
ఇల్లెందు, అక్టోబర్ 11: ఉట్టిపడే తెలంగాణ సంస్కృతి.. అనాదిగా వస్తున్న సంప్రదాయం.. ఇల్లెందు నడిబొడ్డున లక్షలాది భక్తజనాన్ని ఒక్కచోటుకు చేర్చే ఉత్సవం. అదే దసరా పర్వదినాన జరిగే షావా రథోత్సవం. తొమ్మిదిరోజులపాటు సంబురాలు అంబరాన్నంటనున్నాయి. పదిహేనురోజుల ముందే భక్తులు దేవతామూర్తులను అలంకరించి ప్రత్యేక పూజలు చేస్తారు. షావా(రథం)లపై పలు ప్రాంతాల నుంచి మిషనరీ స్కూల్ జమ్మిబండ వద్దకు తీసుకొస్తారు. ఆ గడియాలో భక్తజనం పులకరించిపోతుంది. విద్యుత్కాంతుల నడుమ దేవతామూర్తులు వెలుగులు చిందిస్తుంటారు. మైసూర్ దేవతా ఉత్సవాలకు దీటుగా ఇల్లెందు జమ్మిబండ దసరా ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఆనవాయితీ ఆరు దశాబ్దాలుగా కొనసాగుతున్నది.
సింగరేణికి పుట్టినిల్లయిన ఇల్లెందులో దసరా ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. లక్షలాది మంది భక్తులు జమ్మిబండ వద్దకు వచ్చి దేవతామూర్తులను తిలకించడం ఆనవాయితీ. షావా(రథం)లను దసరాకు పదిహేను రోజుల ముందే తయారు చేస్తారు. పండుగకు మూడురోజుల ముందు షావాపై విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తారు. నూటొక్క పువ్వులతో అలంకరణ చేస్తారు. వైవిధ్యమైన రీతిలో రంగులను అద్ది కనులవిందుగా అలంకరిస్తారు. ఇల్లెందు పట్టణంలోని వివిధ కాలనీల నుంచి దేవతామూర్తులు జమ్మిబండ వద్దకు తరలివస్తారు. పొరుగు మండలాల్లో ప్రతిష్ఠించిన అమ్మవార్లు ఇక్కడికి రావడం ఆనవాయితీ. ఈ ఉత్సవాలను చూసేందుకు ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాల నుంచి లక్షల మంది జనం తరలివస్తారు.
ఎప్పుడు ప్రారంభమయ్యాయంటే..
1951లో కొంగుల కృష్ణయ్య షావా రథోత్సవాలను ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ సంప్రదాయం కొనసాగుతోంది. అత్యంత వైభవంగా ఇల్లెందులపాడులో నేటికీ షావాలను తయారు చేస్తున్నారు. ఇందులో షావా అలంకరణకు ప్రత్యేకత ఉంది. జమ్మి పక్కన ఫారెస్టు గ్రౌండ్లో లక్షలాది జనం మధ్య దసరా పర్వదినాన రావణవధ జరుగనున్నది. భారీ లైటింగ్స్‌తో రావణాసురుడిని వధించే కార్యక్రమం నిర్వహిస్తారు.
భారీ ఏర్పాట్లు చేశాం..
దసరా ఉత్సవాల సందర్భంగా జమ్మి, ఫారెస్టు గ్రౌండ్లో భారీ ఏర్పాట్లు చేశాం. 1991 నుంచి ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. మైసూర్‌ను మరిపించే విధంగా ఏటా ఉత్సవాలను నిర్వహిస్తున్నాం. లక్షలాది భక్తజన కరతాళధ్వనుల మధ్య రావణ వధ జరుగుతుంది. వీక్షించే వారికి కన్నులపండుగ.
-దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్, ఇల్లెందు