
ఎందరినో ఉన్నత చదువుల వైపు మళ్లించిన సరస్వతీ నిలయం
ఇక్కడి ఆంగ్ల మాధ్యమం సీట్లకు డిమాండ్
కార్పొరేట్‌ను తలదన్నేలా విద్యాబోధన
ప్రైవేటు స్కూళ్లను వదిలి వస్తున్న విద్యార్థులు
తొమ్మిదేండ్లుగా పెరుగుతున్న సంఖ్య
మహబూబ్‌నగర్, జనవరి 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పాలమూరులోని షాషాబ్‌గుట్ట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కార్పొరేట్‌కు దీటుగా విద్యాబోధన కొనసాగుతున్నది. ఇక్కడి ఆంగ్ల మాధ్యమానికి ఎంతో డిమాండ్ ఉన్నది. మెరుగైన విద్యాబోధన అందు తుండడంతో ప్రైవేట్ స్కూళ్లను వదిలి ఇక్కడికి వచ్చి చేరుతున్నారు. అందుకే ఇంగ్లిష్ మీడియంలో సీట్లు దొరకడం మహాకష్టం. 2005లో సక్సెస్ స్కూల్స్‌లో భాగంగా ఇంగ్లిష్ మీడియం ప్రారంభం కాగా.. మొదట్లో అడ్మిషన్లు పెద్దగా కాలేదు. తొమ్మిదేండ్లుగా విద్యార్థుల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. ఈ ఏడాది ఏకంగా 174 మంది చేరారు. ప్రైవేటు కంటే ఇక్కడే బోధన బాగుందని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇక్కడ చదివిన ఎందరో ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్నారు. అందుకే క్రేజ్ బాగా పెరిగి మేము సర్కార్ బడిలోనే చదువుతున్నామని సగర్వంగా చెబుతున్నారు.
వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వమే ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు ప్రారంభిస్తున్న నేపథ్యంలో పలు చోట్ల ఇప్పటికే ఆంగ్ల మాధ్యమంలో నడుస్తున్న స్కూళ్లపై చర్చ జరుగుతున్నది. ఈ తరుణంలో మహబూబ్‌నగర్ పట్టణంలో షాషాబ్‌గుట్ట ప్రభుత్వ ఉన్నత పాఠశాలపై అందరి దృష్టి మళ్లింది. ఈ పాఠశాలలో 9 ఏండ్లుగా ఏటా ఇంగ్లిష్ మీడియంలో చేరుతున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నది. 2013-14 లో 36 మంది విద్యార్థులు ఇంగ్లిష్ మీడియంలో చేరగా.. ఈ ఏడాది ఆ సంఖ్య 174కు చేరింది. కొత్తగా ఇంగ్లిష్ మీడియంలో చేరుతున్న విద్యార్థులంతా అప్పటికే ప్రైవేటు స్కూ ళ్లో చదువతున్న వాళ్లు కావడం విశేషం. ప్రైవేటుతో పోలిస్తే ఇక్కడే బాగుందని విద్యార్థులు చెప్పడం గమనార్హం. ఇక్కడే చదివిన ఓ విద్యార్థికి కాన్పూర్ ఐఐటీలో మెకానికల్ ఇంజినీరింగ్‌లో సీట్ రావడం చూస్తే ఈ స్కూల్ ప్రత్యేకత ఏంటో అర్థం అవుతున్నది. ఇక్కడి విద్యాబోధన.. ప్రైవేటు స్కూళ్లకంటే ఓ మెట్టు ఎక్కువే అని చెప్పొచ్చు.
సీట్లు దొరకడం మహా కష్టం..
ప్రైవేటు స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం చదువులకు డి మాండ్ ఉండడం సహజం. కానీ మహబూబ్‌నగర్ పట్టణంలోని షాషాబ్‌గుట్ట ప్రభుత్వ హైస్కూల్ మాత్రం ప్రైవేటుకు పోటీగా నిలుస్తున్నది. 2005లో సక్సెస్ స్కూల్స్‌లో భాగంగా ఈ పాఠశాలలోనూ ఇంగ్లిష్ మీడియం ప్రారంభించారు. మొదట్లో అడ్మిషన్లు పెద్దగా కాకపోయినా.. 2015-16 విద్యా సంవత్సరం నుంచి క్రేజ్ పెరిగిపోయిం ది. పీజీ చేసిన వాళ్లే ఫ్యాకల్టీ కావడం, ఆంగ్లం మీద పట్టు ఉండడంతో విద్యార్థులకు చక్కని బోధన చేసే అవకాశం ఏర్పడింది. ఈ విషయం ఆనోటా ఈ నోటా విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కూడా తెలియడంతో ఏటా కొత్త అ డ్మిషన్ల సంఖ్య పెరుగుతున్నది. తరగతి గదుల కొరతతో ఈ ఏడాది సుమారు 200 మందికి అడ్మిషన్లు ఇవ్వలేకపోయారు. ఆరో తరగతిలో చేరిన విద్యార్థులకు ఇంగ్లిష్‌లో ప్రాథమికాంశాలు చెప్తూ ఉపాధ్యాయులు ప్రోత్సహిస్తున్నా రు. ఎక్కడెక్కడ వెనకబడ్డారో గమనించి విద్యార్థులను తీ ర్చిదిద్దుతున్నారు. దీంతో ఇంగ్లిష్ అంటే విద్యార్థులకు భ యం పోయింది. ఫలితంగా చాలా మంది మంచి మార్కులతో పాసయ్యారు. అప్పటివరకు తెలుగు మీడియంలో బోధించిన ఉపాధ్యాయులు కూడా నిత్యం ఇంటి వద్ద సబ్జెక్టులు బాగా ప్రిపేరవుతుండడంతో విద్యార్థులకు చక్కగా అర్థమవుతున్నది.
దీంతోపాటు విద్యార్థులను నేషనల్ మెరిట్ స్కాలర్ షిప్ టెస్టుకు కూడా ప్రిపేర్ చేయిస్తున్నారు. ఏటా ముగ్గురు లేదా నలుగురు విద్యార్థులకు ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ వస్తున్నది. ఏటా పాలిసెట్‌లో ప్రతిభ కనబరుస్తూ ఉత్తమ పాలిటెక్నిక్ కళాశాలల్లో సీట్లు సాధిస్తున్నా రు. గురుకులాల సీవోఈల్లోనూ సత్తా చాటుతున్నారు. ఇ దంతా ఇక్కడ అందించే ఇంగ్లిష్ మీడియం చదువుల వల్లే సాధ్యమవుతున్నదని విద్యార్థులు చెబుతున్నారు. తెలుగు మీడియం బాగా చదవగలిగిన విద్యార్థులంతా ఇంగ్లిష్ మీ డియంలోనూ రాణించగలరని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఈ పాఠశాలలో మొత్తం 17 గదులుండగా.. అం దులో ఒకటి కార్యాలయానికి, మరొకటి స్టాఫ్ కోసం కేటాయించారు. ప్రతి తరగతి గదిలోనూ కనీసం 70 నుంచి 80 మంది విద్యార్థులుంటున్నారు. ప్రస్తుతం 720 మంది చదువుతున్నారు. తెలుగుతోపాటు ఇంగ్లిష్ మీడియం కూ డా రెండు సెక్షన్లు ఏర్పాటు చేశారు. ‘మాకు ఓ సీటవ్వండి సర్’ అని విద్యార్థుల తల్లిదండ్రులు అడిగినా.. ప్రస్తుతం సామర్థ్యం నిండిపోవడంతో అదనంగా ఎవరికీ సీటిచ్చే పరిస్థితి లేదు. ఉపాధ్యాయులంతా అంకితభావంతో విద్యాబోధన చేయడం వల్లే ఇక్కడ ఇంగ్లిష్ మీడియం బాగా స క్సెస్ అయ్యింది. కరోనా సమయంలో, సెలవుల్లోనూ ఉపాధ్యాయులు ఆన్లైన్లో తరగతులు బోధిస్తున్నారు. పోటీ పరీక్షలకు సైతం ఉచితంగా ఆన్లైన్ క్లాసులు చెబుతున్నా రు. ప్రభుత్వమే ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు ప్రారంభిస్తున్న తరుణంలో సదుపాయాలు ఇంకా అందుబాటులోకి వస్తే.. ఇక ప్రైవేటు స్కూళ్లకు వెళ్లే విద్యార్థుల సంఖ్య బాగా తగ్గుతుందని విద్యారంగ నిపుణులు అంటున్నారు.
కొత్త అడ్మిషన్లు ఇవ్వలేని పరిస్థితి..
ఏటా 200 మందికి పైగా విద్యార్థులు మా స్కూల్లో చేరుతున్నారు. ఈ ఏడాది ప్రైవేటు స్కూళ్ల నుంచి పెద్ద ఎత్తున వచ్చారు. ఇంగ్లిష్ మీ డియంలోనే 174 మంది కొత్తగా చేరారు. సు మారు 200 మందికి పైగా విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వలేకపోయాం. ఇప్పటికే తరగతి గదులన్నీ కిటకిటలాడుతున్నాయి. ప్రస్తుతం ఉన్న గ దులు సరిపోక ఓల్డ్ స్టూడెంట్స్ నిర్మించిన షెడ్డు లో కూడా పాఠాలు చెబుతున్నాం. ఇంగ్లిష్ మీడియం కోసం సెక్షన్లు ఏర్పా టు చేయాల్సి వస్తున్నది. మొత్తం 720 మంది విద్యార్థులుంటే.. అందులో 307 మంది ఇంగ్లిష్ మీడియంలోనే చదువుతున్నారు. కొత్తగా వచ్చే వా రంతా ఇంగ్లిష్ మీడియమే అడుగుతున్నారు. భవిష్యత్‌లో తెలుగు మీడియంలో చేరే వారి సంఖ్య చాలా తక్కువగా ఉండే అవకాశం కనిపిస్తున్నది. మేం కూడా ఇంగ్లిష్ మీడియంలో పిల్లలకు మొదట బేసిక్స్ నుంచి ప్రారంభించి వారిని గాడిలో పడేలా చేస్తాం. దాదాపుగా విద్యార్థులంతా ఇంగ్లిష్ మీడియం చదువులకు త్వరగానే అలవాటు పడుతున్నారు. వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వం అన్ని బడుల్లో ఇంగ్లిష్ మీడియం ప్రారంభించడం చాలా గొప్ప నిర్ణయం. ఇది విద్యార్థుల భవిష్యత్‌కు ఉపయోగకరంగా మారనున్నది.-సాయిబాబు, హెచ్ఎం, షాషాబ్ గుట్ట హైస్కూల్
పాఠశాలకు క్యూ కడుతున్నారు..
మా పాఠశాలలో చదివిన విద్యార్థులు అనేక మంది ఉన్నత స్థానాల్లో ఉన్నారు. పవన్ అనే వి ద్యార్థి పదో తరగతి తర్వాత ప్రవేశపరీక్షలో రా ణించి గిరిజన గురుకులంలో సీటు పొందడమే కాకుండా ఐఐటీలో సీటు సాధించారు. మరో వి ద్యార్థికి ఈ ఏడాది నీట్లో సీటు వచ్చింది. ఏ టా మేమిచ్చే కోచింగ్ వల్ల ఐదారు మంది 8వ తరగతి విద్యార్థులకు నేషనల్ మెరిట్ స్కాలర్ షిప్ వస్తున్నది. ఏటా ఇద్దరు, ముగ్గురు సోషల్ వెల్ఫేర్ గురుకుల కళాశాల లు (సీవోఈ)కి ఎంపికవుతున్నారు. వీరంతా ఐఐటీ, నీట్ సాధించే అవకా శం ఏర్పడుతున్నది. 2009లో మా స్కూల్లో ఇంగ్లిష్ మీడియం ప్రారంభమైంది. 2015 నుంచి ఇంగ్లిష్ మీడియంలోనూ మంచి ఫలితాలు రావడంతో ఇక్కడ చేరేందుకు విద్యార్థులు పోటీ పడుతున్నారు. ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయుల కంటే ఇక్కడ స్టాండర్డ్స్ బాగుంటాయి.