
ప్రసవం చేసేందుకు నిరాకరించిన వైద్యులు
ప్రసవానికి సహకరించిన స్థానిక మహిళలు
తల్లీబిడ్డ క్షేమం, శిశువుకు కరోనా నెగిటివ్
అచ్చంపేట టౌన్/నాగర్‌కర్నూల్ టౌన్, జనవరి 25: మానవత్వం మంటగలిసే విధంగా అచ్చంపేట ప్రభుత్వ దవాఖానలో ఘటన చోటు చేసుకున్నది. పురిటి నొప్పులతో దవాఖానకు వచ్చిన మహిళకు కరోనా పాజిటివ్ ఉందని, ఇక్కడ డెలివరీ చేయలేమని చెప్పడంతో నొప్పులు అధికమై దవాఖాన ఆవరణలోనే ప్రసవించింది. స్థానికుల కథనం మేరకు.. బల్మూర్ మండలం బాణాల గ్రామానికి చెందిన నిమ్మల లాలమ్మ తన మూడో కాన్పు కోసం మంగళవారం అచ్చంపేట ప్రభుత్వ దవాఖానకు వచ్చింది. మహిళలకు ఆరోగ్య పరీక్షలు జరిపించగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఆమెను దవాఖాన వర్గాలు నాగర్‌కర్నూల్ ప్రభుత్వ దవాఖానకు రెఫర్ చేస్తూ లెటర్ రాసిచ్చారు. పాజిటివ్ రావడంతో తాము వైద్య సేవలు అందించలేమని చెప్పి చేతులు దులుపుకొన్నారు. అప్పటికే రెండు, మూడు గంటల సమయం గడిచింది. మహిళకు నొప్పులు రావడం ప్రారంభమైంది. తర్వాత ఎక్కడికి వెళ్లాలో తెలియక దవాఖాన ప్రాంగణంలోని చెట్టుకింద కూర్చుండిపోయింది. కొద్దిసేపటికే నొప్పులు తీవ్రం కావడంతో ఆమె వెంట వచ్చిన సోదరి అలివేలుతోపాటు అక్కడికి వచ్చిన కొందరు మహిళలు కలిసి ప్రసవం చేశారు. తర్వాత సిబ్బంది వచ్చి తల్లీబిడ్డ(పాప)ను దవాఖానలోకి తీసుకెళ్లారు. లాలమ్మను ప్రత్యేక వార్డులో ఉంచి పీపీఈ కిట్లు ధరించి వైద్య సేవలు అందిస్తున్నారు. పుట్టిన శిశువుకు కరోనా పరీక్ష చేయగా.. నెగిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అయితే దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ కృష్ణను వివరణ కోరగా.. దవాఖానకు వచ్చిన లాలమ్మకు వైద్య సిబ్బంది ఆరోగ్య పరీక్షలు చేశారని, కరోనా పాజిటివ్ వచ్చిందన్నారు. అయితే నాగర్‌కర్నూల్ జిల్లా దవాఖానలో ప్రత్యేక కరోనా వార్డు ఉన్నందున అక్కడికి రెఫర్ చేశామన్నారు. ఆమెను అంబులెన్స్‌లో నాగర్‌కర్నూల్ దవాఖానకు తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తుండగా సదరు మహిళ చెప్పకుండానే బయటకు వెళ్లిందని తెలిపారు. బయట ప్రవసం జరిగిందని తెలిసిన వెంటనే తల్లీబిడ్డను తీసుకొచ్చి ప్రత్యేకవార్డులో వైద్యసేవలు అందిస్తున్నామని వివరించారు. మహిళ పట్ల నిర్లక్ష్యం వహించలేదని, దవాఖానలో పలువురు కొవిడ్ బారిన పడడంతో సిబ్బంది తక్కువగా ఉన్నారని చెప్పారు.
డాక్టర్‌పై చర్యలకు మంత్రి ఆదేశం
అచ్చంపేట ప్రభుత్వ దవాఖానకు కాన్పుకోసం వచ్చిన గర్భిణికి కొవిడ్ పాజిటివ్ వచ్చిందని చేర్చుకోకుండా బయటకు పంపిన డ్యూటీ డాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. పూర్తి వివరాలు తెలుసుకొని సంబంధిత డాక్టర్‌ను సస్పెండ్ చేయాలని సూచించారు. కొవిడ్‌తో వచ్చిన గర్భిణులకు ప్రసవాలు చేయాలని ఆదేశించారు.