శంకరపట్నం, మే 6: ఇంటింటి ఆరోగ్య సర్వేలో భాగంగా కొవిడ్ లక్షణాలు కనిపించిన వారికి వెంటనే ఐసోలేషన్ కిట్లు అందజేయాలని డీపీవో వీరబుచ్చయ్య ఆదేశించారు. గురువారం మండలంలోని అన్ని గ్రామాల్లో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఇంటింటికీ వెళ్లి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీపీవో తాడికల్ గ్రామంలో ఆరోగ్య సర్వే తీరును పరిశీలించి మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సర్వే పక్కాగా నిర్వహించాలని చెప్పారు. సర్వేలో పొందుపరిచే అంశాలను వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. సర్వే సిబ్బంది అందరికీ గ్లౌస్, తదితర రక్షణ కిట్లు అందజేయాలని పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ షాకీర్ అహ్మద్‌కు సూచించారు. వైరస్ లక్షణాలు కనిపించిన వ్యక్తులు ఐసోలేషన్‌లో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇక్కడ పంచాయతీ కార్యదర్శి సమ్మ రాజేశ్వర్, ఏఎన్ఎం సరస్వతి, ఆశ వర్కర్లు తదితరులు ఉన్నారు.
గ్రామాల్లో ఇంటింటా సర్వే
సైదాపూర్, మే6: మండలంలోని గ్రామాల్లో ఇంటింటా సర్వేను గురువారం నిర్వహించారు. ఎలబోతారం, రాములపల్లి గ్రామాల్లో జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య సర్వే తీరును పరిశీలించారు. ఎంపీడీవో పద్మావతి, ఎంపీవో రాజశేఖర్‌రెడ్డి, హెల్త్ సూపర్వైజర్ సమ్మయ్య, ఎస్ఐ ప్రశాంతరావు సర్పంచులు, ఎంపీటీసీలు, వైద్యసిబ్బంది ఉన్నారు.
పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి
సైదాపూర్, మే 6: గ్రామ పంచాయతీ సిబ్బంది పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ్ద వహించాలని జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య ఆదేశించారు. మండలంలోని గొడిశాల గ్రామంలో పారిశుధ్య పనులు, నల్లాని రామయ్యపల్లిలో గ్రామ పంచాయతీ రికార్డులు, పల్లె ప్రగతి పనులను ఆయన పరిశీలించి మాట్లాడారు. గ్రామాల్లో మురుగు కాలువలు శుభ్రంగా ఉంచాలన్నారు. చెత్తను బయట వేయకుండా ట్రాక్టర్లద్వారా సేకరించాలని సూచించారు. నల్లానిరామయ్యపల్లిలో గ్రామ పంచాయతీ రికార్డులను పరిశీలించి పలు సూచనలు చేశారు. పల్లెపకృతివనం, నర్సరీలను పరిశీలించారు. ఎల్లంపల్లి, గుజ్జులపల్లిలో ఎంపీడీవో పద్మావతి పల్లెప్రగతి పనులను పరిశీలించారు. వేసవిలో మొక్కలు ఎండిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. ఇక్కడ ఎంపీవో రాజశేఖర్‌రెడ్డి, సర్పంచులు చింత లతాకుమారస్వామి, మిడిదొడ్డి సరితారమేశ్, గుండేటి సునీతాజయకృష్ణ తదితరులు ఉన్నారు.