కలెక్టర్ వల్లూరు క్రాంతి
గద్వాల, నవంబర్ 22 : ప్రజావాణి ఫిర్యాదులను త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వల్లూరు కాంత్రి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రజావాణికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దరఖాస్తులను కలెక్టర్ స్వీకరించారు. మొత్తం 50 దరఖాస్తులు వచ్చాయని ఫిర్యాదులు ఎక్కువగా ఆసరా పింఛన్లకు సంబంధించినవి, భూసమస్యలు, కుటుంబ, మున్సిపాలిటీకి సంబంధించిన ఫిర్యాదులు వచ్చాయని వాటిని సంబంధిత శాఖ అధికారులకు పంపించి పరిష్కారం అయ్యేలా చూస్తానని ఫిర్యాదుదారులకు హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు రఘురాం శర్మ, శ్రీహర్ష, ఆర్డీవో రాములు పాల్గొన్నారు.
దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలి
కేంద్రప్రభుత్వం దివ్యాంగ విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన నేషనల్ స్కాలర్‌షిఫ్ స్కీంను జిల్లాలో 9నుంచి పీజీవరకు చదువుతున్న దివ్యాంగ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. దివ్యాంగ విద్యార్థులకు ఆర్థికంగా చేయూత నివ్వడానికి భారత ప్రభుత్వం సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో 9, 10 విద్యార్థులకు ప్రిమెట్రిక్ 9వ తరగతి నుంచి పీజీ వరకు చదివే విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ అందిస్తుందని తెలిపారు. 2021-2022 విద్యాసంవత్సరానికి సంబంధించిన ఆన్లైన్ రిజర్వేషన్ ప్రక్రియ నేషనల్ స్కాలర్ షిప్ పోర్టల్‌లో 2021 ఆగస్టు 18 నుంచి ప్రారంభించారని నేషనల్ స్కాలర్ షిప్‌కు సంబంధించిన పూర్తి వివరాలు www.disabilityaffairs.gov.in వెబ్ సైట్లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. అర్హులైన దివ్యాంగ విద్యార్థులు ఈ నెల 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జిల్లా మహిళా, శిశుసంక్షేమశాఖ, దివ్యాంగుల, సీనియర్ సిటిజన్లు సంక్షేమ శాఖ ద్వారా ఈ పథకాన్ని ఉపయోగించుకోవాలని తెలిపారు.
గ్రీవెన్స్ డేకు ఆరు ఆర్జీలు
గద్వాల న్యూటౌన్, నవంబర్ 22 : జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌డేకు ఆరు ఫిర్యాదులు వచ్చాయి. ఆయా మండలాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు ఎస్పీ రంజన్ రతన్‌కుమార్‌కు వినతులను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఫిర్యాదులను పెండింగ్‌లో ఉంచకుండా త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత పోలీసులు అధికారులకు ఆదేశించారు. అత్యవసర సమయాల్లో డయల్ 100కు కాల్ చేసి సాయం పొందాలన్నారు.