వనపర్తి, నవంబర్ 13: ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ధరణితో దస్తావేజులేఖరులకు ఎలాంటి నష్టం లేదని, రాష్ట్రంలో ఏండ్ల తరబడి పేరుకుపోయిన భూ సమస్యలు పరిష్కారం అవుతున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. శనివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని దాచ లక్ష్మయ్య ఫంక్షన్హాల్లో నిర్వహించిన ఉమ్మడి జిల్లా దస్తావేజులేఖరుల సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొత్త వ్యవస్థను అన్నీ సత్వరమే జరగవని, సమయం పడుతుందన్నారు. ధరణి ద్వారా మీసేవ పోర్టల్‌లో స్లాట్‌బుకింగ్ ద్వారా భూ కొనుగోళ్లు జరుగుతున్నాయన్నారు. ప్రజలకు మేలైన వ్యవస్థ తీసుకొచ్చి ఎలాంటి మోసాలకు తావులేకుండా పారదర్శకంగా అమలయ్యేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ పాటు పడుతున్నారని చెప్పారు. దస్తావేజులేఖరుల సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ తప్పకుండా పరిష్కరిస్తారని, ఆందోళన చెందవద్దని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో 24 వేల మంది దస్తావేజులేఖరులు వృత్తి నుంచి ఉపాధి పొందుతున్నారని చెప్పారు. ప్రభుత్వానికి వారి పొట్టకొట్టే ఆలోచన లేదని స్పష్టం చేశారు. వీరికి తప్పకుండా న్యాయం చేస్తామన్నారు. ఆందోళన చెందకుండా తమ పని తాము చేసుకోవాలని మంత్రి సూచించారు. సమావేశంలో దస్తావేజులేఖరుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శివ నాగేశ్వరరావు, జెడ్పీ చైర్మన్ లోకనాథ్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు షేక్ జహంగీర్, దస్తావేజులేఖరులు కుమారస్వామి, కృష్ణగౌడ్, శేఖర్, నరేశ్, రాములు, మహేందర్, శివ, ఆంజనేయులుతో పాటు రాష్ట్ర, ఉమ్మడి జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.