
మతసామరస్యానికి ప్రతీక అబ్దుల్ ఖాదర్ షా దర్గా
30న గంధోత్సవం
హాజరు కానున్న గుల్బర్గా పీఠాధిపతి
వారం రోజులపాటు వేడుకలు
మహబూబ్‌నగర్ టౌన్, జనవరి 28 : జిల్లాకేంద్రంలోని అబ్దుల్ ఖాదర్ షా దర్గా ఉర్సు వేడుకలు నేటి నుంచి ప్రా రంభంకానున్నాయి. వేడుకలను పురస్కరించుకొని నిర్వాహకులు ఏర్పాట్లను పూర్తి చేశారు. అబ్దుల్ ఖాదర్ షా దర్గా కు ఘన చరిత్ర ఉంది. అన్ని మతాలు, కులాల ప్రజలకు ఆరాధ్యంగా నిలిచింది. మతసామరస్యానికి ప్రతీకగా ప్రతి యేటా నిర్వహించే ఉర్సు వేడుకల్లో కుల, మతాలకతీతంగా ప్రజలు పాల్గొని మొక్కులు తీర్చుకుంటారు.
అబ్దుల్ ఖాదర్ షా చరిత్ర
అబ్దుల్ ఖాదర్ షా ఓ పోలీస్ కానిస్టేబుల్‌గా పని చేస్తూ 1929లో కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డ నుంచి మహబూబ్‌నగర్‌కు వచ్చి ఇక్కడే స్థిరపడిన ట్లూ ముస్లిం మతపెద్దలు చెబుతారు. ఆయన విధులు నిర్వహిస్తూనే దైవచింతన, ఆధ్యాత్మిక భావనతో ప్రజలను చేరదీసేవారు. తన పదవీ విరమణ అనంతరం ఆయన జిల్లాకేంద్రంలోని రాయిచూర్ రోడ్డులో ఓ చెట్టు కింద కూర్చొని ప్రజలకు హితబోధ చేసేవారు. ప్రతి గురు, శుక్రవారాలు ఖాదర్ షా వద్దకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తరలివచ్చి తమ బాధలు, సమస్యలను విన్నవించుకునేవారు. ఆయన సామరస్యంతో పరిష్కార మార్గాలను చెప్పే వారని తెలిసింది. అబ్దుల్ ఖాదర్ షా మరణానంతరం కుటుంబ సభ్యులు ఖాదర్ షా ఆశయాలను ఆచరణలో పెట్టేందుకు ఆ చెట్టు కిందే ఆయన సమాధిని ఏర్పాటు చేసి దర్గాను ఏర్పాటు చేశారు. అప్పటినుంచి దర్గాను కుల, మతాలకతీతంగా దర్శించుకుంటారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ దర్గా అభివృద్ధి కోసం దృష్టి సారించారు. రూ.50లక్షలతో దర్గాలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టారు.
ఉర్సు ఉత్సవాలు
ఈనెల 29 నుంచి అబ్దుల్ ఖాదర్ షా దర్గా ఉత్సవాలు ఘనంగా ప్రారంభంకానున్నాయి. 29న జలాభిషేకం (గుసూల్ షరీఫ్), 30న గంధోత్సవ కార్యక్రమం షేక్ బడే సాబ్ ఇంటి నుంచి బయలుదేరి అశోక్ టాకీస్ చౌరస్తా, ఎస్బీహెచ్ రోడ్డు, తూర్పు కమాన్, పోలీస్ క్లబ్ నుంచి వన్ టౌన్ చౌరస్తా గుండా దర్గాకు చేరుకుంటుంది. అక్కడ చాదర్లు సమర్పించి ఫాతెహాలు అందజేస్తారు. దాదాపు వారం రోజులపాటు నిర్వహించే వేడుకలు ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా ముంబయి, హైదరాబాద్, రాయిచూర్ తదితర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు పాల్గొంటారు. ఈ ఏడాది కరోనా నేపథ్యంలో భక్తులు జాగ్రత్తలు పాటించాలని దర్గా కమిటీ నిర్వాహకులు కోరుతున్నారు.
ఉత్సవాలకు గుల్బర్గా పీఠాధిపతి
దర్గా ఉత్సవాలకు కర్ణాటక ప్రసిద్ధ గుల్బర్గా షరీఫ్ దర్గాకు చెందిన పీఠాధిపతి హజ్రత్ సయ్యద్ హిదాయతుల్లా బాదే షా ఖాద్రి అల్ బాగ్దాదితోపాటు ప్రముఖ దర్గాల పీఠాధిపతులు హాజరుకానున్నారు. ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్‌గౌడ్‌తోపాటు మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, పట్టణ ప్రముఖులు వేడుకల్లో పాల్గొననున్నారు.