శ్రీశైలం, నవంబర్ 15: శ్రీశైలం మహాక్షేత్రానికి భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం రెండో సోమవారం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లను దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి సుమారు 30వేలకుపైగా యాత్రికులు వచ్చినట్లు ఆలయ అధికారుల అంచనా. తెల్లవారుజామున పుణ్యస్నానాలు చేసుకుని స్వామిఅమ్మవార్ల అలంకార దర్శనాలకు బారులుదీరారు. సంప్రదాయ దుస్తులు ధరించి సామూహిక అభిషేకాలు, కుంకుమార్చనలతోపాటు వృద్ధమల్లికార్జున స్వామికి బిల్వార్చన చేసుకునేందుకు భక్తులు ఎక్కువగా ఆసక్తి చూపారని ఈవో లవన్న తెలిపారు. వర్షం కారణంగా భక్తులు దర్శనాలకు స్వల్ప ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చినప్పటికీ క్యూలైన్ల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. అన్నదాన భవనాల్లో విడతలవారీగా అల్పాహార భోజన సదుపాయాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సాయంత్రం దక్షిణ మాడవీధిలో కళారాధన కార్యక్రమాల్లో చిన్నారులు చేసిన నృత్యాలు అందరినీ అలరించాయి.
కమనీయం.. కార్తీక సోమవారం
శ్రీశైల మహా క్షేత్రంలో కార్తీక మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సోమవారం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు ప్రత్యేక పూజలు శాస్ర్తోక్తంగా జరిపించినట్లు ఈవో లవన్న తెలిపారు. అర్చక వేదపండితులచే ఉభయ దేవాలయాల్లో నిత్యకైంకర్యాలతోపాటు పరివార దేవతలకు షోడశోపచార పూజలు చేశారు. సాయంత్రం స్వామిఅమ్మవార్లను పల్లకిలో వేంచేబుచేసి ఆలయ ప్రదక్షిణచేసి పుష్కరిణి వద్ద అధిష్ఠింపజేసి సంకల్ప పూజాధికాలు నిర్వహించారు. అనంతరం లక్ష దీపార్చనలో భాగంగా భక్తులచే దీపాలు వెలిగింపజేశారు. క్షీరాబ్ధి ద్వాదశి పర్వదిన ప్రత్యేక పూజలను శాస్ర్తోక్తంగా చేసుకున్నట్లు అఖిల భారత బ్రాహ్మణ మహా సంఘ్ మహిళా విభాగం అధ్యక్షురాలు మంకాల పద్మావతి మణిస్వామి చెప్పారు. శ్రీశైల మహా క్షేత్రంలో కార్తీకమాసంలో స్వామిఅమ్మవార్లను దర్శించుకోవడమే మహాభాగ్యంగా భావిస్తూ ఇంట్లో తులసమ్మ ఉసిరిచెట్ల కల్యాణాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని చెప్పారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు భద్రయ్య, మార్కండేయ శర్మ, ముఖ్యార్చకులు హరిస్వామి, ఈఈ మురళీబాలకృష్ణ, శ్రీశైలప్రభ సంపాదకులు అనీల్‌కుమార్, పీఆర్వో శ్రీనివాసరావు, ఆలయ ముఖ్య భద్రతా అధికారి నర్సింహారెడ్డి పాల్గొన్నారు.