
రూ.703 కోట్లు మంజూరు
భూత్పూరు నుంచి పీయూ మీదుగా చించోలి వరకు ..
తెలంగాణ, ఏపీ నుంచి ముంబయికి దగ్గరి దారి
సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రికి మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కృతజ్ఞతలు
మహబూబ్‌నగర్, జనవరి 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పాలమూరులో మరో జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైవే ఆవశ్యకతపై మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కేంద్ర మంత్రిని కోరడం..సీఎం కేసీఆర్ సైతం జాతీయ రహదారి అవసరాన్ని వివరిస్తూ కేంద్రానికి లేఖ రాశారు. స్పందించిన కేంద్రం హైవే నిర్మాణానికి అంగీకరించింది. మహబూబ్‌నగర్ జిల్లా మీదుగా వికారాబాద్ నుంచి చించోళి వరకు రహదారి నిర్మాణం జరుగనున్నది. ఈ మేరకు రూ.703.68 కోట్లు మంజూరు చేస్తున్నట్లు కేంద్రం తెలిపింది.
వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఎంతో ముఖ్యమైన జాతీయ రహదారి నిర్మాణానికి అడుగులు పడ్డాయి. 44వ జాతీయ రహదారిని (హైదరాబాద్- బెంగళూరు) 65వ నెంబర్ జాతీయ రహదారి (హైదరాబాద్- పుణె)తో కలిపే భూత్పూర్-చించోలి హైవే నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు సఫలమయ్యాయి. గతేడాది మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హైవే ఏర్పాటు ఆవశ్యకతపై కేంద్ర మంత్రికి, సీఎం కేసీఆర్ కేంద్రానికి లేఖ రాశారు. స్పందించిన కేంద్రం ఎట్టకేలకు అంగీకరించింది. భూత్పూర్ నుంచి క్రిష్టియన్‌పల్లి, పాలమూరు యూనివర్సిటీ, చిన్నదర్పల్లి, హన్వాడ, కోస్గి, కొడంగల్, తాండూరు, వికారాబాద్ మీదుగా చించోలి వరకు రహదారిని ఏర్పాటు చేయనున్నారు. గతేడాది రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు మహబూబ్‌నగర్-చించోలి అంతరాష్ట్ర రహదారిని జాతీయ రహదారిగా ఏర్పాటు చేసేందుకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించింది. ఇప్పటికే ఈ రహదారి నిర్మాణానికి సర్వే పూర్తయింది. మహబూబ్‌నగర్ జిల్లాలో ఎన్‌హెచ్-44పై ఉన్న భూత్పూర్ ఫ్లైఓవర్ నుంచి కర్ణాటకలోని చించోలి వరకు జాతీయ రహదారి 167ఎన్ను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు రూ.703.68 కోట్లు మంజూరు చేస్తున్నట్లు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందించింది. హైవే 125 కి.మీ ఉండగా.. భూత్పూర్ నుంచి మన రాష్ట్ర సరిహద్దు వరకు సుమారు 110 కి.మీలు, కర్ణాటక రాష్ట్ర పరిధిలో 15 కి.మీ మేర నిర్మాణం జరుగనున్నది. పట్టణాలు, గ్రామాలు కలిసే చోట, జంక్షన్ల వద్ద 120 అడుగులు, మిగతా చోట్ల 100 అడుగుల మేర రహదారి నిర్మిస్తారు. తెలంగాణ పరిధిలో జరిగే పనులను ఆర్అండ్బీ (ఎన్‌హెచ్ విభాగం) చేపట్టనున్నది.
సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు..
44వ జాతీయ రహదారిని 65వ నెంబర్ జాతీయ రహదారితో కలిపే హైవే ని ర్మాణానికి అనుమతులు రావడం సంతోషించదగ్గ విషయం. సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ఆర్అండ్బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి కృతజ్ఞతలు. హైవే నిర్మాణం కోసం 2020 నవంబర్ 11న కేంద్ర ఉపరితల రవాణా, హైవే శాఖ కార్యదర్శికి వ్యక్తిగతంగా లేఖ రాశాను. 23 మార్చి 2021న మంత్రి నితిన్ గడ్కరీకి సీఎం కేసీఆర్ కూడా లేఖ రాశారు. సాంకేతిక, పరిపాలన అనుమతులు ఇచ్చిన కేంద్రం ఇప్పుడు రూ.703 కోట్లతో పనులు చేపట్టనున్నట్లు ప్రకటించింది. రాష్ట్రంలో హైవేల నిర్మాణానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులను విడుదల చేస్తున్నందుకు సంతోషంగా ఉన్నది. ప్రస్తుతం ప్యాకేజీ-1 కింద 60.25 కి.మీ. మేర అనుమతులు వచ్చేలా చేసిన ఈ ప్రాంతానికి చెందిన ఉపరితల రవాణా శాఖ కార్యదర్శి గిరిధర్, రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి శ్రీనివాసరాజుకు కృతజ్ఞతలు. సాధ్యమైనంత త్వరగా రెండో దశ పనులకు కూడా అనుమతులు వచ్చేలా ప్రయత్నిస్తాం.-వి.శ్రీనివాస్‌గౌడ్, ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి
తొలి దశలో 60.25 కి.మీ..తొలి దశలో భూత్పూర్ నుంచి పాలకొండ, పాలమూరు యూనివర్సిటీ, వీరన్నపేట,
డంప్‌యార్డు మీదుగా చిన్న దర్పల్లి, హన్వాడ, కోస్గి, నుంచి దుద్యాల గేట్ వరకు 60.25 కి.మీ. మేర నిర్మించనున్నారు. ఇందుకుగానూ రూ.703.68 కోట్లతో పరిపాలన అనుమతులు జారీ అయ్యాయి. సెకండ్ ఫేజ్‌లో దుద్యాల గేట్ నుంచి వయా కొడంగల్, తాండూర్
తెలంగాణ రాష్ట్ర సరిహద్దును కలుపుతూ కర్ణాటక రాష్ట్రంలోని చించోలి హైవే వరకు రోడ్డు నిర్మాణం విస్తరించాల్సి ఉన్నది. రెండో ప్యాకేజీ పనులకు కూడా ఇప్పటికే అంచనాలు సమర్పించారు. త్వరలో ప్యాకేజీ-2కు కూడా సాంకేతిక, పరిపాలన అనుమతులు మంజూరు కానున్నాయని మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ వెల్లడించారు. హైవే నిర్మాణంలో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం చుట్టూ 8 కి.మీ., కొడంగల్‌లో 5 కి.మీ., తాండూర్‌లో 6 కి.మీ.ల మేర బైపాస్ రోడ్లు నిర్మించనున్నారు. ఈ రహదారి పూర్తయితే ఏపీతోపాటు తెలంగాణ నుంచి ముంబైకి వెళ్లేందుకు దూరం తగ్గనున్నది. మహబూబ్‌నగర్ పట్టణానికి మణిహారంగా నిలవనున్నది. ఈ రహదారి నిర్మాణంతో మహబూబ్‌నగర్ పట్టణానికి 75 శాతం రింగ్‌రోడ్డు పూర్తవుతుంది. తెలంగాణ, ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి ఈ ప్రాంతం మీదుగా రాకపోకలు పెరిగి పట్టణంతోపాటు జిల్లా అభివృద్ధికి అవకాశం ఏర్పడుతుంది. పరిశ్రమలు, మౌలిక వసతుల కల్పన, కొత్త పరిశ్రమల ఏర్పాట్లు పెరగనున్నాయి. రహదారిపై పాలమూరు వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.