
1 నుంచి భూ విలువ ఆధారంగా చార్జీల పెంపు
ప్రభుత్వ ప్రకటనతో జోరుగా క్రయవిక్రయాలు
మూడు రోజులుగా భారీగా లావాదేవీలు
కిటకిటలాడిన రిజిస్ట్రేషన్ కార్యాలయాలు
మహబూబ్నగర్, జనవరి 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువలను ఫిబ్రవరి 1వ తేదీ నుంచి పెంచనుండడంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద సందడి నెలకొన్నది. క్రయవిక్రయాల కోసం వచ్చే వారితో కార్యాలయాలు కిటకిటలాడాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న 12 సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాల పరిధిలోనూ రిజిస్ట్రేషన్లు భారీగా కొనసాగాయి. మహబూబ్నగర్, గద్వాల, జడ్చర్ల, కల్వకుర్తి తదితర కార్యాలయాల్లో రాత్రి వరకు రిజిస్ట్రేషన్లు జరిగాయి. మరోవైపు ఈ నెల 27న దశమి, 28న ఏకాదశి ఉండడంతో భారీగా రిజిస్ట్రేషన్లు అయ్యాయి. శుక్రవారం 1,139 రిజిస్ట్రేషన్లు కాగా.. రూ.2.95 కోట్ల ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. శనివారం 831 రిజిస్ట్రేషన్లు కాగా.. రూ.2,45,51,218 ఆదాయం వచ్చింది. ఆదివారం సెలవు కావడంతో ఈ నెల 31న సోమవారం ప్రస్తుతం ఉన్న రిజిస్ట్రేషన్ ఛార్జీలతో లావాదేవీలకు ఒక్క రోజే గడువు మాత్రమే మిగిలి ఉంటుంది. కాబట్టి సోమవారం కార్యాలయాల వద్ద మరింత సందడి నెలకొననున్నది. రిజిస్ట్రేషన్ల కోసం రద్దీ పెరిగినా.. సర్వర్ సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుందని అధికారులు తెలిపారు.