డిమాండ్ ఉండే పంటలకే ప్రాధాన్యం
పెద్దఎత్తున పండ్ల తోటలు,
పప్పు ధాన్యాలు, కూరగాయల సాగు
ఏడాది పొడవునా ఆదాయం..
ఏపీ మార్కెట్‌కూ ఎగుమతి
మాడ్గులపల్లి, నవంబర్ 13 : ఆరుగాలం కష్టపడినా బర్కత్ లేకపోతే సంప్రదాయ పంటలతో ఏంటి ప్రయోజనం? వేలల్లో పెట్టుబడులు పెట్టి, ఇంటిల్లిపాది పని చేసి.. పంట చేతికొచ్చే సమయంలో మార్కెట్లో మద్దతు దక్కకపోతే ఏంకావాలి ఆ రైతు కుటుంబం? మరీ ముఖ్యంగా.. ధాన్యం కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వం సృష్టిస్తున్న గందరగోళంలో వరి వేయాల్నా, వద్దా అని ఆలోచించే రైతులు ఒక్కసారి ధర్మాపురం వెళ్లిరావాల్సిందే. మాడ్గులపల్లి మండలంలోని ఈ ఊరు అనేక పంటలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నది. ఇక్కడి ప్రతి రైతూ తనకున్న భూమిలో సుమారు మూడొంతుల మేర పండ్ల తోటలు, కూరగాయలు, పప్పు ధాన్యాలు సాగు చేస్తున్నారు. మార్కెట్ అవసరాలను గమనిస్తూ తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ దిగుబడినిచ్చే పంటలు వేసి ఏడాదంతా ఆదాయం గడిస్తున్నారు. మూస పద్ధతులకు స్వస్తి చెప్పి మిశ్రమ పంటలతో ఆంధ్రప్రదేశ్‌లోని మార్కెట్లకూ ఎగుమతి చేస్తున్నారు. భూమిలేని రైతులు సైతం కౌలుకు తీసుకొని కూరగాయలు సాగు చేసి ఆర్ధికంగా నిలదొక్కుకుంటుండడం విశేషం.
ధర్మాపురం నల్లగొండ మార్కెట్‌కు కూరగాయలు వెళ్లని రోజు ధరలకు రెక్కలు వస్తాయంటే.. మార్కెట్‌ను సైతం ఈ గ్రామం ఎంతగా ప్రభావితం చేస్తున్నదో అర్ధంచేసుకోవచ్చు.మాడ్గులపల్లి మండలంలోని ధర్మాపురం వ్యవసాయ ఆధారిత గ్రామం. ఏడాది పొడవునా చేతినిండా పని ఉండడంతో రైతులకు సిరులు కురుస్తున్నాయి. దీంతో ఈ గ్రామం వ్యవసాయ రంగంలో తనదైన ముద్రను సొంతం చేసుకుంటున్నది. మార్కెట్‌తోపాటు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా కొత్త రకాల పంటలు వేస్తూ, నూతన వంగడాలను సైతం సాగు చేస్తున్నారు. ఆలుగడ్డ, క్యాబేజీ, కాకర, బీర, బెండ, టమాట, వంగ, గోంగూర, కరివేపాకు, మునగ కూరగాయలతో పాటు ఆకు కూరలు పండిస్తున్నారు. దీంతోపాటు బత్తాయి, దానిమ్మ, తైవాన్ జామ, పుచ్చ, కర్బూజ తోటలను సాగు చేస్తున్నారు. వరి పంటకు ప్రత్యామ్నాయంగా ఆరు తడి పంటలైన పత్తి, వేరుశనగ, ఉలువలు, పెసర, మినప పంటలను సాగు చేస్తున్నారు. మిశ్రమ పంటలను సాగు చేస్తే అధిక దిగుబడులతో పాటు అధిక లాభాలు ఆర్జించవచ్చంటున్నారు ఇక్కడి రైతులు. ఈ గ్రామం నుంచి నల్లగొండ కూరగాయల మార్కెట్‌కు ఒక్కరోజు కూరగాయలు వెళ్లకపోతే ఆ రోజు కూరగాయల ధరలకు రెక్కలు వస్తాయని పేర్కొంటున్నారు. సీజన్లో విజయవాడ, గుంటూరు జిల్లా మార్కెట్‌కు టమాట ఎగుమతి చేస్తూ లాభాలు ఆర్జించామని తెలిపారు. వాతావరణ మార్పులతో కొంత నష్టం వాటిల్లుతున్నా కూరగాయలు, మిశ్రమ పంటలనే సాగు చేస్తామని ధీమాగా చెబుతున్నారు ఆ గ్రామ రైతులు.
పూర్తి వ్యవసాయ గ్రామం..
గ్రామంలో సుమారు 620 కుంటుంబాలు ఉన్నాయి. 2371 ఎకరాల్లో వ్యవసాయ భూమి ఉండగా 800 ఎకరాల్లో వరి, 650 ఎకరాల్లో పత్తి, 450 ఎకరాల్లో బత్తాయి, 250 ఎకరాల్లో అంతర పంటలు, పెసర, మినుములు, కాకర, 100 ఎకరాల్లో కూరగాయలు, 35 ఎకరాల్లో టమాట, 20 ఎకరాల్లో దానిమ్మ, 20 ఎకరాల్లో బొప్పాయి, ఇతర పంటలు సాగు చేస్తున్నారు.
మిశ్రమ పంటలతోనే లాభాలు
నాకు 20 ఎకరాలు ఉంది. దీనిలో బత్తాయి, వరి, పత్తి, 2ఎకరాల టమాట, 2 ఎకరాల వంగ సాగు చేస్తున్నా. మిశ్రమంగా పంటలు సాగుచేస్తే పంట చేతికొచ్చేటప్పుడు మార్కెట్లో ధరను బట్టి లాభాలు వస్తాయి. ఒకే రకమైన పంట వేయడంతో నష్టపోవొచ్చు. వరికి ప్రత్యామ్నాయంగా ఇతర పంటలు పండిస్తున్నాం. సంవత్సరం పొడవునా ఉద్యాన పంటలను సాగుచేస్తున్నాం. గత సంవత్సరం 4 ఎకరాల్లో టమాట సాగు చేసిన వాతావరణం అనుకూలించకపోవడం, లాక్‌డౌన్‌తో మార్కెట్ చేసుకోవడం ఇబ్బంది అయింది. ఇప్పుడు టమాట, వంగ సాగు చేస్తున్నా మంచి దిగుబడి వస్తే మంచి లాభం వస్తున్నది.
30 గుంటలు కౌలుకు తీసుకున్నా
నాకు ఎకరం భూమి ఉంది. దానిలో వరి వేసిన. కూరగాయల సాగుకు 30గుంటల భూమిని కౌలుకు తీసుకొని బెండ సాగు చేస్తున్న. మార్కెట్లో బెండకాయకు ఎప్పుడూ డిమాండ్ ఉంటది. మంచి ఆదాయం వస్తది. కూరగాయలు పండిస్తే ప్రతి రోజూ డబ్బులు వస్తయ్.
కొత్త రకం పంటలు సాగు చేస్తా
మా గ్రామం నుంచి కూరగాయలు ఒక్కరోజు నల్లగొండ మార్కెట్‌కు రాకపోతే కూరగాయ ధరలు ఆకాశాన్ని తాకుతాయి. గ్రామంలో అందరూ కూరగాయలు సాగు చేస్తున్నారు. లాభాలు రాకున్నా కూరగాయనే సాగుచేస్తారు. ఒకసారి కాకపోతే మరొక సారి లాభాలు వస్తాయి. ఒకే రకమైన పంటలు పండించడంతో డిమాండ్ తగ్గుతుంది. కాబట్టి మేము అన్ని రకాల పంటలు పండిస్తాం. నేను పోయిన సారి ఆలుగడ్డ, క్యాబేజీ సాగు చేసిన. మళ్లీ ఈ నెలలో నార్లు పోస్తున్నాం. నాకు 10 ఎకరాల భూమి ఉంది. దానిలో 2ఎకరాల్లో బెండ సాగు చేస్తున్నాను. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు పండిస్తున్నాం.