
దేవరకద్ర రూరల్, జనవరి 29 : గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వర గా పూర్తి చేయాలని ఎంపీపీ హర్షవర్ధన్‌రెడ్డి అధికారులకు సూచించారు. చిన్నచింతకుంట మండల పరిషత్ కార్యాలయంలో శనివారం ఎంపీపీ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు శాఖల అధికారులు ప్రగతి నివేదికలను చదివి వినిపించారు. అలాగే వివిధ గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ప్రజాప్రతినిధులు సభ దృష్టికి తీసుకొచ్చారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ గ్రామాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించా రు. డ్రైనేజీల్లో బ్లీచింగ్‌పౌడర్ చల్లడంతోపాటు దోమల నివారణ మందును పిచికారీ చేయించాలని తెలిపారు. కరోనా బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్ఎంపీ వైద్యులు ప్రథమ చికిత్స మాత్రమే చేయాల్సి ఉండగా, కొన్ని గ్రా మాల్లో అవసరం లేకున్నా స్లైన్ బాటిళ్లు ఎక్కి స్తూ.. ఒక్కో బాటిల్‌కు రూ.500వరకు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఆర్ఎంపీలపై వైద్యాధికారులు పర్యవేక్షణ పెంచి నిబంధనలు పాటించనివారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో జెడ్పీటీసీ రాజేశ్వరి, ఎంపీడీవో శ్రీనివాస్‌రెడ్డి తదితరులు ఉన్నారు.