
అమ్మాపూర్ బ్రిడ్జి నిర్మాణానికి మోక్షం
రూ.3కోట్లతో కొనసాగుతున్న పనులు
హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు
నవాబ్‌పేట, జనవరి 29 : మండల ప్రజల దశాబ్దాల కల సాకారమవుతున్నది. ఎన్నో ఏండ్లుగా అవస్థలు పడుతున్న వివిధ గ్రామాల ప్రజల సమస్య త్వరలోనే తీరిపోనున్నది. మండలంలోని అమ్మాపూర్‌లో బ్రిడ్జి నిర్మాణానికి ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రత్యేక చొరవతో రూ.3కోట్లు మంజూరు కావడంతో పనులను ప్రారంభించారు. దీంతో మండ ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నవాబ్‌పేట నుం చి అమ్మాపూర్, జంగమయ్యపల్లి, కొల్లూరు, దేపల్లితోపాటు వివిధ గిరిజన తండాలకు వెళ్లాలంటే అమ్మాపూర్ బ్రిడ్జి మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. అలాగే జిల్లా కేంద్రం నుంచి సైతం కొందుర్గు, పరిగి, షాద్‌నగర్ వెళ్లాలన్నా ఇదే రోడ్డుపై వెళ్లాలి. అయితే అమ్మాపూర్ గేటువద్ద బ్రిడ్జి పూర్తిగా ధ్వంసం కావడంతో ద్విచక్రవాహనదారులు సైతం ప్రయాణించేందుకు అవస్థలు ప డాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దశాబ్దాలపాటు ధ్వం సమైన బ్రిడ్జిపైనే ప్రజలు, వాహనదారులు రాకపోకలు సాగించారు. అయితే బ్రిడ్జి పూర్తిగా ధ్వంసం కావడం తో తరచూ ప్రమాదాలు చోటుచేసుకునేవి. ప్రమాదా ల్లో ఇద్దరు, ముగ్గురు మృతి చెందిన ఘటనలు కూడా ఉన్నాయి. వర్షాకాంలో పరిస్థితులు మరీ దారుణంగా ఉండేవి. మోస్తరు వర్షం పడితే బ్రిడ్జిపై రాకపోకలు నిలిచిపోయేవి. దీంతో ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. కాగా, 6నెలల కిందట ఎంపీ, ఎమ్మెల్యే చొరవతో రూ.3కోట్లు మంజూరు కాగా, ఇటీవల పనులు ప్రారంభమయ్యాయి. మరో మూడు, నాలుగు నెలల్లో నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు కసరత్తు చేస్తున్నారు. బ్రిడ్జి పనులు ప్రారంభం కావడంతో మండల ప్రజలతోపా టు వాహనదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.