
వేములపల్లిలో 16, 807 ఎకరాల్లో వరినాట్లు
ఎత్తిపోతల పునరుద్ధరణతో బీడు భూములు సైతం సాగులోకి
వేములపల్లి, ఆగస్టు 23 : నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు సకాలంలో నీటిని విడుదల చేయడంతో ఆయకట్టులో వరిసాగు జోరందుకున్నది. ఇప్పటికే బోరు బావుల కింద వరినారు సిద్ధం చేసుకున్న రైతులు కాల్వ నీరు అందగానే పొలాలను దమ్ము చేసి నాట్లు వేస్తున్నారు. ప్రస్తుతం మండలంలోని అన్ని గ్రామాల్లో నాట్లు జోరందుకున్నాయి.
పెరిగిన సాగు విస్తీర్ణం
గతంలో లిఫ్టులు పని చేయక పోవడంతో రైతులు సాగుపై అంతగా ఆసక్తి కనబర్చక పోయేవారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక టీఆర్ఎస్ ప్రభుత్వం లిఫ్టులను పునరుద్ధరించడంతో పాటు సాగర్ ఎడమ కాల్వకు సక్రమంగా నీటిని విడుదల చేస్తున్నది. దీంతో మండలంలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. గతంలో 10వేల ఎకరాల్లో కూడా వరిసాగు కాకపోగా, ప్రస్తుతం 16, 807 ఎకరాల్లో వరిసాగైంది. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధుతో పంట పెట్టుబడి కోసం అప్పులు చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. కాల్వలకు నీరు కూడా సకాలంలో విడుదలవడంతో రైతులు ఉత్సాహంగా సాగు పనుల్లో నిమగ్నమవుతున్నారు.
లిఫ్టుల కింద పూర్తిస్థాయిలో..
మండలంలోని వేములపల్లి వద్ద ఉన్న ఎల్-13తో పాటు సల్కునూరు వద్ద ఉన్న లిఫ్టులను(ఎల్-18,19) రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరించడంతో దానికింద ఉన్న ఆయకట్టు పూర్తిస్థాయిలో సాగవుతున్నది. ఎల్-13 ద్వారా 1400 ఎకరాలకు, ఎల్-18,19 ద్వారా 3,263 ఎకరాలకు సాగునీరు అందుతుండగా ఆయా గ్రామాల రైతులు వరిసాగు చేస్తున్నారు.
లిఫ్టుల ద్వారా నీరందుతున్నది
లిఫ్టుల ద్వారా మా భూములకు సాగునీరు అందుతున్నది. ప్రభుత్వం కూడా ఎకరానికి రూ.5వేలు పెట్టుబడి సాయం అందిస్తుండడంతో సంతో షంగా భూములను సాగు చేసుకుంటున్నరు. నాకు 2.20 గుంటల భూమి లిఫ్టు కిందనే ఉన్నది. సర్కారు సకాలంలో నీరు వదిలిపెట్టడంతో వరిసాగు చేస్తున్న. ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతో ఎరువులు, విత్తనాలు కొన్న.
-బంటు యాదగిరి, నందిపాడు