నేటి టీఆర్ఎస్ ధర్నాను విజయవంతం చేయాలి
స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య
స్టేషన్ ఘన్పూర్, నవంబర్ 11 : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా శుక్రవారం నియోజకవర్గ కేంద్రంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య రైతులకు పిలుపునిచ్చారు. నియోజకవర్గ కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ముందు నిర్వహించనున్న ధర్నాకు గురువారం స్థల పరిశీలన చేశారు. ఈ సంధర్బంగా ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడుతూ తెలంగాణలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయమని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చెబుతున్నదన్నారు. దీనిని రైతులు నిరసించాలని ఆయన కోరారు. ఇటీవల కేంధ్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను ప్రజలకు వివరించాలన్నారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతున్నదని పేర్కొన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయాలని కోరుతూ నిర్వహించే ధర్నాకు టీఆర్ఎస్ శ్రేణులతోపాటు రైతులు తరలిరావాలని రాజయ్య విజ్ఞప్తి చేశారు. ఈ ఆందోళన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టీఆర్ఎస్ స్టేట్ జనరల్ సెక్రటరీ, మాజీ ఎమ్మెల్సీ బోడకంటి వెంకటేశ్వర్లు హాజరవుతున్నారని ఆయన పేర్కొన్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల మండల పార్టీ అధ్యక్షులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్‌లు , ఎంపీటీసీలు, గ్రామశాఖ అధ్యక్ష కార్యదర్శులు, ముఖ్య నాయకులు హాజరై ధర్నాను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల ఆధ్యక్షుడు మాచర్ల గణేశ్, జడ్పీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ మారపాక రవి, రఘునాథపల్లి మండల అధ్యక్షుడు వారాల రమేశ్, స్టేషన్ ఘన్పూర్ మండల ప్రధాన కార్యదర్శి కందుల గట్టయ్య, టీఆర్ఎస్వీ నియోజకవర్గ ఇన్చార్జి లకావత్ చిరంజీవి, మేకలగట్టు ఎంపీటీసీ భిక్షపతినాయక్ తదితరులు పాల్గొన్నారు.
నేటి ధర్నాను విజయవంతం చేయాలి : ముత్తిరెడ్డి
జనగామ, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలులో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ శుక్రవారం జనగామలో రైతులతో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తెలిపారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ఉదయం 10 గంటలకు ధర్నా చేపడుతున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన చేశారు. ధర్నాలో జనగామ నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ముత్తిరెడ్డి కోరారు.