
హుస్నాబాద్, నవంబర్ 29 : గౌరవెల్లి రిజర్వాయర్ భూనిర్వాసితుల త్యాగం వెలకట్టలేనిదని, వారి సహకారం వల్లే ప్రాజెక్టు నిర్మాణం దాదాపుగా పూర్తి కావచ్చిందని ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ అన్నారు. ఇప్పటికే చాలా మంది రైతులు తమ భూములు, ఇండ్లను ప్రభుత్వానికి అప్పగించారని, మిగతా రైతులు కూడా తమ భూములను ఇచ్చి ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సోమవారం హుస్నాబాద్ పట్టణ శివారులోని కరీంనగర్ రోడ్డులో గౌరవెల్లి నిర్వాసితులు నిర్మించుకుంటున్న ఇండ్ల నిర్మాణానికి ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నిర్వాసితులు ఇండ్లు, భూములను ఈ ప్రాంత రైతుల కోసం ఇచ్చి ఉన్న ఊరును వదిలేసి వెల్లడం అనేది వారి త్యాగానికి నిదర్శనమన్నారు. వీరి త్యాగాన్ని హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు ఎన్నటికీ మర్చిపోరన్నారు. మెట్ట ప్రాంత ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన గౌరవెల్లి రిజర్వాయర్ నిర్మాణంతో శాశ్వత కరువు నివారణ జరుగుతుందన్నారు. తాగు, సాగునీటి ఇబ్బందులు తొలిగిపోయి ఈ ప్రాంత రూపురేఖలు పూర్తిగా మారిపోతాయన్నారు. ఇంకా నిర్వాసితుల సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని, అన్ని విధాలా ఆదుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చారు. నష్టపరిహారం విషయంలో న్యాయం జరిగేలా చూస్తామన్నారు. మంత్రి హరీశ్‌రావు కృషితో త్వరలోనే ప్రాజెక్టు పూర్తై గోదావరి నీళ్లతో కళకళలాడుతుందనే ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ కాసర్ల అశోక్‌బాబు, మాజీ చైర్మన్ తిరుపతిరెడ్డి, కౌన్సిలర్లు గోవింద్ రవి, పెరుక భాగ్యరెడ్డి, మిర్యాల రమేశ్, మాజీ ఎంపీపీ వెంకట్, నాయకులు ఎండీ అన్వర్, చిట్టి గోపాల్‌రెడ్డి, డాక్టర్ కొంకటి రవి పాల్గొన్నారు.