Lord Jagannath | హిందూ ధర్మంలో దేవుని రూపం ఒక కళాత్మక ప్రతిమ మాత్రమే కాదు. అది ఆయన దివ్య గుణాలు, లీలలు, సందేశాలకు ప్రతీకగా నిలుస్తుంది. ప్రతి దేవతా స్వరూపం వెనుక ఓ అంతరార్థం ఉంటుంది. అది ఆ దేవత స్వభావాన్ని, శక్తిని, పాత్రను ప్రతిబింబిస్తుంది. అలాంటి విభిన్నమైన, ఎంతో రహస్యమైన స్వరూపం పూరీ జగన్నాథునిది. విష్ణువు, శ్రీకృష్ణుడి అవతారంగా జగన్నాథుడు పూజలందుకుంటున్నాడు. పూరీ జగన్నాథ మందిరంలో పూజలందుకుంటున్న జగన్నాథుడి స్వరూపాన్ని తొలిసారి చూసిన ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. ఈ విగ్రహంలో చేతులు, కాళ్లు కనిపించవు. కానీ, పెద్ద పెద్ద గుండ్రటి కళ్ళు కనిపిస్తాయి. కనురెప్పలు ఉండవు. ఈ విగ్రహాన్ని చూసి సాధారణంగా అందరూ ‘అసాధారణమైన రూపం’గా భావిస్తారు. రూపం వెనుక ఎంతో నిగూఢమైన అర్థం ఉన్నది. స్వామివారు ఈ రూపంలో భక్తుడిని నిరంతరం చూస్తున్నాడన్న సందేశాన్ని మనకు ఇస్తుంది. క్షణం తీరిక లేకుండా సృష్టిని గమనిస్తూ.. ఆ దేవదేవుడు భక్తులను అనుగ్రహిస్తున్నట్లుగా భావిస్తారు.
చాలా మంది మనస్సులో ఈ ప్రశ్న ఉంటుంది. దేవుడి విగ్రహం ఎందుకు అసంపూర్ణంగా ఉంది? ఆయన కళ్ళు ఎందుకు అంత పెద్దవిగా ఉన్నాయి? అనే ప్రశ్నలు ఎదురవుతాయి. ఈ ప్రశ్నలకు సమాధానం పురాణాలు, భక్తి సాహిత్యం, భగవంతుడి లీలా తత్వం ఒకచోట కలుస్తాయి. ఈ విగ్రహం ఓ స్పష్టమైన సందేశాన్ని ఇస్తుంది. భగవంతుడిని పరిపూర్ణత ద్వారా కాకుండా విశ్వాసం ద్వారా ఆయన దగ్గరుకు చేరుకోవచ్చని చెబుతున్నది. భగవంతుడు ఏ రూపంలో ఉన్నా.. ఏ సంప్రదాయమైనదైనా.. ఆశ్చర్యకరమైనదైనా ఆయనను మనం ఆరాధించడం ద్వారా ఆ దేవుడికి భక్తుడు దగ్గరయ్యే సాధనంగా ఈ విగ్రహం మారుతుంది. అయితే, జగన్నాథుడి ఈ విగ్రహం వెనుక పెద్ద కథనే ప్రచారంలో ఉంది. ఆ కథ ఏంటో తెలుసుకుందాం..!
సాధారణంగా ఏ ఆలయంలోనైనా స్వామివారి విగ్రహ రూపంలో కళ్ళు, శరీర భాగాలు అన్ని మామూలుగానే కనిపిస్తాయి. కానీ, జగన్నాథుడికి మాత్రం పెద్ద కళ్ళు ఉంటాయి. దీని వెనుక ఓ పురాణ కథ ప్రచారంలో ఉంది. ఓకానొక రోజు ద్వారకలో శ్రీకృష్ణుడి గురించి బృందావనం రాసలీల గురించి మాతా రోహిణి అందరినీ కూర్చుండబెడుతుంది. అందులో కృష్ణుడి సోదరి సుభద్ర ఉంటుంది. ఆమెను అక్కడి నుంచి పంపేస్తారు. ఏం చెబుతుందోనని ఆసక్తితో వినేందుకు ఆమె గది బయట నిలబడి తన పెద్ద కళ్ళను చేసుకుంటూ వింటుంది. అది చూసిన బలరాముడు, కృష్ణులు సైతం అలాగే పెద్ద కళ్ళు చేసుకుని ఆమె పక్కనే నిలబడి చూస్తుంటారు.
ముగ్గురు కళ్ళు పెద్దవి చేసి చూడడాన్ని చూసిన అలా నిలబడడం చూసిన నారద మహర్షి ఆశ్చర్యపోతాడు. ఈ దివ్య రూపాన్ని భక్తులు ఎల్లప్పుడూ చూసేలా చూడాలని ఆయన శ్రీకృష్ణుడిని ప్రార్థించాడు. నారద ముని కోరికను అంగీకరించి, భగవంతుడు ఈ రూపాన్ని శాశ్వతం చేశాడు. ఈ రూపం ఒక కథ ప్రతిబింబం మాత్రమే కాదు. భక్తుల ప్రేమ, భగవంతుని భావోద్వేగ సున్నితత్వానికి చిహ్నంగా కనిపిస్తుంది. జగన్నాథుడి కళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన భక్తులను గమనిస్తున్నాడని చెప్పేందుకు చిహ్నంగా భావిస్తారు. పురాతన గ్రంథాల ప్రకారం.. కండ్లను ఆత్మకు కిటికీలుగా పరిగణిస్తారు. అయితే, జగన్నాథుడి ఈ కళ్ళు దైవిక దృష్టి, జ్ఞానానికి చిహ్నంగా కనిపిస్తాయి. జగన్నాథుడి విగ్రహానికి పెద్ద కళ్ళు పెట్టడం అనే సాంప్రదాయం శతాబ్దాల నుంచి వస్తుండగా.. ఈ విగ్రహాన్ని చూడగానే భక్తులకు తన్మయత్వం చెందగా.. వారి తెలియకుండానే కళ్ళల్లో నుంచి నీరు వస్తాయని పలువురు భక్తులు చెబుతున్నారు.
పురాణాల ప్రకారం.. ఇంద్రయుమ్నడు అనే రాజు విష్ణు భక్తుడు. ఆయన ప్రత్యేకమైన, పవిత్రమైన విగ్రహంతో గొప్ప ఆలయాన్ని నిర్మించాలని కోరుకున్నాడు. అయితే, కలలో శ్రీకృష్ణుడు కనిపించి తన పరిపూర్ణ రూపాన్ని కనుగొనాలని చెప్పాడు. విగ్రహాలను అత్యద్భుతంగా తీర్చిదిద్దేందుకు దేవశిల్పి విశ్మకర్మ సహాయం కోరుతాడు. ఇందుకు అంగీకరించిన విశ్వకర్మ ఓ షరతును విధిస్తాడు. తన పని పూర్తయ్యే వరకు ఎవరూ తనను ఇబ్బంది పెట్టొద్దని చెప్పగా.. అందుకు రాజు అంగీకరిస్తాడు. అయితే, రోజులు గడిచినా విగ్రహం తయారీకి సంబంధించి ఎలాంటి వివరాలు తెలియకపోవడంతో మహారాణి ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఒకసారి విగ్రహాల పనులు ఎంత వరకు వచ్చాయో చూడాలని రాజును ఒప్పించి పంపిస్తుంది. రాజు గది ద్వారాలు తెలియగానే విశ్వకర్మ అక్కడి నుంచి అదృశ్యమవుతాడు. జగన్నాథుడి మొహం మాత్రమే కలిగిన అసంపూర్ణమైన విగ్రహాలు కనిపిస్తాయి. దాంతో మహారాజు ఎంతో బాధపడుతాడు. ఆ తర్వాత కృష్ణుడు మళ్లీ కలలో కనిపించి అసంపూర్తిగా ఉన్న విగ్రహాలనే ప్రతిష్టించాలని చెబుతాడు. అప్పటి నుంచి అదే రూపంలో జగన్నాథుడు పూజలందుకుంటున్నాడు.
జగన్నాథుడి విగ్రహం గురించి మరో కథ సైతం ప్రాచుర్యంలో ఉన్నది. త్రేతాయుగంలో వనవాస సమయంలో శ్రీరాముడు ఒక చెట్టు వెనుక రహస్య ప్రదేశంలో ఉండి వాలిని సంహరిస్తాడు. శ్రీరాముముడు అపరాధ భావంతో ఉండగా.. వాలి మరణిస్తున్న సమయంలో అతన్ని తన ఒడిలోకి తీసుకొని.. అన్యాయంగా చంపినందుకు తనకు ఏ శిక్షణ విధించిన అంగీకరిస్తానని శ్రీరాముని చెబుతాడు. అప్పుడు వాలి రాముడు తనపై బాణం వేసినందున మణికట్టు అదృశ్యం అవుతుందని.. రాముడికి ఆశ్రయం ఇచ్చిన చెట్టు చేదుగా మారుతుందని శాపం విధిస్తాడు. అలా చేదుగా మారినప్పటికీ అందులో శ్రీరాముడు స్వరూపం ఉంటుందని రాముడు వాగ్ధానం చేస్తాడు. ఆ చెట్టు వేప చెట్టు కాగా.. కలియుగంలో జగన్నాథుడి విగ్రహానికి మణికట్టు కనిపించదు. వేప చెట్టుతోనే జగన్నాథుడి విగ్రహాలను తయారు చేయడం ఆనవాయితీగా వస్తున్నది. ఇంకా ఆలయంలో వింతలు, విశేషాలు, రహస్యాలున్నాయి. ఆలయంలోని మూడో మెట్టుపై యమశిల ఉంటుంది. దీని వెనుక ఆసక్తికరమైన కథ ప్రచారంలో ఉంది. ఈ మూడో మెట్టు ఎక్కితే చేసిన పుణ్యఫలమంతా పోయి నరకానికి వెళ్తారని.. అందుకే సింహద్వారం నుంచి మూడో మెట్టు ఎక్కినప్పటికీ తిరిగి మళ్లీ అదే మెట్టు నుంచి బయటికి వెళ్తే ఈ పుణ్యం పోతుందని చెబుతారు. అందుకే భక్తులు సింహద్వారం నుంచి వెళ్లి మరో మార్గం నుంచి బయటకు వస్తారు.