
దినదినాభివృద్ధి చెందుతున్న ముత్యాలమ్మనగర్
కొత్త రూపును సంతరించుకున్న పంచాయతీ
ఇంటింటికీ వచ్చి చెత్త సేకరిస్తున్న పారిశుధ్య సిబ్బంది
గ్రామం పరిశుభ్రంగా ఉండడంతో సీజనల్ దూరం
మణుగూరు రూరల్, ఏప్రిల్ 28:ప్రగతి వైపు పరుగులు పెడుతోంది ఆ గ్రామం. ఒకప్పుడు సమస్యలతో సతమతమైన ఆ గ్రామం నేడు దినదినాభివృద్ధి చెందుతోంది. పల్లె ప్రగతితో కొత్త రూపు సంతరించుకుంది. అదే మణుగూరు మండలంలోని ముత్యాలమ్మనగర్ గ్రామం.
పల్లె ప్రగతి కార్యక్రమం అమల్లోక వచ్చాక ప్రతి పంచాయతీకీ ప్రభుత్వం నెలవారీగా నిధులు కేటాయిస్తుండడం, అభివృద్ధి పనులకు వాటిని వెచ్చిస్తుండడంతో ఆ గ్రామం అభివృద్ధి బాట పడుతోంది. హరితహారం మొక్కలు గ్రామాన్ని పచ్చదనంగా మార్చేశాయి. పల్లె ప్రకృతి వనం ఆహ్లాదాన్ని పంచుతోంది. మిషన్ భగీరథతో ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందుతోంది. ప్రతిరోజూ విధిగా పారిశుధ్య పనులు చేపడుతుండడంతో పరిశుభ్రత కన్పిస్తోంది. డంపింగ్‌యార్డు, వైకుంఠధామం అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఆ పల్లె రూపురేఖలు మారిపోయాయి.
అభివృద్ధి పనులు ఇలా..
ఇంటింటికీ తాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం 40 వేల లీటర్ల కెపాసిటీతో సంతోశ్‌నగర్‌లో ఓ వాటర్ ట్యాంకుకు, 20 వేల లీటర్ల కెపాసిటీతో ముత్యాలమ్మనగర్లో మరో ట్యాంకును నిర్మించింది.
తొలుత కొన్ని వీధులకు నీటి సరఫరా సమస్యాత్మకంగా మారడంతో సర్పంచ్, స్థానిక ప్రజాప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో ఇప్పుడు సమస్య పూర్తిగా పరిష్కారమైంది.
రూ.11 లక్షలతో నిర్మిస్తున్న వైకుంఠధామం నిర్మాణం చివరి దశకు చేరింది. పనులు కొంత ఆలస్యం అవడంతో పంచాయతీ పాలకవర్గం, యంత్రాంగం పనులు వేగిరం చేసేందుకు కృషి చేస్తున్నారు.
ప్రతి రోజూ పారిశుధ్య సిబ్బంది విధిగా చెత్తసేకరణ చేస్తూ డంపింగ్‌యార్డుకు తరలిస్తున్నారు. దీంతో గ్రామంలో పరిశుభ్రత ఏర్పడింది. వ్యాధులు పూర్తిగా తగ్గాయి.
ముత్యాలమ్మనగర్ పంచాయతీలో ఎకరం స్థలంలో ఒక పల్లె ప్రకృతి వనాన్ని, అర ఎకరం స్థలంలో మరో పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేశారు. మొత్తం 6 వేల మొక్కలు నాటి నీళ్లు పోస్తున్నారు. ఇప్పుడవి ఏపుగా పెరిగి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. నర్సీరీలో 11 వేల మొక్కలను పెంచుతున్నారు. రోడ్లకు ఇరువైపులా 134 మొక్కలు నాటి ట్రీగార్డులు ఏర్పాటు చేశారు.
ముత్యాలమ్మనగర్, సంతోశ్‌నగర్, మదీనానగర్లలో రూ.10 లక్షలతో సీసీ రోడ్లు, సంతోశ్‌నగర్‌లో మరికొన్ని గ్రావెల్ రోడ్లు పూర్తిచేశారు.
అందరి సహకారంతోనే అభివృద్ధి..
‘ఎమ్మెల్యే రేగా కాంతారావు, స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో పంచాయతీ అభివృద్ధి చెందుతోంది. ప్రభుత్వం ఇంటింటికీ తాగునీరు అందించాలనే సంకల్పంతో మిషన్‌భగీరథను చేపట్టింది. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో కొన్ని వీధులకు నీరు అందడం లేదు. ఎండాకాలం సమస్య తీవ్రమయ్యే పరిస్థితి నెలకొనడంతో సమస్య పరిష్కరించాలని సంబంధిత అధికారులకు వివరించాం. వాళ్లు సమస్యను పరిష్కరిస్తున్నారు.’
-కొమరం జంపేశ్వరి, సర్పంచ్