మంత్రి కేటీఆర్ ఆదేశాలతో రంగంలోకి అధికారులు
నష్టంపై పట్టణంలో సర్వే.. యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు
వరద వెళ్లేందుకు కలెక్టరేట్ సమీపంలో కచ్చా కాలువ నిర్మాణం
300 కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ
ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న అమాత్యుడు
రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ)/సిరిసిల్ల/సిరిసిల్ల టౌన్ : భారీ వర్షాలు, వరదలతో రెండు రోజులపాటు అతలాకుతలమైన సిరిసిల్ల గురువారం యథాస్థితికి చేరుకున్నది. వరద తగ్గుముఖం పట్టడంతో స్థానిక ప్రజానీకం ఊపిరిపీల్చుకున్నది. వ్యాపార, వాణిజ్య సముదాయాలు తిరిగి తెరుచుకోగా, రోడ్ల వెంట రద్దీ కనిపించింది. అమాత్యుడు రామన్న ఆదేశాలతో రంగంలోకి దిగిన జిల్లా యంత్రాంగం, వరద ప్రభావిత ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నది. ఓవైపు సహాయక చర్యలు అందిస్తూనే.. మరోవైపు యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టింది. జరిగిన నష్టాన్ని అంచనా వేస్తూనే దెబ్బతిన్న రోడ్లను మరమ్మతు చేస్తున్నది.
రెండు రోజులుగా ఏకధాటిగా కురిసిన వర్షాలతో రెండు రోజులపాటు జలదిగ్బంధమైన కార్మిక క్షేత్రం, మూడో రోజు సాధారణ స్థితికి చేరుకుంటున్నది. గురువారం జన జీవనం యథాతథంగా సాగింది. వరద తగ్గుముఖం పట్టి, కొత్తచెరువు మత్తడి దూకడం ఆగిపోయింది. అతలాకుతలమైన శాంతినగర్, వెం కంపేట, నేతన్న చౌక్, సర్దార్‌నగర్, అశోక్‌నగర్ తేరుకున్నాయి. ఇతర లోతట్టు ప్రాంతాలు కూడా ఊపిరిపీల్చుకున్నాయి. వరద ప్రవాహం తగ్గడం తో ఆయా వార్డుల్లోని ప్రజలంతా గురువారం బ యటకు రావడంతో రోడ్లన్నీ రద్దీగా కనిపించాయి. మార్కెట్లు, వ్యాపార సముదాయాలు బిజీగా మా రాయి. వ్యాపార, వాణిజ్య, విద్యాసంస్థలు తెరుచుకున్నాయి. వ్యాపార సంస్థల్లోకి వరద నీరు చేరి వస్తువులన్నీ మునిగిపోగా, వాటన్నింటిని శుభ్రం చేసుకున్నారు. వస్ర్తాలు, కిరాణా షాపుల్లో నిత్యావసర వస్తువులు చాలా వరకు నీటిలో మునిగి పనికి రాకుండా పోగా, కొందరు బట్టలషాపుల వ్యాపారులు నీట మునిగిన వస్త్రాలను సగం ధరకే విక్రయించారు. 30 ఏండ్ల క్రితం భారీ వరద వచ్చిందని, తర్వాత ఇన్నేళ్లకు ఇప్పుడు చూశామని సీనియర్ సిటీజన్లు చెబుతున్నారు. ఇటు అధికారులు పట్టణంలో పర్యటిస్తూ జరిగిన నష్టాన్ని, దెబ్బతిన్న రోడ్ల వివరాలు సేకరిస్తున్నారు. శాంతినగర్, వెంకంపేటలో నష్టపోయిన సాంచా కార్మికులపై చేనేత జౌళిశాఖ అధికారులు సర్వే చేస్తున్నారు.
వరద బాధితులకు ఆహార ప్యాకెట్లు
వరద బాధితులకు మున్సిపల్ అధికారులు 500 పాలప్యాకెట్లు, 1200 మందికి భోజన ప్యాకెట్లు, 500ల మంచినీటి బాటిళ్లు అందజేశారు. సినారే కళామందిరంలో వంటలు వండించి పొదుపు మహిళలతో ప్యాకింగ్ చేయించారు. ట్రాక్టర్ల ద్వారా లోతట్టు ప్రాంతాలకు తరలించి సిబ్బంది ఇంటింటికీ తిరిగి పంపిణీ చేశారు. కమిషనర్ సమ్మయ్య, చైర్పర్సన్ జిందం కళ, కౌన్సిలర్ల ఆధ్వర్యంలో 250 మంది సిబ్బంది అహర్శిశలు శ్రమించారు. 300 కుటుంబాలకు 15 రోజులకు సరిపడా నిత్యావసర వస్తువులను చైర్పర్సన్ జింద కళ చేతులమీదుగా పంపిణీ చేశారు.
యుద్ధప్రాతిపదికన పనులు..
మంత్రి కేటీఆర్ ఆదేశాలతో ఆర్అండ్బీ, మున్సిపల్, పంచాయతీ రాజ్ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. వరదప్రభావిత ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టారు. ఉదయం 5గంటల నుంచే 100 మంది కూలీలు, 50 ట్రాక్టర్ల ద్వారా పాడైన రోడ్ల మరమ్మతు చేపట్టారు. పూడిక, చెత్తాచెదారంతో నిండిన రోడ్లన్నింటినీ జేసీబీ, ఫ్రంట్ బ్లేడు ట్రాక్టర్లతో శుభ్రం చేయించారు. నీటమునిగి చెరువుగా మారిన కలెక్టరేట్ సమీపంలో 400 మీటర్ల కచ్చా కాలువ నిర్మిస్తున్నారు. ఇటు దెబ్బతిన్న రోడ్లు, డ్రైనేజీలు, కూలిన ఇండ్ల వివరాలను సేకరిస్తున్నారు. వెంకంపేట, అశోక్‌నగర్, శాంతినగర్ వార్డుల్లో చాలా చోట్ల రోడ్లు తెగి కోతకు గురికాగా, మొరం మట్టితో నింపారు. వెంకంపేట, శాంతినగర్ నుంబి అంబేద్కర్ వెళ్లే సీసీరోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. కల్లు దుకాణం వద్ద ఉన్న కల్వర్టు పూర్తిగా కోతకు గురై రవాణా సౌకర్యం నిలిచి పోయింది.
కొత్తచెరువు వద్ద కుంగిన రోడ్డు..
వరద నీటి ఉధృతికి కొత్తచెరువు వద్ద నాలుగు వరసల కామారెడ్డి-కరీంనగర్ రహదారి పూర్తిగా కుంగిపోయింది. ప్రధాన రహదారి కావడంతో వాహనాల రాకపోకలు నిలిపి వేశారు. ఆర్టీసీ బస్సులు, లారీలు, భారీ వాహనాలను దారిమళ్లించారు. కామారెడ్డి, కరీంనగర్ వెళ్లే వాహనాలన్నీ బైపాస్‌రోడ్డు మీదుగా నడుస్తున్నాయి. ఈ రోడ్డును వీలైనంత త్వరగా మరమ్మతు చేస్తామని అధికారులు చెబుతున్నారు.