భగవంతుడు ‘ఇందు గలడు.. అందు లేడ’ని నిరూపించిన అవతారమూర్తి నరసింహస్వామి. ప్రహ్లాదుడి పిలుపుతో ప్రకటితమైన ఉగ్ర నరసింహుడు.. ఆపై లక్ష్మీనృసింహుడిగా మన రాష్ట్రంలో వివిధ క్షేత్రాల్లో కొలువుదీరాడు. తెలంగాణ ఇలవేల్పు అయ్యాడు. యాదగిరిగుట్టపై కొలువైన ఈ కొంగుబంగారం తన బిడ్డలకు శాంతమూర్తి. బ్రహ్మోత్సవ వేళ యాదగిరిగుట్ట ఇల వైకుంఠంలా కనువిందు చేస్తుంది. అష్టలక్ష్ములనూ అనుగ్రహించే ఈ పంచనారసింహ క్షేత్రం కోలాహలంలో మనమూ భాగమవుదాం.
రుష్యశృంగ మహర్షి పుత్రుడు యాదర్షి. బాల్యం నుంచి అతను నిరంతరం హరినామ స్మరణ చేసేవాడు. నరసింహుడి అనుగ్రహం కోరి కఠోరమైన తపస్సు ఆచరిస్తాడు. యాదర్షి తపస్సుకు మెచ్చిన స్వామి నరసింహుడిగా జ్వాలాకారుడిగా, భయంకర ధ్వనులతో దర్శనమిస్తాడు. ఉగ్ర రూపం ఉపశమించి శాంతదీప్తిగా కొలువుదీరమని కోరగా.. యాదగిరిపై స్వామి అర్చామూర్తిగా వెలిశాడని స్థలపురాణం. ఈ క్షేత్రానికి పాలకుడు ఆంజనేయస్వామి. హనుమంతుడి ఆజ్ఞ మేరకే యాదర్షి ఇక్కడ తపస్సు చేశాడన్న కథనం ప్రచారంలో ఉంది.
ఇక్కడ విష్ణుభగవానుడు జ్వాలా నరసింహ, ఉగ్ర నరసింహ, యోగ నరసింహ, లక్ష్మీ నరసింహ, గండభేరుండ నరసింహ ఇలా పంచ నారసింహుడిగా ఏకశిలపై అవతరించినట్టు స్థలపురాణం చెబుతున్నది. కృత యుగం నుంచే స్వామి ఇక్కడ పూజలు అందుకుంటున్నాడని ప్రతీతి. జ్వాలా నరసింహుడిని ఆరాధించడానికి పరమశివుడు సైతం ఈ క్షేత్రంలో స్వయంభువుగా వెలిశాడని చెబుతారు. దీనికి బలాన్ని చేకూర్చేలా ఈ వైష్ణవ క్షేత్రంలో శివాలయం ఉండటం.. శివకేశవుల అభేదత్వానికి ప్రతీకగా కనిపిస్తుంది. క్రీస్తుశకం 12వ శతాబ్దం వరకు మునులు, యోగులు, సాధకులు, సిద్ధులు మాత్రమే స్వామిని దర్శించుకునేవారట. అందుకే స్వామికి సాధక తారకుడనే పేరు వచ్చింది. 12వ శతాబ్దిలో పశ్చిమ చాళుక్యులలో ప్రసిద్ధుడైన త్రిభువనమల్లుడు తన రాజ్య విస్తరణలో భాగంగా భువనగిరిలో కోటను నిర్మించుకొని స్వామిని సేవించినట్టు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి.
ఈ క్షేత్రంలో మొదట్లో మూడురోజులు ఉత్సవాలు చేసేవారు. తర్వాతి కాలంలో ఐదు రోజులు చేశారు. కాలక్రమంలో 11 రోజులపాటు బ్రహ్మోత్సవాలు జరగడం మొదలైంది. ఏటా పాల్గుణ శుద్ధ విదియ నుంచి ద్వాదశి వరకు బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 1న బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా 7న తేదీన ఎదుర్కోలు ఉత్సవం జరగనుంది. 8న తిరుకల్యాణ మహోత్సవం కన్నులపండువగా సాగుతుంది. 9న దివ్య విమాన రథోత్సవం, 11న గర్భాలయంలోని మూలవర్లకు సహస్ర ఘటాభిషేకం నిర్వహిస్తారు.