బీజేపీ ద్వంద్వ వైఖరిని పార్లమెంట్లో ఎండగడుతాం
కొనుగోళ్లపై కేంద్రం మెడలు వంచుతాం
మహాధర్నాతో ఉద్యమ స్ఫూర్తిని చాటిన తెలంగాణ
రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్
నీలగిరి, నవంబర్13 : తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో బీజేపీ అవలంబిస్తున్న ద్వంద్వ వైఖరిని ఈ నెల 29 నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో ఎండగడుతామని, మోదీ మెడలు వంచి యాసంగిలో ధాన్యం కొనుగోలు చేయిస్తామని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. శనివారం నల్లగొండ జిల్లా పరిషత్ చైర్మన్ చాంబర్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అభివృద్ధిని చూసి ఓర్వలేక ధాన్యం కొనుగోలు చేయలేమంటూ కేంద్రం చేతులు ఎత్తేసి రైతుల నోట్లో మట్టి కొడుతుందన్నారు. తెలంగాణ బాగుపడడం ఇష్టంలేక రైతు వ్యతిరేఖ విధానాలతో కేంద్ర ముందుకు వచ్చిందని తెలిపారు. వానకాలంలోనే ధాన్యం కొనుగోలు చేయలేమని చెబితే సీఎం కేసీఆర్, మంత్రులు స్వయంగా వెళ్లి 40లక్షల మెట్రిక్ టన్నులకు జీవోలు తెచ్చామని తెలిపారు. పంజాబ్‌తోపాటు ఇతర కొన్ని రాష్ట్రాల్లో ధాన్యం కొనుగోలు చేస్తుండగా, కొత్తగా ఏర్పడిన తెలంగాణలో మాత్రం ఎందుకు కొనుగోలు చేయరని ప్రశ్నించారు. 24గంటల ఉచిత కరెంటు, రైతుబంధులాంటి పథకాలతోపాటు సాగర్, ఏఎంఆర్పీ, ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులతో పంటలు పుష్కలంగా పండాయని, కానీ ధాన్యం కొనుగోలు చేయకుండా ఇబ్బందులకు గురిచేయడం తగదన్నారు. ఐదారు సంవత్సరాలుగా రైతులు పండించిన పంటను ముందుగా తెలంగాణ ప్రభుత్వం కొని రైతులకు డబ్బులు చెల్లించిన తర్వాత కేంద్రానికి ఎఫ్‌సీఐ ద్వారా అమ్ముతున్నదని, దీని వల్ల రూ.రెండుమూడు వందల కోట్లు రాష్ర్టానికి నష్టం వచ్చినా భరించిందని తెలిపారు. రాష్ట్రంలో రైతులను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందేందుకు బీజేపీ కుట్ర పన్నుతుందని విమర్శించారు. రానున్న కాలంలో ప్రజాక్షేత్రంలో తగిన గుణపాఠం చెబుతామని ఆయన హెచ్చరించారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన రైతు మహాధర్నాలో టీఆర్ఎస్ శ్రేణులు మరోమారు ఉద్యమ స్ఫూర్తిని చాటాయని, అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.