బాధితులకు మెరుగైన సేవలందించాలి
ప్రజారక్షణపై ప్రత్యేక దృష్టి
డీజీపీ మహేందర్‌రెడ్డి
రామగుండంలో కమిషనరేట్,విశ్రాంతి భవనాల పరిశీలన
పోలీస్ ఉన్నతాధికారులతో సమీక్ష
జ్యోతినగర్/ఫర్టిలైజర్ సిటీ, జూన్ 28:రాష్ట్ర పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణలో కీలకంగా వ్యవహరిస్తూ ప్రజల హృదయాలను గెలుచుకోవాలని డీజీపీ మహేందర్‌రెడ్డి సూచించారు. సోమవారం పెద్దపల్లి జిల్లా రామగుండానికి వచ్చిన ఆయన మొదట గోదావరిఖనిలో రూ.19 కోట్లతో నిర్మిస్తున్న పోలీస్ కమిషనరేట్ భవనం, రూ. 3.5 కోట్లతో నిర్మిస్తున్న పోలీస్ విశ్రాంతి భవనం, మోడల్ పోలీస్‌స్టేషన్‌ను పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్‌తో కలిసి డీసీపీ పరిశీలించారు. అనంతరం ఎన్టీపీసీ ఈడీసీ మిలీనియం హాల్లో కమిషనరేట్ పరిధి పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలకు చెందిన పోలీసు ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
తెలంగాణ పోలీసులు ఎల్లప్పుడూ శాంతి భద్రతల పరిరక్షణలో కీలకంగా వ్యవహరిస్తూ ప్రజల హృదయాలను గెలుచుకోవాలని డీజీపీ మహేందర్‌రెడ్డి సూచించారు. ఎన్టీపీసీ ఈడీసీ మిలీనియం హాల్లో కమిషనరేట్ పరిధి పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలకు చెందిన పోలీసు ఉన్నతాధికారులకు నిర్వహించిన సమీక్షా సమావేశంలో డీజీపీ మాట్లాడారు. బాధితులకు అనుకున్న దానికంటే 10రెట్లు మెరుగైన సేవలు అందించాలన్నారు. తెలంగాణ పోలీసు శాఖలో వచ్చిన విప్లవాత్మకమైన మార్పులతో పోలీసింగ్‌లో ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచిందని, నైతిక విలువలు, మానవీయత, 5ఎస్ వర్టికల్స్, ఇతర అంశాలపై పోలీసు అధికారులు సిబ్బందికి నిరంతరం పునశ్చరణ నిర్వహించాలని సూచించారు. పోలీసు శాఖ నూతన టెక్నాలజీపై సిబ్బందికి పూర్తి అవగాహన ఉండాలన్నారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ప్రతి ఒక్కరినీ మర్యాదపూర్వకంగా పలుకరించి వారికి న్యాయం జరిగేలా చూడాలన్నారు. వ్యక్తి ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా వ్యవహరించవద్దని ఆదేశించారు. మరియమ్మ లాకప్ డెత్ లాంటి ఘటన పరిస్థితి పునరావృతం కావద్దన్నారు. రాష్ట్రంలో నకిలీ విత్తనాలపై, గుట్కా వ్యాపారంపై తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలని సీఎం కేసీఆర్ సూచించారని గుర్తుచేశారు. రామగుండం పోలీసు కమిషనరేట్ పరిధిలో నకిలీ విత్తనాలు, గుట్కా వ్యాపారం జరుగకుండా చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు ఆస్కారం లేకుండా లాఅండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉందని కమిషనరేట్ పనితీరును డీజీపీ అభినందించారు. ఇక్కడ అడిషనల్ డీజీపీ శ్రీనివాస్‌రెడ్డి, ఐజీ ప్రభాకర్‌రావు. నార్త్ ఐజీ నాగిరెడ్డి, తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, రామగుండం సీపీ వి.సత్యనారాయణ, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలకు చెందిన సీఐలు ఉన్నారు. అంతకుముందు మధ్యాహ్నం ప్రత్యేక హెలిక్యాప్టర్‌లో వచ్చిన డీజీపీ మహేందర్‌రెడ్డికి ఎన్టీపీసీ టౌన్‌షిప్‌లోని హెలిప్యాడ్‌లో పోలీసు ఉన్నతాధికారుల నుంచి ఘన స్వాగతం లభించింది.
కమిషనరేట్, విశ్రాంతి భవనం మోడల్ పోలీస్‌స్టేషన్ పరిశీలన
గోదావరిఖనిలో రూ.19 కోట్లతో నిర్మిస్తున్న పోలీస్ కమిషనరేట్ భవనం, రూ.3.5 కోట్లతో నిర్మిస్తున్న పోలీస్ విశ్రాంతి భవనం, మోడల్ పోలీస్‌స్టేషన్‌ను సోమవారం పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్‌తో కలిసి డీజీపీ మహేందర్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా రక్షణపై పోలీసుశాఖ ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం పోలీస్ శాఖకు వసతులు పెరిగాయని, ఈ నేపథ్యంలో ప్రజలకు నమ్మకంగా సేవలందిస్తున్నామన్నారు. గోదావరిఖని మోడల్ పోలీస్‌స్టేషన్‌ను రాష్ట్రంలోనే సుందరంగా తీర్చిదిద్దడం అభినందనీయమని చెప్పారు. కమిషనరేట్ కార్యాలయం భవనాలకు సింగరేణి, ఎన్టీపీసీ యాజమాన్యం నిధులు కేటాయించడం హర్షించదగ్గ విషయమన్నారు. పరిశ్రమలకు నిలయంగా రామగుండం ఉందని, గతంలో తాను ఇక్కడే మొదటి పోస్టింగ్ పొందానని గుర్తు చేసుకున్నారు. గతంలో సిద్ధిపేట, కామారెడ్డి కమిషనరేట్ కార్యాలయాలను సీఎం ప్రారంభించారన్నారు. వచ్చే నెలలో విశ్రాంతి భవనం, మోడల్ పోలీస్‌స్టేషన్‌ను ప్రారంభించనున్నామని వెల్లడించారు. అవసరం మేరకు సిబ్బంది సంఖ్యను పెంచుతున్నామని, రానున్న రోజుల్లో కొత్తగా 18వేల పోస్టులను మంజూరు చేశామని తెలిపారు. కమిషనరేట్‌లో ఎస్‌హెచ్‌వోల అప్‌గ్రేడ్ కోసం చర్యలు తీసుకుంటామని చెప్పారు. కోలేటి దామోదర్ మాట్లాడుతూ.. సీఎంగా బాధ్యతలు స్వీకరించాక కేసీఆర్ శాంతి భద్రతలకు ప్రాధాన్యం ఇస్తున్నారని పేర్కొన్నారు. ఇందుకు రూ.375 కోట్లు పోలీస్ శాఖకు కేటాయించి ఆన్లైన్ టెండర్ విధానం ద్వారా నాణ్యమైన పోలీస్ భవనాలు, కార్యాలయాలు ఏర్పాటు చేయడం ఆయన దూరదృష్టికి నిదర్శనమన్నారు.
పారిశ్రామిక ప్రాంతంలో విశ్రాంతి భవనం లేకపోవడంతో తన విజ్ఞప్తి మేరకు సీఎం కేసీఆర్ నిధులు కేటాయించడం అభినందనీయమన్నారు. రామగుండం సీపీ సత్యనారాయణ మాట్లాడుతూ.. కార్పొరేట్ కార్యాలయాలకు దీటుగా రామగుండం కమిషనరేట్‌తోపాటు పోలీస్ భవనాలను ఏర్పాటు చేయడం సీఎం కేసీఆర్, డీజీపీ కృషి ఎంతో ఉందని, స్థానికుడైన హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ పాత్ర అమోఘమన్నారు. డీజీపీ నేపథ్యంలో ఓఎస్డీ శరత్ చంద్ర పవార్, నికితా పంత్, అడిషనల్ డీసీపీ సంజీవ్, ఆర్ఐ సుందర్ రావు నేతృత్వంలో పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. కార్యక్రమంలో అడిషనల్ డీజీపీ శ్రీనివాస్‌రెడ్డి, ఇంటెలిజెన్స్ ఐజీ ప్రభాకర్‌రావు, నార్త్ జోన్ ఐజీ నాగిరెడ్డి, ఏసీపీ ఉమేందర్, ట్రాఫిక్ ఏసీపీ బాలరాజు, డీసీపీలు ఉదయ్‌కుమార్, రవీందర్, అడ్మిన్ డీసీపీ అశోక్ కుమార్‌తోపాటు వన్ టౌన్ సీఐ రమేశ్‌బాబు, రాజ్‌కుమార్, ప్రవీణ్ తదితరులున్నారు.