ఒక జర్నలిస్టు తండ్రి, మెడిసిన్ చదివే కొడుకు ఇద్దరూ తమ బంధువులు వస్తున్నారని తెలిసి వారికి ఆహ్వానం పలకడానికి విమానాశ్రయానికి వెళ్లారు. విమానం రావడం గంట ఆలస్యమవుతుందని అధికారులు ప్రకటించారు. ఇద్దరూ అక్కడే కుర్చీల్లో కూర్చున్నారు. ఖాళీ సమయం దొరకడంతో మెడికో అయిన కొడుకు, తండ్రిని ఇలా అడిగాడు.. ‘ఈ ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైనది ఏది?’ అని. తండ్రి చిన్నగా నవ్వి ‘ప్రేమ… అందులోనూ తల్లి ప్రేమ’ అని బదులిచ్చాడు.
‘అదెలా… ప్రపంచం మారుతున్నది. ఇంకా… ప్రేమ గొప్పది, అమ్మ ప్రేమ మరీ గొప్పది… లాంటి పాత ఆలోచనల్లోనే మీ తరం ఉంటున్నది. ఛాందసపు ఆలోచనలను మా యువతపై రుద్దాలని చేసే ప్రయత్నం అది’ అని ఆవేశంగా అన్నాడు. ‘సమయం, సందర్భం వచ్చినప్పుడు నీకు అవగాహన అయ్యేట్లు చెబుతాలే’ అన్నాడు తండ్రి. వారికి ఎదురుగా ఒక మహిళ కూర్చుని ‘ఓఁ’ అని ఏడుస్తున్నది. కారణమేమిటో కొడుకును అడగమన్నాడు తండ్రి. ‘ఎందుకు ఏడుస్తున్నారు?’ అని అడిగాడు. అప్పుడామె ‘మా అబ్బాయికి జర్మనీలో ఉద్యోగం. వద్దన్నా దేశం కాని దేశం వెళ్తున్నాడు. అక్కడ వేళకు తింటాడో లేదో..’ అని బాధగా చెప్పింది. ఆమెను పక్కనున్న వారు సముదాయిస్తూ ఉన్నారు.
‘చూశావా తల్లి ప్రేమ!’ అన్నట్లుగా చూశాడు తండ్రి. ‘ఆమె సాధారణ గృహిణి. కొడుకే ప్రపంచంగా భావించి ఉంటుంది. దూర దేశాలకు వెళ్తున్నాడని ఏడుస్తున్నది’ అని గట్టిగానే సమాధానమిచ్చాడు కొడుకు. ఇంతలో అక్కడ హడావుడి మొదలయ్యింది. ‘ఏమిటా’ అని తండ్రీకొడుకులు తిరిగి చూశారు. అక్కడికి వచ్చింది జిల్లా మహిళా కలెక్టర్. ఆమె చిన్నప్లిలలా వెక్కి వెక్కి ఏడుస్తున్నది. చేతి రుమాలు బాగా తడిసిపోయి ఉంది. ఎవరు ఎంత చెప్పినా వినడం లేదు. వృత్తిరీత్యా పరిచయం ఉన్న జర్నలిస్టు ఆమెకు నమస్కారం చెప్పి ‘ఎందుకలా బాధ పడుతున్నార’ని కలెక్టర్ని అడిగాడు. ఆమె తన ఏడుపును రెట్టింపు చేస్తూ ఇప్పుడు ‘మనదేశంలో లేనిది ఏమి ఉంది. ఇక్కడే ఏదో ఒక ఉద్యోగం చేసుకోవచ్చు కదా. ఎంత చెప్పినా నాకొడుకు వినడం లేదు. పట్టుబట్టి అమెరికా వెళ్తున్నాడు. వాడిని చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేను’ అని బాధతో బదులిచ్చింది. ఆమెకు ధైర్య వచనాలు చెప్పి అక్కడినుంచి విమానం దిగి వస్తున్న వారి చోటుకు బయలుదేరారు తండ్రీకొడుకులు. సాధారణ గృహిణి కన్నా, కలెక్టర్ ఎక్కువగా బాధపడటం చూసి మెడికో ఆశ్చర్యపోయాడు. తండ్రి వెనుకే నడుస్తూ ‘తల్లి ప్రేమకు చదువు, డబ్బు, హోదా, అడ్డు కావని… కులమతాలు, సంస్కృతి, సంప్రదాయాలు కూడా అవరోధాలు కావని, ఈ సృష్టి ఉన్నంత కాలం అమ్మ అమ్మే’ అని తెలుసుకున్నాడు. తండ్రి మాటలో నిజాన్ని మనస్ఫూర్తిగా అంగీకరించాడు.