తరలివచ్చిన సహచర పోలీసులు, బంధుమిత్రులు
ఆమనగల్లు, జనవరి2: రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఎస్సై శ్రీనునాయక్ , అతడి తండ్రి మాన్యనాయక్ అంత్యక్రియలు ఆదివారం మాడ్గుల మండలంలోని మాన్యతండాలో సాయంత్రం పోలీసు లాంఛనాలతో ముగిశాయి. రాచకొండ సీపీ మహేష్‌భగవత్ ఆదేశానుసారం మాడ్గుల సీఐ కృష్ణమోహన్ ఆధ్వర్యంలో శ్రీనునాయక్ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. బాధితుడి వ్యవసాయ పొలంలోనే సంప్రదాయ ప్రకారం ఇరువురి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. తమ్ముడు జైపాల్ నాయక్ అంత్యక్రియలు నిర్వహిం చా రు. అంతకు ముందు శ్రీనునాయక్, ఆయన తండ్రి మాన్యనాయక్ మృతదేహాల వద్ద ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్, హైదరాబాద్ పోలీసు ఆకాడమీ శిక్షణ అధికారి డీసీపీ జానకీ షర్మీలా, వికారాబాద్ డీఎస్పీ సత్యనారాయణతో పాటు శిక్షణకాలంలో ఎస్సైలుగా ఉన్న దాదాపు వంద మంది పోలీసులు స్థానిక ప్రజాప్రతినిధులు నివాళులర్పించారు. ఎంతో భవిష్యత్తు ఉన్న శ్రీనునాయక్ మృతి చెందడం బాధాకరం అని బాధిత కుటుంబానికి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. బాధితకుటుంబానికి ప్రభుత్వం పరంగా అండగా ఉంటామని భరోసా కల్పించారు.
నేనావత్ శ్రీను మృతి బాధాకరం: ఎస్పీ కోటిరెడ్డి
వికారాబాద్, జనవరి 2 : యువ ఎస్సై నేనావత్ శ్రీను మృతి బాధాకరమని వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నల్లగొండ జిల్లాలోని మాడుగుల మండలం మారుమూల కుగ్రామం మాన్య నాయక్ తండా నుంచి ఒక నిరుపేద కుటుంబంలో పుట్టారన్నారు. నేనావత్ శ్రీనునాయక్ చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి కూలీ పని చేస్తూ ఎం.టెక్ వరకు చదివి 2020 సంవత్సరంలో ఎస్సై ఉద్యోగం సంపాదించారని తెలి పారు. ట్రైనింగ్ సమయం నుంచే సహచర మిత్రులకు అన్ని రకాలుగా అం డగా ఉంటూ అందరి మంచి చెడులు చూసే ఒక పెద్ద దిక్కుగా ఉన్నారన్నారు. శ్రీనునాయక్ అకస్మిక మరణం చెందటంతో ఒక మంచి వ్యక్తిని, ఒక మంచి పోలీస్ అధికారిని పోలీస్ శాఖ కోల్పోయిందన్నారు. వారి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు మనఃశాంతిని ప్రసాదించాలని భగ వంతుడిని ప్రార్థించారు. పోలీస్ శాఖ వారి కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటుందన్నారు. జిల్లా ప్రజలందరూ రోడ్డు ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు.