మడకలో పత్తి చేనులో కలుపు తీస్తున్న మహిళా కూలీలు
ఓదెల, జూన్ 27: సాగుకు కాలం కలిసి వస్తున్నది. అవసరానికి అనుగుణంగా వర్షాలు కురుస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో ఎండకాలంలోనూ చెరువులు, కుంటల్లో పుష్కలంగా నీళ్లున్నాయి. భూగర్భ జలమట్టం పెరిగింది. వానకాలం సాగుకు పెట్టుబడి ఖర్చుల కోసం తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు ద్వారా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసింది. అందుబాటులో విత్తనాలు, ఎరువులు ఉన్నాయి. 24గంటల పాటు ఉచితంగా కరెంట్ అమలులో ఉంది. దీంతో రైతన్నలు సాగు పనుల్లో బిజీగా మారారు. మక్క, పత్తి విత్తనాలు కొనుగోలు చేసిన రైతులు దుక్కులు సిద్ధం చేసుకున్నారు. విత్తనాలు పెడుతున్నారు. ఇప్పటికే పత్తి విత్తనాలు పెట్టిన రైతులు కలుపు తీసే పనుల్లో నిమగ్నమయ్యారు. ఎడ్లతో సాళ్ల మధ్యన దౌర కొడుతున్నారు. సన్నరకం సాగుకు వరి నార్లు పోస్తున్నారు. కొందరు రైతులు సేంద్రియ ఎరువు కోసం వ్యవసాయ భూముల్లో గొర్రెల మందలను పెట్టించుకుంటున్నారు. జిల్లాలో 2,89,004 ఎకరాల్లో పంటల సాగు చేయనున్నట్లు వ్యవసాయాధికారులు అంచనా వేశారు. అందుకు అనుగుణంగా విత్తనాలు, ఎరువులను కూడా రైతులకు అందుబాటులో ఉంచారు.
కేసీఆర్ సార్‌కు రైతులంటే ప్రేమ
సీఎం కేసీఆర్ సార్ అచ్చినంక ఎవుసం చేయడానికి ఎలాంటి ఇబ్బందులు లేవు. నాలాంటి యువకులం కూడా గిప్పుడు ఎవుసం చేయడానికి ముందుకువస్తున్నం. కరంట్ ఉచితంగా ఇత్తండు. విత్తనాలు, ఎరువులు దుకాణాల్లో దొరుకుతున్నయ్. నాకు నాలుగెకరాల భూమి ఉంది. రూ. 20వేల రైతుబంధు డబ్బులు అచ్చినయ్. విత్తనాలు కొన్న. దున్నడానికి, కూలీలకు కైకిళ్లు ఇత్తున్న. రెండెకరాల్లో మక్క పెడుతున్న. నీళ్ల గోసలు కూడా ఏమీ లేవు. ముఖ్యమంత్రి కేసీఆర్ సార్‌కు రైతులంటే ప్రేమ.