెడుతున్న నాలుగు లేబర్ కోడ్ చట్టాలను వెంటనే రద్దుచేయాలన్నారు. నేషన్ మ్యానిటైజేషన్ పేరుతో ప్రభుత్వరంగ సంస్థలను ప్రవేటీకరణ చేయడం నిలిపివేయాలని కోరారు. స్కీం కార్మికులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం రూ.26వేలు అందించాలన్నారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేసి కనీస పెన్షన్ రూ.10వేలుగా నిర్ణయించాలని డిమాండ్ చేశారు. ఆయా డిమాండ్ల సాధనకు ఫిబ్రవరి 23, 24 తేదీల్లో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె నిర్వహిస్తున్నట్లు పిలుపునిచ్చారు. ఉద్యోగులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలోఇఫ్టూ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రసాద్, ఇఫ్టూ కోశాధికారి వెంకటేశ్, నందిమల్ల ఎంపీటీసీ హన్మంతు, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజు, సాబేద్, సాహెదా, కుర్మయ్య తదితరులు పాల్గొన్నారు.