నేటి నుంచి ముచ్చింతల్‌లో సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలు
వైభవంగా ముస్తాబైన శ్రీరామనగరం ఆశ్రమం
యాగశాలలు, వేదికలు అలంకరణ
మంగళప్రదాయులు మన ఆళ్వార్లు
దక్షిణభారత్‌లో తొలిసారి ఆళ్వార్ల విగ్రహ ప్రతిష్ఠాపన
శంషాబాద్ ఆశ్రమంలో కొలువైన ఆళ్వార్లు
మణికొండ, ఫిబ్రవరి 1: సర్వ మానవాళికి సమానత్వాన్ని ప్రబోధించిన సమతామూర్తి భగవద్రామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలకు సన్నద్ధమైంది. నేటి నుంచి ఈనెల 14వ తేదీ వరకు కనులపండువగా జరిగే వేడుకలకు రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని శ్రీరామనగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. 216 అడుగుల రామానుజాచార్యుల విగ్రహాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దగా, 108 దివ్యదేశ ఆలయాలు పచ్చందాలు, రంగురంగుల విద్యుత్‌కాంతుల్లో కళకళలాడుతున్నాయి. దక్షిణభారత్‌లో తొలిసారి ఆళ్వార్ల విగ్రహ ప్రతిష్ఠాపన కూడా ఈ దివ్యక్షేత్రంలోనే జరగడం విశేషం.
భగవంతుడి కోసం ఋషులు తపించారు. కానీ, భగవంతుడే ఆళ్వార్ల కొరకు తపించినట్లు చరిత్ర చెబుతుంది. ఋషులు తమ జ్ఞానాన్ని తపో యజ్ఞ ధ్యానుల వల్ల పొందినప్పటికీ ఆళ్వార్లు అలా కాకుండా భగవంతుడి అనుగ్రహం పొందడానికి తమంతట తాము ఏ ప్రయత్నాన్ని చేయలేదు. భగవంతుడే వీళ్లని ఎంచుకుని జ్ఞానాదులుగా పరిపూర్ణంగా అవగాహించినట్లు పురాణం చెబుతుంది. అందుకే ఋషుల కన్నా ఆళ్వార్లు భగవంతుడికి ఎక్కువ ఇష్టమని పెద్దలు భావిస్తారు. అసలు ఆళ్వార్లు అంటేనే, భగవదనుభవం అనే పరీవాహంలో దివ్య సౌందర్య భావన ధారలే దివ్య ప్రబంధాలు అయ్యాయి.
పుట్టుకతోనే ఆళ్వార్లు దివ్యాంశ కలవారు కారని కొంత మంది పెద్దల అభిపా్రఆయం. ఇది నిజమే కావొచ్చు. వారు సామాన్య కులాల్లో అతి సామాన్యులుగా జన్మించినవాళ్లే! ఇలాంటి సామాన్య జీవులను పరమాత్మ అనుగ్రహించి ఉద్ధరించి, దివ్యులను చేసి వారిచేత పాడించినట్లు నానుడి. ఈ ఆళ్వార్లులో ఒక్కొక్కరు ఒక్కో జాతిలో ఆవిర్భవించారు. అయినా, అందరూ భగవంతుని నిర్హేతుక జాయమాన కృపచేతనే వారు దివ్యానుగ్రహాన్ని పొందారు.
ఆళ్వార్లందరి పేర్లను తెలిపే శ్లోకం….
!! భూతం సరశ్చ మహాదాహ్వయ భట్టనాథ, శ్రీ భక్తిసార కులశేఖర యోగివాహాన్
భక్తాంఘ్రిరేణు, పరకాల యతీద్ర విశ్రాన్! శ్రీ మత్పరాంకుశ మునిం ప్రణతోస్మి నిత్యమ్!!
అసలు ఈ ఆళ్వార్లు ఎవరెవరు..? ఎంతమంది… అనే విషయాలపై అభిప్రాయ భేదాలున్నా.. చాలా మంది పన్నెండు మంది ఆళ్వార్లు అనే మాటనే విశ్వసిస్తారు.
పేయాళ్వార్
“తులా శతభిషగ్జాతం మయూరపురి కైరవాత్… మహాస్తం మహాదాఖ్యాతం వన్దే శ్రీ నన్ధకాంశజమ్”
వీరిని ‘మహాయోగి’ అని కూడా అంటారు. వీరు మైలాపూర్‌లో జన్మించారు. భగవంతుణ్ణి స్తుతిస్తూ వీరు కూడా వంద పాటలు పాడి ఆ పాటల పరమభక్తిని ప్రతీకలుగా చాటారు. వీరు మొదటి ఇద్దరు ఆళ్వార్లూ వెలిగించిన దీపకాంతిలో శ్రీమన్నారాయణుని దివ్యదేశాన్ని లక్ష్మీదేవిని, స్వామి ధరించిన శంఖు చక్రాల వైభవాన్ని దర్శించినానని కీర్తించారు.
మధుర కవి ఆళ్వార్
“మేషే చిత్తాసముద్బాతం పాణ్ణ్యదేశే గణాంశకం.. శ్రీ పరాజ్కుశసద్బక్తం మధురం కవిమాశ్రయే”
వీరు నమ్మాళ్వార్ల కాలంలోనే ఉన్న వారి శిష్యులు. వీరి వలననే నమ్మాళ్వార్ల పాటలు గ్రంథరూపం అయ్యాయి. వీరు తిరుక్కోవలూర్ అనే గ్రామంలో జన్మించారు. అయోధ్యలోనున్న వీరు ఆకాశంలోని ఒక నక్షత్రం కాంతిని ఆధారంగా చేసికొని ప్రయాణించి, నమ్మాళ్వార్ల వద్దకు చేరుకుని, వారి గొప్పదనాన్ని గుర్తించి, వారికి శిష్యులైనారు. వీరు నమ్మాల్వార్ల గురించి కణ్ణినుణ్ శిరుత్తాంబు అనే 11 పాటలు పాడారు. అవి భక్తులందరికి ఎంతో ప్రవిత్రమైనవి.
తిరుమళి శై ఆళ్వార్
“మఖాయం మకరే మాసే చక్రాంశం భార్గవోద్భవం.. మహీసార పురాధీశం భక్తిసార మహంభజే”
వీరిని ‘భక్తిసారులు’ అని కూడా అంటారు. వీరు మహీసారపురంలో జన్మించారు. మేదరివాని ఇంట పెరిగారు. వీరు అన్ని మతాలనూ ఆసాంతం చూసి.. అవన్నీ సార రహితాలని గమనించారు. తరువాత పేయాళ్వార్ల బోధనలతో విష్ణుభక్తునిగా మారారు. మహా ఉదాసీనులై ప్రాపంచిక విషయాలను పట్టించుకోక ఎల్లప్పుడు భగవద్ధ్యానంలోనే ఉండేవారు.
పెరియాళ్వార్
“మిథునే స్వాతిజం విష్ణోః రథాంశం ధన్వినః పురే… ప్రపద్యే శ్వశురం విష్ణోః విష్ణుచిత్తం పురశ్శిఖమ్”
వీరినే ‘విష్ణుచిత్తులు’ అని కూడా అంటారు. వీరు శ్రీవిల్లిపుత్తూరులో జన్మించారు. వీరే గోదాదేవిని పెంచిన తండ్రి. వీరికి భగవంతుడంటే వెర్రి ప్రేమ. ఈయనను ఏనుగు మీద ఎక్కించి ఊరేగిస్తూంటే. అది చూడటానికి భగవంతుడు ఆకాశంలో ప్రత్యక్షం అయ్యాడట. భగవంతుడికి ఈలోకుల దృష్టిదోషం తగలకుం డా పల్లాండు పల్లాండు అంటూ భగవంతునికి మంగళ శాసనాలు చేస్తూ ఓ 11పాటలు పాడా రు. బాలకృష్ణుడి లీలలంటే ఎంతో ఇష్టం. వీరి పాటలను పెరియాళ్వార్ తిరుమొైళ్లె అని అంటారు.
కులశేఖరాళ్వార్
“కుమ్బే పునర్వసౌ జాతం కేరళే చోళపట్టణే…కౌస్తుభాంశం ధరాధీశం కులశేఖర మాశ్రమే”
వీరు తిరువాన్కూరు రాజవంశానికి చెందిన వారు. కేరళలోని చోళ పట్టణంలో జన్మించారు. శ్రీరంగం అన్నా, శ్రీరామచంద్రుడన్నా వెర్రి ప్రేమ, పిచ్చి అభిమానం. శ్రీరామాయణ ప్రవచనం వింటూ మైమరచిపోయి, రావణాసురుడు సీతమ్మను ఎత్తుకొని వెళ్లిపోయిననాడు అనగానే, లంక మీదకు దండయాత్ర ప్రకటించారట. వీరు పాడిన ప్రబంధం పేరు పేరుమాళ్ తిరుమొప్తి.
తొండరడిప్పొడియాళ్వార్
“కోదణ్ణే జ్యేష్ఠనక్షత్రే మండజ్గుడి పురోద్భవం.. చోళర్వ్యాం వనమాలాంశం భక్తపద్రేణుమాశ్రయే”
వీరినే ‘భక్తాఘ్రిరేణువు, విప్రనారాయణస్వామి’ అని కూడా అంటారు. వీరు మండంగుడి అనే గ్రామంలో జన్మించారు. భగవంతుని వైజయంతీమాల అంశ. అందకనేనేమో వీరు శ్రీ రంగనాథుల వారికి పుష్పమాలా కైంకర్యం చేసేవారు.
నమ్మాళ్వార్
“వృషభే తు విశాఖాయాం కురుకాపురికారిజం…పాణ్ణ్యదేశే కలేరాదౌ శఠారిం సైన్యపం భజే”
వీరిని ‘శఠగోపులు’ అని కూడా అంటారు. వీరు ఆళ్వార్ తిరునగరి అని పిలువబడే కురుకాపరిలో జన్మించారు. ఆళ్వార్లందిరిలోకి ముఖ్యమైనవారు. అందుకనే వీరిని ఆళ్వార్ల శరీరం అని మిగిన ఆళ్వార్లందరినీ వీరికి అవయవాలు అని అంటారు. తమని నాయికగా, నాయిక తల్లిగా, నాయిక చెలికత్తెగా భావించుకుని భగవంతునిపై వారి ప్రేమని, ఆర్తిని నాలుగు ప్రబంధాలుగా పాడారు.
పొయ్‌గయాళ్వార్
“తులాయాం శ్రవణే జాతం కాఞ్చ్యం కాఞ్చన వారిజాత్! ద్వాపరే పాఞ్చజన్యాంశం సరోయోగిన మాశ్రయే!!”
(వీరిని సరోయోగి అని అంటారు. వీరు ద్వాపర యుగం, కాంచీపురంలో ఒక కొలనులోని తామర పుష్పంలో జన్మించినట్లు చరిత్ర వెలువరిస్తోంది. వీరు మొదల్ తిరువందారి అనే పేరుతో 100 పాటలు పాడారు. వీరి పాటలు పరభక్తికి ప్రతీకలు. వీరు ‘భూమినంతటినీ ఒక ప్రమిదగా జేసి, సముద్రాల నీటినంతటినీ దానిలోకి నెయ్యిగా జేసి, దానిలో సూర్యుడనే వత్తివేసి, భగవంతుణ్ణి దర్శించడానికి ఒక దీపం వెలిగిస్తాను’ అని కీర్తించారు. అంటే బాహ్య ప్రపంచమంతా భగవన్మయమేనని చాటారు)
తిరుప్పాణ్ ఆళ్వార్
“వృశ్చికే రోహిణీ జాతం శ్రీ పాణం నిచుళాపురే…శ్రీ వత్సాంశం గాయకేన్ద్రం మునివాహనమాశ్రయే”
శ్రీ వైష్ణవమతం కుల వర్ణాలకు అతీతంగా భక్తి పునాదుల మీదు నిలచింది. అనడానికి వీరు నిలువెత్తు సాక్ష్యం. వీరు పంచమ కులానికి చెందినవారు. వీరిని ముని వాహన యోగి అని కూడా అంటారు. వీరు శ్రీరంగం సమీపంలోని నిచుళాపురంలో జన్మించినారు. వీరు వీణవాయిస్తూ శ్రీరంగనాథుని మీదు పాటలు పాడేవారు.
పూదత్తాళ్వార్
“తులాధనిష్టా సంభూతం భూతం కల్లోలమాలినః తీరే ఫుల్లోత్పలే మల్లా పుర్యామీడే గదాంశజమ్”(వీరినే భూతయోగి అని కూడా అంటారు. వీరు మహాబలిపురంలోని ఒక కలువ పూవులో జన్మించారు. భగవంతుణ్ణి స్తుతిస్తూ వీరు కూడా ఒక వంద పాటలు పాడారు. ఆ పాటలు పరజ్ఞాన ప్రతీకలు. వీరు ‘ప్రేమ అనే ప్రమిదలో ఆర్తి అనే నెయ్యిపోసి కరిగిపోతున్న మనస్సు అనే వత్తివేసి జ్ఞానమనే దీపాన్ని వెలిగించి ఆ వెలుగులో భగవంతుణ్ణి దర్శిస్తాను..’ అని కీర్తించారు.. అంటే దేహం లోపల ఉండే అంతర ప్రపంచమంతా భగవన్మయమేనని నిరూపించారు.
తిరుమంగయాళ్వార్
“వృశ్చికే కృత్తికాజాతం చుతుష్కని శిఖామణిమ్.. షట్ప్రజన్ధకృతం శార్ జ్గమూర్తిం కలిహమాశ్రయే”
వీరు ఆళ్వార్లందరిలోకి చివరివారు. వీరికి పరకాలుడు అని కూడా పేరు. భార్యతో కలసి కనిపించే ఆళ్వారు వీరు ఒక్కరే. ఆమె పేరు కుముదపల్లి, ఆమె వల్లనే వీరు భక్తిమార్గంలోకి వచ్చారు. నమ్మాళ్వారు వేదాల వంటి నాలుగు ప్రబంధాలను పాడితే., వీరు వేదాంగాల వంటి ఆరు ప్రబంధాలను పాడారు. ఈ లోకంలోని 106 దివ్య దేశాలను సందర్శించి ఆయా పెరుమాళ్ల గురించి పాటలు పాడిన ఆళ్వార్లు వీరొక్కరే..
శ్రీ ఆండాళ్
“కర్కటే పూర్వం ఫల్గున్యాం తులసీకాననోద్భవామ్…పాణ్ణే విశ్వంభరాం గోదాం వన్డే శ్రీ రజ్గనాయకీమ్”
ఈమెను ‘ఆండాళ్’ అని ‘ఆముక్త మాల్యద’ అని , ‘చూడికొడుత్త నాంచార్’ అని కూడా అంటారు. ఆళ్వార్లలో ఈమె ఒక్కతే స్త్రీ. తులసీవనంలో దొరికిన ఈమెను పెరియాళ్వార్లు పెంచి పెద్ద చేశారు. ఈమెకు చిన్ననాటి నుంచి శ్రీరంగనాథడంటే వెర్రి ప్రేమ. ఈమె భగవంతుని వలచి ఆయన గురించి పాడి. శ్రీరంగనాథుని వివాహమాడి, ఆయనలో చేరిపోయింది. ఈమె పాడిన తిరుప్పావు, గురించి ఎరగని వారుండరు. ఈమె నచ్చియార్ తిరుమొపై అనే 143 పాటలు పాడారు.
తిరువంగప్పెరుమాళ్ అరైయర్
శ్రీరంగం, కాంచీపురం వంటి దివ్య దేశాలలో, భగవంతుని ఎదుట ఆళ్వారుల ప్రబంధాన్ని చక్కగా గానం చేసి, ఆపాశురాల భావాన్ని, ఆయా ఆళ్వార్లు ఆయా పాశురాలలో ఏమి ఉద్దేశించారో.. తమ అభినయంతో భగవంతుని ఎదుట ప్రదర్శించేవారిని ‘అరైయరులు’ అని అంటారు. శ్రీరామానుజుల వారి కాలంలో శ్రీరంగంలో శ్రీయామునాచార్యుల వారి కుమారులైన తిరువంగప్పెరుమాళ్ అరైయర్ ఈ సేవ నిర్వహించేవారు. వీరు శ్రీరామానుజుల ఆచార్యులలో ఒకరు. శ్రీ వైష్ణవ సంప్రదాయానికి మూల పురుషులైన నథముల పరంపరకు చెందినవారు.