ప్రజలకు నమ్మకం కలిగించాలి
వీడియో కాన్ఫరెన్స్‌లో వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు
గద్వాల, నవంబర్ 3: ప్రభుత్వ దవాఖానల్లోనే మెరుగైన వైద్యం అందుతున్నదని, సీఎం కేసీఆర్ ఆశయాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేలా అందరూ కృషిచేయాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, వైద్యాధికారులతో హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ దవాఖానలు, పీహెచ్‌సీల్లో ప్రజలకు మెరుగైన వైద్యం అందించేలా కలెక్టర్లు, వైద్యాధికారులు దృష్టి పెట్టాలన్నారు. ప్రభుత్వం ఆరోగ్యశాఖకు పెద్దఎత్తున ఐసీయూ, డయాలసిస్ సెంటర్లు, ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసిందన్నారు. అక్కడి పరికరాల తీరుపై అధికారులు శ్రద్ధ వహించాలన్నారు. సర్కారు దవాఖానల్లో డాక్టర్లు ప్రజలకు అందుబాటులో ఉండాలని, వైద్యంపై నమ్మకం కలిగించాలన్నారు. దవాఖానల్లో ఉండే పరికరాలు పూర్తి స్థాయిలో ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానల్లో ఆరోగ్యశ్రీ ద్వారా 946రకాల వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్యశ్రీకి అదనంగా ఆయుస్మాన్ భారత్ కింద 646రకాల వైద్య సేవలను ప్రభుత్వం చేర్చినట్లు తెలిపారు. జిల్లాలో ప్రాథమిక, కమ్యూనిటీ, ఏరియా, జిల్లా దవాఖానల పనితీరును మెరుగుపర్చాలన్నారు. రెగ్యులర్‌గా మానిటరింగ్ చేయాలని, కలెక్టర్లు, డీఎంహెచ్వోలు, డీసీహెచ్‌లను ఆదేశించారు. దవాఖానల్లో పేషెంట్ ఆక్యూపెన్సీ, సర్జరీలపై, అల్లోపతి వైద్యంతోపాటు ఇతర విభాగాల వైద్యుల పనితీరును సమీక్షించాలన్నారు. కలెక్టర్లు, వైద్యాధికారులు వ్యాక్సినేషన్ కేంద్రాలను, పీహెచ్‌సీలను ఆకస్మికంగా తనిఖీ చేసి, డాక్టర్లు, నర్సులు, మిగతా సిబ్బంది పనితీరును రివ్యూ చేయాలన్నారు.
పీహెచ్‌సీల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 4గంటల వరకు డాక్టర్లు అందుబాటులో ఉండాలని, ఆశకార్యకర్తల నుంచి సూపరింటుండెంట్ల వరకు సక్రమంగా విధులు నిర్వర్తిస్తున్నారా లేదా అని చెక్ చేయాలన్నారు. దవాఖాన ఆవరణలో పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. జిల్లా వైద్యాధికారి తప్పనిసరిగా ఫీల్డ్‌లో తిరగాలని, పీహెచ్‌సీలను ఆకస్మికంగా తనిఖీ చేసి, అక్కడ రోగులకు ఏర్పాటు చేసిన భోజనం నాణ్యతను పరిశీలించాలన్నారు. మలేరియా, టీబీ, లెప్రసీ, బ్లైండ్లెస్ నివారణ కార్యక్రమాలపై కూడా సమీక్షించాలన్నారు. కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్ వల్లూరు క్రాంతి మాట్లాడుతూ జిల్లాలో 23లక్షల మందికి మొదటి డోస్ వ్యాక్సిన్ పూర్తయిందని, ఓటరు జాబితా ప్రకారం మం డల ప్రత్యేకాధికారులు ప్రతి గ్రామంలో ఇంటింటికీ తిరిగి వ్యాక్సిన్ వేయిస్త్తున్నట్లు తెలిపారు. జిల్లాలో వందశాతం వ్యాక్సినేషన్ పూర్తిచేస్తామన్నారు. అనంతరం కలెక్టర్ వైద్యాధికారులతో మాట్లాడుతూ ప్రభుత్వ దవాఖానల్లోని టాయిలెట్స్ శుభ్రంగా ఉంచాలని, ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయించాలని, శానిటైజ్ సిబ్బంది హాజరుశాతం ఉండాలన్నారు. వైద్యులు సమయపాలన పాటించి విధులు సక్రమంగా నిర్వర్తించాలని వైద్యాధికారులను ఆదేశించారు. కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ శ్రీహర్ష, జిల్లా వైద్యాధికారి చందు నాయక్, డీపీవో శ్యాంసుందర్, డాక్టర్ శశికళ, డాక్టర్ కిశోర్‌కుమార్ పాల్గొన్నారు.