ప్రతి కుటుంబం ఆరు మొక్కలు నాటాలి
ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
భూపాలపల్లి రూరల్, జూన్ 30: భూపాలపల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేయాలని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. బుధవారం సింగరేణి ఇల్లందు క్లబ్ హౌస్లో మున్సిపల్ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణి అధ్యక్షతన సాధారణ సర్వ సభ్య సమా వేశం జరిగింది. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర, కలెక్టర్ కృష్ణ ఆదిత్య, అదనపు కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు డివిజన్లలో ఉన్న సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చారు. పలువురు అధికారులు హాజరుకాకపోవడంతో కౌన్సిలర్లు అసహనం వ్యక్తం చేశారు. కుక్కలు పట్టడానికి రూ.2 లక్షలు, చెత్త సేకరణ బండ్ల రిపేరుకు రూ.2 లక్షలు వెచ్చించినప్పటికీ పట్టణంలో కుక్కలు, రిపేరు చేయకుండానే బండ్లు అలాగే ఎందుకున్నాయని కౌన్సిలర్లు అధికారులను నిలదీశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలను అవసరాలను దృష్టిలో ఉంచుకుని పట్టణ ప్రగతిలో భాగంగా ప్రణాళికలు తయారు చేయాలన్నారు. పట్టణాల్లో నెలకొన్న సమస్యలన్నింటినీ తీర్చడానికి జూలై 1 నుంచి 10వ తేదీ వరకు సీఎం కేసీఆర్ పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని, అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేయాలన్నారు. వాతావరణ సమతుల్యత దెబ్బతినకుండా ఉండేందుకు ప్రతి కుటుంబం హరితహారంలో భాగంగా మొక్కలు నాటాలన్నారు. మృతులను శ్మశానానికి తరలించేందుకు కైలాస రథం అందజేస్తానన్నారు. కలెక్టర్ కృష్ణ ఆదిత్య మాట్లాడుతూ పట్టణంలోని సమస్యలు తీర్చడానికి కృషి చేస్తున్నామని, మెగా నర్సరీ, రెండు శ్మశాన వాటికలు, రెండు వార్డులకు ఎకో పార్కు ఏర్పాటు చేయడానికి అధికారులు స్థలాలను గుర్తిస్తున్నారన్నారు. వీటిలో కొన్నింటి స్థలాలను గుర్తించి పనులు కూడా సాగుతున్నట్లు చెప్పారు. జనాభాకు అనుగుణంగా ప్రత్యేక వ్యాక్సినేషన్ క్యాంపులను ఏర్పాటు చేస్తామని, నాన్వెజ్ వ్యర్థాలను పడేసేందుకు ప్రత్యేక డంపింగ్ యార్డు ఏర్పాటు చేస్తామన్నారు. వర్షకాలం ప్రారంభమైనందున సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఓపెన్ ప్లాట్ల పై దృష్టిసారించాలని అధికారులను ఆదేశించారు. నేటి నుంచి జరిగే పట్టణ ప్రగతి పనులను సమర్థవంతంగా పూర్తి చేయాలని అన్నారు. అదనపు కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ మాట్లాడుతూ పట్టణంలో చెత్తను తీసుకుపోయే వాహనాలను తొందరగా రిపేరు చేయించి అందుబాటులోకి తీసుకు రావాలని, శానిటేషన్, త్రాగునీరు, హరితహారం పై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, తహసీల్దార్ ఇక్బాల్, ఎస్సై ఉదయ్ కిరణ్, తదితరులు పాల్గొన్నారు.