ప్రజా సమస్యలపై ప్రతి సోమవారం గ్రీవెన్స్ డే
మహిళల రక్షణపై ప్రత్యేక దృష్టి
సీపీ చంద్రశేఖర్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ
ఫర్టిలైజర్‌సిటీ, ఆగస్టు 9: రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో శాంతిభద్రతలను కాపాడేందుకు ప్రజలు సహకరించాలని సీపీ ఎస్ చంద్రశేఖర్‌రెడ్డి కోరారు. సోమవారం రామగుండం సీపీ కార్యాలయంలో పూర్వపు సీపీ సత్యనారాయణ నుంచి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఏఆర్ సిబ్బందిచే గౌరవ వందనం స్వీకరించి విలేకరులతో మాట్లాడారు. మెరుగైన పోలీసింగ్‌తో నేర రహిత కమిషనరేట్‌గా తీర్చిదిద్దుతానని ప్రకటించారు. పెండింగ్ కేసులను సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని చెప్పారు. మహిళల రక్షణపై దృష్టిపెడతామని, ఈ దిశగా షీటీంలను పటిష్టం చేస్తామని పేర్కొన్నారు. నిషేధిత గుట్కా, గుడుంబా, జూదం, మట్కా లాంటి అక్రమ కార్యకలాపాల నియంత్రణకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. కమిషనరేట్ పరిధిలో అంతర్ రాష్ట్ర సరిహద్దు ఉన్న దృష్ట్యా మావోయిస్టుల కార్యకలాపాలపై నిఘా ఉంచుతామని చెప్పారు. కమిషనరేట్‌లో అవినీతిని అంతమొందించేందుకు ప్రతి సోమవారం గ్రీవెన్స్ డే ను నిర్వహించి ఫిర్యాదులు స్వీకరిస్తామన్నారు. వరుస నేరాలకు పాల్పడే వారిపై పీడీ యాక్ట్‌ను అమలు చేస్తామని హెచ్చరించారు. రొటేషన్ విధానంలో సిబ్బంది బదిలీలు చేపడతామన్నారు. ఇక్కడ పెద్దపల్లి డీసీపీ రవీందర్, ఏసీపీ ఉమెందర్ ఉన్నారు.