Ganesh Puja | నాక్షతైః అర్చయేద్విష్ణుం
న తులస్యా గణాధిపం!
అనేది మన శాస్త్ర ప్రమాణం. అక్షతలతో విష్ణుమూర్తికి, తులసీ దళాలతో గణపతికి పూజ చేయకూడదని ఈ నియమం చెపుతుంది. దేవతలందరికీ ప్రీతిపాత్రమైన తులసీ దళాలను గణపతికి వాడక పోవడానికి పురాణాలలో ఒక కథ ప్రచారంలో ఉంది. హంసధ్వజుని పుత్రుడైన ధర్మధ్వజునికి విష్ణువు అంశ వలన కలిగిన సంతానమే తులసి. ఈమె గంగా నదీ తీరంలో విహరిస్తున్నప్పుడు అటుగా వచ్చిన గణపతిని చూసి మోహిస్తుంది. తనను వివాహం చేసుకొమ్మని గణపతిని కోరుతుంది. అందుకు వినాయకుడు ఒప్పుకోకపోవడంతో ‘దీర్ఘకాలం బ్రహ్మచారిగానే ఉండిపొమ్మ’ని గణపతిని శపిస్తుంది తులసి.
‘రాక్షసునికి జీవితాంతం బందీగా ఉండిపొమ్మని’ ప్రతిశాపం ఇస్తాడు వినాయకుడు. అయితే, అంతటి భయంకరమైన శాపాన్ని భరించలేనని తులసి వేడుకోగా.. ‘విష్ణుమూర్తి వల్ల విమోచనం పొంది తులసీ వృక్షంగా అవతరిస్తావ’ని అనుగ్రహిస్తాడు వినాయకుడు. ఆ తర్వాత తులసి బ్రహ్మదేవుని వరంతో కృష్ణ కవచాన్ని పొందిన శంఖచూడుడనే రాక్షసున్ని వివాహమాడుతుంది. కృష్ణ కవచం ఉందనే గర్వంతో అతను దేవతలందరినీ బాధిస్తుంటాడు.
అయితే, తులసీదేవి పాతివ్రత్య మహిమ వల్ల శంఖచూడుణ్ని ఎవరూ జయించలేకపోతారు. వినాయకుని సాయంతో ఆమె పాతివ్రత్యానికి భంగం వాటిల్లేలా చేసి రాక్షసుడిని సంహరిస్తాడు విష్ణువు. తర్వాత శ్రీహరి వరంతో తులసి చెట్టుగా అవతరిస్తుంది. తన పాతివ్రత్యానికి భంగం కలగడానికి సహకరించిన ఆ పార్వతీ తనయుడిని ‘శిరస్సు లేకుండుగాక’ అని తులసి శపిస్తుంది. తనను శపించిందనే కోపంతో తులసి సాన్నిహిత్యాన్ని సహింపనని చెబుతాడు గణపతి. వినాయక చవితి రోజు మాత్రం మినహాయింపు ఉందని బ్రహ్మవైవర్త పురాణం చెబుతుంది. అందుకే, వినాయకచవితి రోజు మినహా మరేరోజూ వినాయకుడికి తులసి సమర్పించరు.