
గద్వాల రేఖ రైస్ మిల్లు బియ్యం కేసులో మలుపులు
విచారణను పక్కదారి పట్టించిన అధికారులు
ఏడుగురి ప్రమేయం ఉన్నా.. ఒక్కరిపైనే కేసు
రూ.లక్షలు చేతులు మారినట్లు ఆరోపణలు
గద్వాల అర్బన్, జనవరి 29 : జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతున్నది. అక్రమార్కులు జిల్లా కేంద్రాన్ని అడ్డాగా చేసుకొని దందా నడుపుతున్నారు. వారికి అధికారుల అండ కూడా ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కేసుల నుంచి తప్పించేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. కొంత కాలం కిందట అయిజ రోడ్డులోని రేఖ రైస్ మిల్లు నుంచి అక్రమంగా తరలిస్తున్న 170 క్వింటాళ్ల రేషన్ బియ్యం తరలిస్తున్న డీసీఎంను స్వాధీనం చేసుకున్నారు. ఈ బియ్యాన్ని పోలీస్‌లు సీజ్‌చేసి ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు అప్పగించారు. మిల్లు నిర్వాహకులు కేసు నమోదు కాకుండా చూడాలని అదనపు కలెక్టర్‌ను ఆశ్రయించారు. ఆయన ఆదేశాల మేరకు సదరు బియ్యం పీడీఎస్ కాదని ఎన్ఫోర్స్మెంట్ డీటీ 6ఏ కేసు నమోదు చేశారు. కొన్ని గంటల వ్యవధిలోనే రేషన్ బియ్యం కాదని అధికారులకు నివేదిక అందజేశారు. అంతేకాకుండా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు బియ్యాన్ని మిల్లు నిర్వాహకులకు అప్పజెప్పారు. దీనిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. తప్పుడు నివేదికలు ఇవ్వడంపై రాష్ట్ర స్థాయి అధికారులకు సమాచారం అందించారు. అలాగే రేషన్ మాఫియాతో చేతులు కలిపి ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టించిన స్థానిక అధికారులపై గతంలో ‘నమస్తే తెలంగాణ’లో ‘పట్టుబడిన బియ్యం పక్కదారి’ అనే కథనం ప్రచురితమైంది. జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధి కూడా అదనపు కలెక్టర్‌పై ఫిర్యాదు చేశారు. దీంతో రాష్ట్ర స్థాయి విజిలెన్స్, సివిల్ సైప్లె అధికారులు విచారణ వేగవంతం చేశారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ పూర్ణచందర్ రావు నేతృత్వంలో బాధ్యులపై చర్యలు తీసుకోనున్నారు. అక్రమార్కులకు రెవెన్యూ, పోలీసులు, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అండగా ఉండడంతో దాదాపుగా రూ.46 లక్షలకు పైగా ప్రభుత్వానికి నష్టం వాటిల్లిందని గుర్తించారు. ఈ క్రమంలో గతంలో పనిచేసిన అదనపు కలెక్టర్‌తోపాటు రెవెన్యూ ఇన్స్పెక్టర్, సివిల్ సైప్లె డీటీపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. సీఐ, ఎసై, తాసిల్దార్, ఔట్ సోర్సింగ్ అధికారిపై కూడా నిబంధనలు, గైడ్‌లైన్స్ ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించింది. ఇందుకు సంబంధించి 2020 అక్టోబర్ 12న 1683/4, ఈ/డీ 1/2020 నంబర్‌తో విచారణ ఇచ్చారు. దీని ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.
ఒక్కరిపైనే కేసు నమోదు..
విచారణ ఆధారంగా ఏడుగురిపై కేసు నమోదు చేసి రేషన్ బియ్యన్ని స్వాధీనం చేయండంతోపాటు వాహనాన్ని సీజ్ చేయాల్సి ఉంటుంది. రైస్‌మిల్లులో హమాలీలను విచారించాలి. ఇందుకనుగుణంగా చార్జీషీట్ ఫైల్ చేయాలి. కానీ ఇవేవీ జరగకుండా సివిల్ సైప్లె డీటీపై మాత్రమే కేసు నమోదు చేసి పోలీస్ ఉన్నతాధికారులు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారు. అంతేకాకుండా డీటీకి స్టేషన్ బెయిల్ ఇవ్వడంలో రూ.లక్షలు చేతులు మారినట్లు తెలిసింది. కొన్ని నెలలపాటు కేసు నీరుగార్చి ఇప్పుడు చార్జిషీట్ ఫైల్ చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు ఇచ్చిన రిపోర్ట్‌లో ఏడుగురు అధికారులు ఉన్నా.. ఒక్కరిపైనే చర్యలు తీసుకోవడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. వారిని కాపాడేందుకు ఉన్నత స్థాయి అధికారి చక్రం తిప్పినట్లు బలంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహరంలో అందరికీ రూ.8 నుంచి రూ.10 లక్షల వరకు ముడుపులు ఇప్పించేందుకు ఒక పాత్రియుడు తీవ్రంగా ప్రయత్నించినట్లు సమాచారం. ఉన్నత స్థాయి అధికారికి రూ.5 లక్షలు, మరో ఇద్దరు అధికారులకు రూ.1.50 లక్షల చొప్పున డబ్బులు ఇచ్చినట్లు తెలిసింది. కాగా, ఎస్పీ జె.రంజన్ రతన్‌కుమార్‌ను వివరణ కోరగా.. రేఖ రైస్ మిల్లు వ్యవహారంలో ఎవరిని వదిలే ప్రసక్తి లేదని, అక్రమాలకు పాల్పడిన వారిపై అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి చార్జీషీట్ ఫైల్ చేశామని తెలిపారు.