e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, January 21, 2022
Home జిల్లాలు వడ్ల కొనుగోలుకు సన్నద్ధం

వడ్ల కొనుగోలుకు సన్నద్ధం

ఈ నెలాఖారులోగా ఊరూరా ధాన్యం కేంద్రాలు
కొవిడ్‌ నిబంధనల మేరకు కొనుగోళ్లు
4.96 లక్షల టన్నుల సేకరణే లక్ష్యం
కొన్నధాన్యాన్ని వెంటవెంటనే మిల్లులకు తరలింపు
నేరుగా రైతుల ఖాతాల్లో నగదు జమ

పెద్దపల్లి, అక్టోబర్‌ (నమస్తే తెలంగాణ): వానకాలం వడ్ల కొనుగోళ్లకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతున్నది. పండించిన ప్రతి గింజనూ కొంటామని సీఎం కేసీఆర్‌ ప్రకటించిన నేపథ్యంలో రంగంలోకి దిగింది. ఈ నెలాఖరు నుంచే ధాన్యం సేకరించాలని సంకల్పించింది. గత సీజన్‌లో మాదిరిగానే ఊరూరా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ యేడు దొడ్డు వడ్లు కొనబోమని కేంద్రం తేల్చిచెప్పడంతో ఆందోళన చెందిన కర్షకలోకం, రాష్ట్ర సర్కారు ప్రకటనతో సంతోషంలో మునిగితేలింది. అభయమిచ్చిన ముఖ్యమంత్రి చిత్రపటాలకు పలుచోట్ల క్షీరాభిషేకం చేసి అభిమానం చాటుకున్నది.

- Advertisement -

వానకాలం సీజన్‌లో ధాన్యం కొనుగోళ్లకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ప్రతి వడ్ల గింజను కొనుగోలు చేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించడంతో పౌరసరఫరాల శాఖ అధికారులు రంగంలోకి దిగారు. పదిరోజుల్లోగా సెంటర్ల ఏర్పాటు ప్రక్రియను పూర్తిచేసి యుద్దప్రాతిపదికన కొనుగోళ్లు చేపట్టనున్నారు. పెద్దపల్లి జిల్లాలో ఈ సీజన్‌లో 2, 02, 715ఎకరాల్లో వరిసాగు కాగా 4.96,224 మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తుందనే అంచానా వేశారు. ఇందుకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేశారు.

292 కేంద్రాలు..37 సెక్టార్లు..
జిల్లాలో వడ్ల సేకరణకు మొత్తం 292కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. 58 ఐకేపీ, 215 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, 14 డీసీఎంఎస్‌, 5 మార్కెట్‌ కమిటీల ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఐదు సెంటర్లకు ఒక క్లస్టర్‌ చొప్పున 37 సెక్టార్లను ఏర్పాటు చేశారు. సెంటర్లన్నింటిలో తేమ మిషన్లు, కాంటాలను సిద్ధం చేయనున్నారు. రైతుల నుంచి వచ్చే ధాన్యాన్ని తాలు లేకుండా తేమ శాతం 17కు మించకుండా చూసుకోవాలని జిల్లా పౌరసరఫరాల శాఖ డీఎం ప్రవీణ్‌ కోరారు.

ఏ గ్రేడ్‌కు రూ.1960 మద్దతు ధర..
ఈ వానకాలం సీజన్‌లో 4, 96, 224 మెట్రిక్‌ టన్నుల వడ్ల సేకరణే లక్ష్యంగా జిల్లా ప్రొక్యూర్‌మెంట్‌ కమిటీ ముందుకుసాగుతున్నది. వరి ఏ గ్రేడ్‌ రకానికి రూ. 1960, కామన్‌ రకానికి రూ. 1940 మద్దతు ధర చెల్లించనున్నారు. అయితే తేమ శాతం 17కు మించకుండా రైతులు జాగ్రత్త పడాల్సి ఉంటుంది. వడ్లలో తాలు, మట్టి లేకుండా కేంద్రాలకు తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని అధికారులు సూచిస్తున్నారు.

కేంద్రాల నుంచి నేరుగా మిల్లులకు..
సెంటర్లలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంట వెంటనే జిల్లాలోని రైస్‌ మిల్లులకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సెంటర్లలో వడ్ల నిల్వలు పేరుకుపోకుండా చర్యలు చేపట్టనున్నారు. సేకరించిన ధాన్యాన్ని తరలించేందుకు సరిపడా వాహనాలు, గన్నీబ్యాగులు అందుబాటులో ఉంచుతున్నారు. రవాణాను నిరంతరం పర్యవేక్షించేందుకు సిబ్బందికి బాధ్యతలు అప్పగించారు.

జిల్లాలో నాలుగు సెక్టార్లు..
జిల్లాలో పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్‌, రామగుండం సెక్టార్ల పరిధిలో 292 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. సెక్టార్ల పరిధిలోని కొనుగోలు కేంద్రాల పర్యవేక్షకులుగా జిల్లాలోని తహసీల్లార్లు, ఎంపీడీవోలు, డీటీలు, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్లు, సీనియర్‌ ఇన్‌స్పెక్టర్లు, పీఏసీఎస్‌ సంఘా లు సభ్యులు ఈ క్లస్టర్ల ఇన్‌చార్జిలుగా వ్యవహరిస్తారు.

జిల్లా స్థాయిలో ప్రొక్యూర్‌మెంట్‌ కమిటీ..
ధాన్యం కొనుగోళ్ల సందర్భంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు జిల్లా కలెక్టర్‌ సివిల్‌ సప్లయ్‌ చైర్మన్‌గా అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీల్లో ధాన్యం సేకరణకు అవసరమయ్యే అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు సభ్యులుగా కొనసాగుతారు. జిల్లా మార్కెటింగ్‌, డీఎంసీఎస్‌, డీసీఎస్‌వో, డీసీపీ, ఆర్టీఏ, డీఏవో, ఎల్‌డీఎం, డీఆర్‌డీవో, డీసీఎమ్మెస్‌ మేనేజర్లు సభ్యులుగా ఉంటారు. హమాలీలకు సంబంధించి, తూనికలు కొలతలు, రవాణా, రైస్‌ మిల్లులో సమస్యలు వస్తే తక్షణమే స్పందించనున్నారు.

కంట్రోల్‌ రూం ఏర్పాటు..
ధాన్యం కొనుగోలు సందర్భంగా ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి కంట్రోల్‌ రూంను ఏర్పాటు చేశారు. జిల్లా సివిల్‌ సప్లయీస్‌ మేనేజర్‌ కార్యాలయంలో ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు రైతులు తమ సమస్యలను తెలియజేసేలా కంట్రోల్‌ రూంకు ఒక నంబర్‌ను కేటాయించారు. రైతులు నేరుగా 08728-224117ను సంప్రదించాలి.

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement