e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, July 26, 2021
Home జిల్లాలు టాస్క్‌ఫోర్స్‌ పంజా

టాస్క్‌ఫోర్స్‌ పంజా

టాస్క్‌ఫోర్స్‌ పంజా

తీగలాగితే కదిలిన డొంక
భారీగా ైగ్లెసెల్‌, నకిలీ విత్తనాల పట్టివేత
పెద్దపల్లి జిల్లాలో అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్‌
రూ.13.77 లక్షల విలువైన విత్తనాలు, గడ్డి మందు స్వాధీనం

పెద్దపల్లి, జూన్‌ 20(నమస్తే తెలంగాణ): రైతులకు నిషేధిత విత్తనాలను, పురుగు మందులను అంటగడుతూ సొమ్ము చేసుకుంటున్న ముఠా సభ్యులను పెద్దపల్లి జిల్లా టాస్క్‌ఫోర్స్‌ అధికారులు అరెస్ట్‌ చేశారు. ఈ మేరకు వివరాలను రామగుండం సీపీ సత్యనారాయణ ఆదివారం పెద్దపల్లి పోలీసు స్టేషన్‌లో వెల్లడించారు. నిషేధిత విత్తనాలు, గడ్డి మందు సరఫరాపై కన్నేసిన పోలీసులు, ఒక సమాచారం మేరకు శనివారం బసంత్‌నగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని రంగాపూర్‌ గ్రామ శివారులో మండల వ్యవసాయ అధికారి తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో రంగాపూర్‌కు చెందిన ముగ్గురు రైతుల వద్ద ప్రభుత్వం నిషేధించిన యూఎస్‌-341 రకం మిర్చి విత్తనాలు దొరకడంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ విత్తనాలు ఎక్కడి నుంచి వచ్చా యి..? ఎవరు సరఫరా చేస్తున్నారు..? అన్న కోణంలో లోతుగా విచారణ చేయగా ముఠా గుట్టు రట్టయింది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మల్హర్‌రావు మండలం గాధంపల్లికి చెందిన శ్రీనివాస ఫర్టిలైజర్స్‌ యజమాని తొగరి శ్రీనివాస్‌ నుంచి కొనుగోలు చేసినట్లు ఆ ముగ్గురు రైతులు వెల్లడించారు. దీంతో శ్రీనివాస్‌పై 142/2021, 143/2021, 144/2021 సీఆర్‌పీసీ సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసిన పోలీసులు, అతనికి సంబంధించిన షాపులో దాడులు నిర్వహించారు. ఇక్కడ రూ.5 లక్షల విలువైన యూఎస్‌ 341 కంపెనీకి చెందిన 817 నిషేధిత మిర్చి విత్తన ప్యాకెట్లను, 14 లీటర్ల ైగ్లెసెల్‌ గడ్డి మందును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం శ్రీనివాస్‌ను సైతం విచారించగా సుమిటోమో కెమికల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సేల్స్‌ మేనేజర్‌ బొబ్బల రవీందర్‌రెడ్డి తనకు సరఫరా చేశాడని చెప్పడంతో అతడిని కూడా అదుపులోకి తీసుకొని విచారించారు. కంపెనీ రీజినల్‌ బిజినెస్‌ మేనేజర్‌ ఆకుల శ్రీహర్ష ఆదేశాల మేరకు నిషేధిత మందులను హైదరాబాద్‌ ఆటోనగర్‌లోని గోడౌన్‌ నుంచి సరఫరా చేసినట్లు వివరించారు.

దీంతో పోలీసులు సుమిటోమో కంపెనీకి చెందిన గోడౌన్‌పై దాడులు నిర్వహించారు. శ్రీహర్షను ప్రశ్నించి, ప్రభుత్వం నిషేధించిన అనంతరం విక్రయించిన ఇన్వాయిస్‌ పత్రాలను సీజ్‌ చేశారు. ఇన్వాయిస్‌ల ఆధారంగా నిషేధిత గడ్డిమందు విక్రయించిన వారి వివరాలను తెలుసుకొని రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించి గడ్డి మందును, నిషేధిత విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. సేల్స్‌ మేనేజర్‌ బొబ్బల రవీందర్‌రెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు మహదేవపూర్‌లోని ఆరాధన ఫెస్టిసైడ్స్‌ అండ్‌ ఫర్టిలైజర్స్‌పై దాడులు నిర్వహించి రూ.2 లక్షల 77 వేల విలువైన 660 లీటర్ల నిషేధిత గడ్డిమందు డబ్బాలను సీజ్‌ చేశారు. ఫర్టిలైజర్స్‌ యజమాని తొగరి శ్రీనివాస్‌ ఇచ్చిన సమాచారం మేరకు ఆంధ్రప్రదేశ్‌లోని ఎటపాక గ్రామానికి చెందిన ఆర్‌కే సీడ్స్‌ యజమాని దేవభక్తుని రామకృష్ణను విచారించారు. అతను బీఏఎస్‌ఎఫ్‌ సేల్స్‌ మేనేజర్‌ నాగేంద్రబాబు అలియాస్‌ బాబూరావు ద్వారా నిషేధిత విత్తనాల ప్యాకెట్లను సరఫరా చేసినట్లు అంగీ కరించారు.

- Advertisement -

రామకృష్ణ ఇచ్చిన సమాచారం మేరకు ములుగు పోలీసులు వాజేడు, వెంకటాపూర్‌ మండలాల్లో దాడులు నిర్వహించి రూ.6 లక్షల విలువైన నిషేధిత యూఎస్‌-341రకం మిర్చి విత్తనాలను సీజ్‌ చేశారు. ఈ కేసులో మల్హర్‌రావు మండలం గాధంపల్లికి చెందిన తొగరి శ్రీనివాస్‌, కరీంనగర్‌లోని బొమ్మకల్‌కు చెందిన బొబ్బల రవీందర్‌రెడ్డి, వనపర్తి జిల్లా న్యూ టౌన్‌ కాలనీకి చెందిన ఆకుల శ్రీహర్ష, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల ఆయిల్‌ బంక్‌ ఏరియాకు చెందిన దేవభక్తుని రామకృష్ణ, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలం వేమునూరి వెంకటరెడ్డి, ఖమ్మం జిల్లా కేంద్రంలోని గాంధీచౌక్‌కు చెందిన మార్గాని గౌతం వెంకటనాగేంద్రబాబును అరెస్టు చేసినట్లు సీపీ తెలిపారు. ఈ సమావేశంలో పెద్దపల్లి జోన్‌ డీసీపీ పులిగిల్ల రవీందర్‌, ఓఎస్డీ శరత్‌చంద్రపవార్‌, ఏసీపీ సారంగపాణి, పెద్దపల్లి, మంథని, పెద్దపల్లి ట్రాఫిక్‌ సీఐలు ప్రదీప్‌కుమార్‌, సతీశ్‌, అనిల్‌, ఎస్‌ఐలు మహేందర్‌, రాజేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
టాస్క్‌ఫోర్స్‌ పంజా
టాస్క్‌ఫోర్స్‌ పంజా
టాస్క్‌ఫోర్స్‌ పంజా

ట్రెండింగ్‌

Advertisement