
మైసిగండి వద్ద టూరిజం హోటల్
తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్‌గుప్తా
వెల్దండ, జనవరి 30: ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తామని తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్‌గుప్తా అన్నారు. ఆదివారం నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామంలో వాసవీ క్లబ్ మండల అధ్యక్షుడు ఆకారపు నాగరాజు అధ్యక్షతన ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మైసిగండి అమ్మవారి సన్నిధిలో టూరిజం హోటల్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన గుండాల అంబా రామలింగేశ్వర స్వామి ఆలయాభివృద్ధికి టూరిజం శాఖ నుంచి కృషి చేస్తామని స్పష్టం చేశారు. అహింసా మార్గంలో గాంధీజీ దేశానికి స్వాతంత్య్రం తెచ్చారని గుర్తుచేశారు. అలాగే అహింసా మార్గంలో పదవులు, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా 14 ఏండ్ల పాటు పోరాటం చేసి తెలంగాణ సాధించిన మహాత్ముడు కేసీఆర్ అన్నారు. దేశంలోనే తెలంగాణకు వన్నె తెచ్చే విధంగా అభివృద్ధి చేస్తున్న ఘనత ఆయనకే దక్కిందని స్పష్టం చేశారు. కేసీఆర్ వంటి సీఎంలు కావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో 25 లక్షల మంది ఆర్యవైశ్యులు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని తెలిపారు. అనంతరం శ్రీనివాస్‌గుప్తాను వాసవీ క్లబ్, ఆర్యవైశ్య సంఘం నాయకులు సన్మానించారు. కార్యక్రమంలో క్లబ్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ రమేశ్‌బాబు, ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు బచ్చు రామకృష్ణ, సర్పంచ్ వెంకటేశ్వరరావు, ఎంపీటీసీ రాములు, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు భాస్కర్‌రావు, డైరెక్టర్ జంగయ్య, టీఆర్ఎస్ జిల్లా నేత రవీందర్రావు, మాజీ జెడ్పీటీసీ హరిప్రసాద్, వాసవీ ఆర్యవైశ్య సంఘం నాయకులు గీతారాణి బాలస్వామి, పాపిశెట్టి రాము, పూరి రమేశ్, రాఘవేందర్, సురేశ్, రమేశ్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు