
అవసరం లేకున్నా స్కానింగ్
ప్రైవేట్ దవాఖానల్లో కమీషన్ల దందా
కరోనా పేరుతో అడ్డగోలు దోపిడీ
మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ, జనవరి 29 : మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ దవాఖానల్లో సీటీస్కాన్ పేరిట రోగులను పీల్చి పిప్పి చేస్తున్నారు. జ్వరం, దగ్గు వచ్చి దవాఖానకు వెళ్లినా.. సీటీస్కాన్ చేయించుకోవాలని సిఫార్సు చేస్తున్నారు. అందులో చిన్నపాటి ఇన్ఫెక్షన్ కనిపించినా కరోనా లక్షణాలు ఉన్నాయంటూ గందరగోళానికి గురిచేస్తున్నారు. ప్రభుత్వ దవాఖానల్లో నెగెటివ్ రిపోర్టు వచ్చిందని చెబుతున్నా.. వినడం లేదు. ఇదిలా ఉండగా, డయాగ్నోస్టిక్ సెంటర్లు సీటీస్కాన్ ధరలను అమాంతంగా పెంచేశాయి. గతంలో రూ.2000 ఉండగా.. ప్రస్తుతం రూ.6000కు చేరుకున్నది. ఇందులో 50 శాతం కమీషన్‌ను పేషెంట్‌ను పంపించిన దవాఖాన యజమానులకు చెల్లిస్తునారు. కమీషన్ కోసం కక్కుర్తి పడి.. అవసరం ఉన్నా లేకున్నా స్కానింగ్ చేయించుకురావాల్సిందేనని ఇబ్బంది పెడుతున్నారు. గతిలేని పరిస్థితిలో రోగులు డయాగ్నోస్టిక్ సెంటర్లు చెప్పిన ధర చెల్లించి స్కానింగ్ చేయించుకుంటున్నారు. కరోనా పేరిట అడ్డగోలు దోపిడీ చేస్తున్నారు. కరోనా నిర్ధారణలో చెస్ట్ సీటీస్కాన్ ప్రామాణికం కాదని వైద్యారోగ్య శాఖ నిపుణులు చెబుతున్నారు. ఇన్ఫెక్షన్ ఎంత ఉందో గుర్తించినప్పటికీ.. మళ్లీ నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలంటున్నారు. ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్ యాంటిజన్ పరీక్షల్లో పాజిటివ్ వస్తే.. సదరు వ్యక్తికి చెస్ట్‌లో ఇన్ఫెక్షన్ ఉందో లేదో తెలుసుకునేందుకు ఎక్స్‌రే తీస్తే సరిపోతుందంటున్నారు. అతికొద్ది మందికి మాత్రమే సీటీస్కాన్ అవసరం పడుతుందని చెబుతున్నారు. ఆర్టీపీసీఆర్లో నెగెటివ్ వచ్చిన వారికి సైతం చెస్ట్ సీటీస్కాన్ చేసి.. పాజిటివ్ వచ్చిందంటూ ప్రైవేట్ దవాఖానలు చికిత్స చేస్తున్నారు. సీటీస్కాన్ చేయడం వల్ల చాలా ప్రమాదం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రేడియేషన్ ప్రభావంతో మరిన్ని ప్రాణాంతక వ్యాధులు సోకే ప్రమాదం ఉందంటున్నారు. అత్యవసర పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న పరీక్షల ద్వారా వ్యాధి నిర్ధారణ కాకుంటే మాత్రమే సీటీస్కాన్ చేయించాలి. అనవసరంగా సీటీస్కాన్ చేసి డబ్బులు దండుకోవడంతోపాటు రోగుల ప్రాణాలతో చెలగాటమాడడం సరికాదని హెచ్చరిస్తున్నారు.