వరి పంట వదిలి ప్రత్యామ్నాయం వైపు..
పంట మార్పిడికి ఒప్పిస్తున్న వ్యవసాయాధికారులు
వరితో పోలిస్తే ఆరుతడి వల్లే లాభాలు
ధన్వాడలో ముందుకు వస్తున్న రైతులు
మహబూబ్‌నగర్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలు వేయాలని రైతులకు చేస్తున్న సూచనలు ఫలిస్తున్నాయి. వరి సాగుకు అత్యధికంగా ఎరువులు వాడడంతో భూములు సారం కోల్పోతున్న విషయాన్ని రైతులకు తెలియజేస్తున్నారు. యాసంగిలో ఆరుతడి పంటల సాగు వల్ల పెట్టుబడి ఖర్చులు సైతం తగ్గుతాయని సూచిస్తున్నారు. అధికారుల అవగాహనతో ధన్వాడ మండలంలో 500ఎకరాల్లో వేరుశనగ, 200ఎకరాల్లో పొద్దుతిరుగుడు, జొన్న, నువ్వులు, ఆముదం సాగు చేస్తున్నారు.
వరి సాగు కోసం రైతులు అత్యధికంగా ఎరువులు వాడడంతో భూములు సారం కోల్పోతున్నాయి. ఫలితంగా భవిష్యత్ లో వరి పండించే భూములు వ్యవసాయానికి పనికి రాకుండా పోయే ప్రమాదం ఏర్పడింది. దీంతో శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు యాసంగిలో ఆరుతడి పంటలు సాగు చేయాల ని సూచిస్తున్నారు. సంప్రదాయంగా వేసుకునే ఆరుతడి పంటలు రైతులకు లాభాలను అందించడంతోపాటు భూమి సారాన్ని సైతం పెంచుతాయని వ్యవసాయాధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. యాసంగిలో ఆరుతడి పంటల సాగుతో పెట్టుబడి ఖర్చులు సైతం తగ్గుతాయని సూచిస్తున్నారు. ధన్వాడ మండల వ్యవసాయాధికారి ప్రదీప్‌కుమార్ ప్రత్యేక చొరవ తీసుకుని మండలంలో రైతులకు అవగాహన కల్పించారు. రైతులను ఆరుతడి పంటల వైపు మళ్లిస్తున్నారు. ఫలితంగా మండలంలో 500 ఎకరాల్లో వేరుశనగ సాగు చేస్తున్నారు. వే రుశనగతోపాటు పొద్దుతిరుగుడు, జొన్న, ను వ్వులు, ఆముదం పంటలు కూడా వేశారు. మొ దట వరి తప్పా వేరే వేయమంటూ భీష్మించుకున్నా.. పరిస్థితిని, వరి సాగువల్ల ఎదురవుతు న్న దుష్పరిణామాలను వివరించి పంట మార్పిడికి ఒప్పించారు. భవిష్యత్‌లో మరింత మంది రైతులు పంటల మార్పిడికి ముందుకొచ్చేలా చే స్తామని వ్యవసాయాధికారులు చెబుతున్నారు.
ఆరుతడి పంటలే ఉత్తమం..
వరి నుంచి ఆరుతడి పంటలకు మారితే మళ్లీ వరి వైపునకు వెళ్లే పరిస్థితి రాదు. ఆరుతడి పంటల సాగుతో ఎన్నో ప్రయోజనాలున్నాయి. సస్యరక్షణ చర్యలు తీసుకుంటూ వ్యవసాయం చేస్తే వరి కంటే ఆరుతడి పంటలే ఉత్తమం. యాసంగిలో వరికి ప్రత్యామ్నాయంగా పొద్దుతిరుగుడు, నువ్వులు, వేరుశనగ, మినుము తదితర పంటలు సాగుచేయాలని రైతు వేదికల ద్వారా అవగాహన కల్పించాం. ఫలితంగా మండలంలో 500 ఎకరాల్లో వేరుశనగ, 60 ఎకరాల్లో పొద్దుతిరుగుడు, 100 ఎకరాల్లో జొన్న, 25 ఎకరాల్లో నువ్వులు, 10 ఎకరాల్లో ఆముదంతోపాటు ఇతర పంటలు సాగు చేస్తున్నారు. వరి కోతల తర్వాత ఆరుతడి పంటల విస్తీర్ణం పెరుగుతుందని భావిస్తున్నాం. ఒక్క ఎకరాతో ప్రారంభమై వేలాది ఎకరాలు ఆరుతడి దిశగా మార్చేందుకు ప్రయత్నిస్తాం.
సోషల్ మీడియాలో ప్రచారం..
ఆరుతడి పంటల ప్రాధాన్యం, వరి వల్ల కలిగే నష్టాలను రైతులకు వివరిస్తున్నాం. వాట్సాప్ గ్రూపుల ద్వారా రైతులను పిలిచి అవగాహన కల్పిస్తున్నాం. యాసంగిలో ఆరుతడి పంటలు సాగుచేయాలని సామాజిక మాధ్యమాల ద్వారా వివరిస్తున్నాం. రైతుల వాట్సాప్ గ్రూపుల్లో తాము జాయిన్ అయి ప్రతి అంశమూ తెలియజేస్తున్నాం. ప్రభుత్వం నుంచి రైతులకు అందించాల్సిన సమాచారంతోపాటు శాస్త్రవేత్తల సలహాలు, సూచనలను ఎప్పటికప్పుడు తెలిసేలా చేస్తున్నాం. రైతుల్లో క్రమంగా మార్పు వస్తున్నది. మండలంలో ఆరుతడి పంటల సాగు ప్రారంభమైంది. రైతులు కూడా పరిస్థితి అర్థం చేసుకుంటున్నారు.
అధికారులు చెప్పినందుకే..
పంటల మార్పిడి చేయాలని వ్యవసాయాధికారులు అనేక మార్లు మా పొలం వద్దకు వచ్చారు. ఆరుతడి పంటల వల్ల కలిగే ప్రయోజనాలు వివరించారు. నీటి లభ్యత లేనప్పుడు ఆరుతడి పంటలు ఎంత మేలు చేస్తాయో చెప్పారు. అధికారుల సూచన మేరకు మరో 15 మంది రైతులతో కలిసి 100 ఎకరాల్లో జొన్న సాగు చేశాం. అధికారులు ఏ చిన్న సందేహం వచ్చినా ఫోన్లో కానీ నేరుగా వచ్చి కానీ సలహాలు ఇస్తున్నారు. మంచి దిగుబడి వస్తుందనే ఆశతో ఉన్నాం.
అందరూ వరి వేస్తున్నారని..
నీటి వసతి ఉందని అందరూ వరి వేస్తున్నారు. వారిని చూసి నేను ఇన్నాళ్లూ వరి సాగు చేశాను. అధికారుల సలహా మేరకు ఈ సారి ఆరుతడికి మారాను. 20 ఎకరాల్లో పొద్దుతిరుగుడు సాగు చేశాను. ఒకప్పుడు మా మండలంలో పొద్దు తిరుగుడు బాగా పండేది. క్రమంగా నీటి వసతి పెరిగి రైతులు వరి వైపు మళ్లారు. కానీ, ఇప్పుడు అంతా ఆరుతడి వైపు వచ్చే రోజులు వచ్చాయి. మార్కెటింగ్ సౌకర్యంపైనా సర్కారు కాస్త దృష్టి సారిస్తే మరింత ప్రయోజనం ఉంటుంది.