యాదాద్రి, అక్టోబర్ 6 : యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి బాలాలయంలో బుధవారం ఉదయం స్వామి, అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. వేకువజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామి, అమ్మవార్లకు సుప్రభాత సేవలు జరిపించారు. ప్రతిష్ఠామూర్తులకు ఆరాధన, ఉత్సవమూర్తులను పంచామృతాలతో అభిషేకించిన అనంతరం తులసీ పత్రాలతో అర్చన జరిపారు. దర్శనమూర్తులకు సువర్ణపుష్పార్చన, అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చన చేపట్టారు. బాలాలయంలోని మహామండపంలో సుదర్శన నారసింహహోమం, విశ్వక్సేనారాధన, నిత్య తిరుకల్యాణ మహోత్సవాలు ఘనంగా జరిగాయి. రాత్రి ఆరగింపు చేపట్టిన అర్చకులు అనంతరం స్వామివారి పవళింపు సేవను నిర్వహించారు. శ్రీవారి ఖజానాకు బుధవారం రూ. 2,51,339 ఆదాయం వచ్చినట్లు ఈఓ గీత తెలిపారు.
నేటి నుంచి శరన్నవరాత్రోత్సవాలు
యాదాద్రి, అక్టోబర్6: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి అనుబంధ ఆలయమైన శ్రీపర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరస్వామి బాలాలయంలో నేటి నుంచి దేవీ శరన్నవరాత్రోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 15 వరకు ఉత్సవాలను శాస్ర్తోక్తంగా నిర్వహిస్తామని ఈఓ ఎన్. గీత తెలిపారు. 9 రోజుల పాటు పూజల్లో పాల్గొనే దంపతులు రూ.1,116, నవరాత్రిలో ఒక్కరోజు సప్తశతి పారాయణం కోసం రూ.116, లక్ష కుంకుమార్చనకు రూ.116 చెల్లించాలని వెల్లడించారు.