కొనసాగుతున్న కాళేశ్వర పథకం ఎత్తిపోతలు
పెద్దపల్లి, జూన్ 25(నమస్తే తెలంగాణ)/ ధర్మారం/ రామడుగు/ మల్యాల/ బోయినపల్లి/ తిమ్మాపూర్/ ఇల్లంతకుంట : శ్రీరాజరాజేశ్వర జలాశయం నుంచి ఎగువకు వెళ్తున్న జలాలు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తిప్పాపూర్‌లోని పంప్‌హౌస్ నుంచి అన్నపూర్ణ జలాశయంలోకి పరవళ్లు తొక్కుతున్నాయి. మరోవైపు కాళేశ్వరం లింక్-1 లక్ష్మీ పంపుహౌస్‌లోని 5 పంపుల ద్వారా ఎగువన గల సరస్వతీ బరాజ్‌లోకి 10,500 క్యూసెక్కులు, ఇక్కడి పంపు హౌస్‌లోని ఆరు పంపుల ద్వారా పార్వతీ బరాజ్‌లోకి 17,580, ఇక్కడి పంపుహౌస్‌లోని 9 పంపుల ద్వారా ఎల్లంపల్లి జలాశయంలోకి 29,490 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు. అలాగే పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారంలోని లింక్-2లోని నంది పంపుహౌస్‌లో ఆరు పంపుల ద్వారా నంది రిజర్వాయర్‌లోకి 18,900 క్యూసెక్కులు ఎత్తిపోస్తుండగా, అక్కడి నుంచి జంట సొరంగాల ద్వారా కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్‌లోని గాయత్రీ పంప్‌హౌస్‌కు చేరుతున్నాయి.
ఇక్కడ ఆరు పంపులు ఎత్తిపోస్తుండగా ఒకవైపు శ్రీరాజరాజేశ్వర జలాశయం, మరోవైపు ఎస్సారెస్పీ పునర్జీవ పథకం ద్వారా జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాంపూర్ పంప్‌హౌస్‌కు నీటిని తరలిస్తున్నారు. ఈసారి ఇక్కడి పంపుల ద్వారా 13.5 టీఎంసీలు ఎత్తిపోసినట్లు ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు తెలిపారు. రాంపూర్ వద్ద 2 మోటర్ల ద్వారా 2900 క్యూసెక్కుల నీటిని రాజేశ్వర్రావుపేట పంప్‌హౌస్‌కు పంపిస్తున్నారు. వరదకాలువ 122 కిలోమీటర్ల మేర నిండుకుండలా మార్చడంతో పాటు కాలువను ఆనుకుని ఉన్న తూముల ద్వారా చెరువులను నింపుతున్నట్లు తెలిపారు. మరోవైపు శ్రీరాజరాజేశ్వర జలాశయానికి గాయత్రీ పంప్‌హౌస్ నుంచి తరలుతుండగా, ఇక్కడి నుంచి ఇల్లంతకుంట మండలంతిప్పాపూర్ పంప్‌హౌస్‌కు తరలిస్తున్నారు. ఇక్కడ సోమవారం నుంచి మొదటి పంపుతో అన్నపూర్ణ ప్రాజెక్టులోకి 2830 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 2.33 టీఎంసీల నీరు నిల్వ ఉందని డీఈఈ శ్రీనివాస్, ఏఈ సమరసేన తెలిపారు. ఇటు ఎల్ఎండీలో 24.034 టీఎంసీల సామర్థ్యానికి ప్రస్తుతం 20.740 టీఎంసీలుండగా పైనుంచి 337 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో వస్తున్నది. తాగునీటి అవసరాలకు ఎల్ఎండీ నుంచి 337 క్యూసెక్కులు అవుట్‌ఫ్లో రూపంలో వెళ్తున్నట్లు అధికారులు తెలిపారు.