యోగ శాస్త్రపరంగా ప్రతి మనిషిలో ఆరు చక్రాలు ఉంటాయి. వీటినే షట్చక్రాలు అంటారు. అవి మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ద, ఆజ్ఞాచక్రాలు. ఈ షట్చక్రాల్లోనే ప్రాణవాయువు సంచారం చేస్తుంటుంది. మనం తీసుకునే ఆహార పదార్థాల్లోని రుచులకు అనుగుణంగా ఆయా చక్రాలు చైతన్యవంతం అవుతాయి. అలాగే, మన ప్రాణవాయువు.. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన అనే అయిదు రకాలుగా ఉంటుంది. వీటిలో ప్రాణ- వగరు, అపాన- తీపి, వ్యాన- పులుపు, ఉదాన- కారం, సమాన చేదు రుచులతో అనుసంధానమై ఉంటాయి. మనం తీసుకునే ఆహారంలో ఏ రుచి ఎక్కువగా ఉందో అందుకు అనుగుణంగా ఆ రకమైన ప్రాణవాయువు ఉత్తేజితమవుతుంది. షట్చక్రాలు, పంచప్రాణాలను యోగ శాస్త్ర పద్దతుల ప్రకారం అదుపులో ఉంచుకోవటానికి కఠినమైన ఆహార నియమాలు పాటించాలి. ఏ ఒక్క ఆహారం (రుచి) మాత్రమే కాకుండా అన్ని రకాల రుచుల మేళవింపుగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఇలా రుచులన్నీ సమపాళ్లలో అందినప్పుడే శరీరం మనిషికి స్వాధీనంలో ఉంటుంది. అందుకే మన పెద్దలు ఉగాదికి ఆరు రుచుల పచ్చడిని నిర్దేశించారు. వివిధ పండుగల సందర్భంగా పలు రకాలైన ప్రత్యేక నివేదనలు సూచించారు.