శ్రావణ మాసంలో ప్రతి ఇంట్లోనూ పండుగ వాతావరణం పరిఢవిల్లుతుంది. ప్రత్యేకించి ఈ మాసంలో తారసిల్లే వరలక్ష్మీ వ్రతం మహిళలకు ఎంతో ప్రీతిపాత్రమైనది. ఇంటిల్లిపాదికి ఐశ్వర్యం, ఇల్లాలికి సౌభాగ్యం మొట్టమొదట కోరుకునేవారు గృహిణులే! వాటిని అనుగ్రహించే దేవత వరలక్ష్మీ దేవి. అందుకే ఆ తల్లి అనుగ్రహం కోరి మహిళలు శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు.
లక్ష్మీదేవి.. సంపత్ కరి అంటే సంపదనిచ్చే తల్లి. సంపద అంటే ధనం మాత్రమే కాదు. ధాన్యం, గుణం, జ్ఞానం, పశుసంపద.. అని కూడా అర్థం. వరలక్ష్మీ దేవి అనుగ్రహం కోరుతూ… ఆ తల్లిని ఆరాధిస్తారు. లక్ష్మీ అష్టోత్తర శతనామాలు, కనకధారా స్తోత్రం మొదలైనవి ప్రధానంగా పారాయణం చేస్తారు.
భవిష్యోత్తర పురాణంలో పార్వతీ పరమేశ్వర సంవాదంలో వరలక్ష్మీ వ్రతం ప్రసక్తి ఉన్నది. పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పిన వ్రత విధానాన్ని సూత మహర్షి శౌనకాది మహా మునులకు వివరించాడు. ‘స్త్రీలు సకల సౌభాగ్యవతులై పుత్ర పౌత్రాదులతో వర్ధిల్లాలంటే ఏ వ్రతం ఎలా ఆచరించాలి?’ అని పార్వతీదేవి అడిగితే పరమేశ్వరుడు కింది విధంగా వివరించాడు. ఇందులోనే ఆ వ్రత విధానం కూడా అంతర్లీనంగా ఉండటం విశేషం.
‘పూర్వం మగధ దేశంలోని కుండినమనే సర్వ సంపన్నమైన పట్టణంలో చారుమతి అనే బ్రాహ్మణ మహిళ ఉండేది. ఆమె ఉత్తమ ఇల్లాలు. పతివ్రత. భర్తకు, అత్తమామలకు ఎంతో సేవ చేసేది. ఆమె నిరంతర సేవా తత్పరతకు లక్ష్మీదేవి కరుణించి స్వప్నంలో కనిపించింది. ‘శ్రావణ శుద్ధ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను భక్తితో సేవించండి. మీ కోరికలు తీరుతాయి..’ అని పలికింది. చారుమతి వరలక్ష్మీ దేవికి భక్తితో ప్రదక్షిణ నమస్కారాలు చేసింది. స్తోత్రం చేసింది. నిద్ర మేలుకొని విషయం చెప్పగా అందరూ సంతోషిస్తారు.
లక్ష్మీదేవి ఆదేశం మేరకు శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతం చేయాలనుకుంటారు.
ఆ శుక్రవారం రానే వచ్చింది. ఉదయాన్నే మేల్కొంది చారుమతి. స్నానాదులు చేసి నూతన వస్ర్తాలు ధరించింది. ఇతర స్త్రీలూ ఆమె నివాసానికి వచ్చారు. ఇంట్లో గోమయంతో అలికిన మంటపంపై ఆసనం వేసి, బియ్యం పోసి కలశాన్ని స్థాపించి వరలక్ష్మీ దేవిని ఆవాహన చేసింది చారుమతి. ‘పద్మాసనే పద్మకరే‘ అనే శ్లోకంతో ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజలు చేసి తొమ్మిది సూత్రాల తోరాలను అందరూ కుడి చేతికి కట్టుకున్నారు. నానా విధ భక్ష్య భోజ్యాలు అమ్మకు నివేదించారు.
భక్తితో మొదటి ప్రదక్షిణం పూర్తి చేయగానే మహిళల కాళ్లకు గజ్జెలు గలగలలాడాయి. రెండో ప్రదక్షిణం చేశాక వారి చేతులకు నవరత్న కంకణాలు ప్రత్యక్షమయ్యాయి. మూడో ప్రదక్షిణం చేయగానే సర్వాభరణాలు వారి శరీరాలపై తళుకులీనాయి. చారుమతి ఇల్లు స్వర్ణ భవనమైంది. గుర్రాలు, ఏనుగుల రథాలు బారులు తీరాయి. వారంతా పురోహితుణ్ని పూజించి, 12 భక్ష్యాలు వాయనమిచ్చి, దక్షిణ తాంబూలాలతో తృప్తిపరచి నమస్కరించి… ఆశీర్వాదాలు తీసుకున్నారు. బంధుమిత్రులతో భోజనం చేశారు. అందరూ చారుమతిని కొనియాడి తమ ఇండ్లకు రథాలపై తిరిగి వెళ్లారు. వ్రతంలో పాలుపంచుకున్న స్త్రీలందరికీ సమస్త సంపదలు సంక్రమించినవి. ఈ కథ విన్నా చదివినా వరలక్ష్మీదేవి అనుగ్రహంతో సర్వ సంపదలూ చేకూరుతాయి’ అని పరమేశ్వరుడు పేర్కొన్నాడు.
సంతత స్వార్థరహిత సేవా తత్పరతే దైవానుగ్రహానికి కారణం అవుతుందని చారుమతి వృత్తాంతం చెబుతుంది. ఆ సేవా ధర్మం జీవితాన్ని పంచుకున్న భర్త నుంచే ఆరంభం కావాలి. తర్వాత భర్తను ప్రసాదించిన అత్తమామలకు ఆలంబనం కావాలి. ఆ తర్వాత సమాజం సంగతి. ఇది ఈ కథలో అంతరార్థం.
‘పతి భక్తి రతా సాధ్వీ శ్వశ్రూ శ్వశురయో ర్మతా…’- భర్తకు అత్తమామలకు ఎంతో సేవ చేసేది.. చారుమతి గురించి కథ ప్రారంభంలోనే పేర్కొన్నాడు శివుడు. ఆ ఇల్లాలు నిస్వార్థమైన సేవ చేయడమే.. తన కర్తవ్యంగా భావించింది. అదే భగవత్ అర్చనగా అనుభూతి చెందింది. చిత్తశుద్ధితో చేసే పని.. దేవతారాధనగా పరిణమిస్తుందని అర్థం చేసుకోలేకపోతే వ్రత కథా శ్రవణం.. కాలహరణం మాత్రమే!
కథారంభంలోనే ‘కళావతీ సా విదుషీ సతతం మంజుభాషిణీ’ అనీ, ‘తస్యాః ప్రసన్న చిత్తాయా లక్ష్మీ స్వప్న గతా తథా’ అనీ శ్లోకాలు కనిపిస్తాయి. చారుమతి కళలు నేర్చినది, విదుషీమణి. వైదుష్యం అంటే పాండిత్యం. ఎన్ని కళల్లో ప్రవేశం ఉన్నా, ఎంత పాండిత్యం సముపార్జించినా.. దేవతానుగ్రహం లేకపోతే వ్యర్థమే! అయితే వీటితోనే దైవానుగ్రహం కలుగుతుందనలేం. ఇంతకంటే ముందే చారుమతి భర్తకు, అత్తమామలకు నిస్వార్థంగా సేవ చేసేదని కథలో కనిపిస్తుంది. అమ్మవారి అనుగ్రహానికి చారుమతిలోని ఆ సేవాభావమే తొలి ఆలంబనమైంది.
ఇంకా మంజుభాషిణి అంటే.. ‘ఎప్పుడూ సౌమ్యమైన మాటలు.. మధురమైన వచనాలే ఆమె వాక్కునుంచి వెలువడుతాయి’ అని. తీయని మాటలే మాట్లాడుతుంది చారుమతి. పరుష వచనాలు మాట్లాడటం, చాడీలు చెప్పడం ఉండదు. ఇదీ దైవానుగ్రహానికి మరో కారణమైందన్నమాట. అంతేగాక చారుమతి ప్రసన్న చిత్త. అంటే ఆమె ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది, ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ విషయానికీ ఒత్తిడికి గురికాదు. అందుకే ఆ సాధ్వికి లక్ష్మీ ప్రసన్నత ప్రాప్తించింది. ఆధునిక యుగంలో దేవతా ప్రసన్నత కలగటం లేదంటే ప్రతి మనిషి ఎప్పుడూ ఏదో ఒక ఒత్తిడిలోనే ఉంటున్నాడని మర్చిపోవద్దు. ఈ విషయాలన్నీ వదిలేసి కథ మాత్రమే వింటూ మనం కాలక్షేపం చేస్తున్నాం. అందువల్ల ఏ కారణం లేకుండానే.. ఎటువంటి సాధనా లేకుండానే.. చారుమతికి గబుక్కున లక్ష్మీదేవి కలలో కనిపించిందన్న అపోహకు గురవుతున్నాం.
పతిభక్తి రతా… కాయ సంబంధి.
మంజు భాషిణీ… వాక్ సంబంధి.
ప్రసన్న చిత్తా… మనస్సంబంధి.
ఇప్పుడు చూడండి. చారుమతి మనోవాక్కాయములు అనే త్రికరణములు పరిశుద్ధాలని సుస్పష్టమవుతున్నది. పరిశుద్ధత విషయంలో అవి ఒక్కటయ్యాయి. ‘మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనః..’ అనేది సుప్రసిద్ధమే! మనసు వాక్కు కర్మ ఒకటైతే.. అది మహాత్ముల, గొప్పవారి స్థితి. ఇప్పుడు చారుమతిని మామూలు ఇల్లాలు అందామా? మహాత్మురాలు అందామా!! ఎవరైతే త్రికరణ శుద్ధిగా ధర్మాన్ని ఆచరిస్తారో.. వారికి దైవానుగ్రహం తప్పకుండా లభిస్తుందని చారుమతి వృత్తాంతం తెలియజేస్తుంది. వరలక్ష్మీ వ్రత కథలోని ఆంతర్యం ఇదే! ఈ సత్యం తెలుసుకొని, త్రికరణ శుద్ధిగా నడుచుకోగలిగితే.. ప్రతి ఇల్లాలికీ లక్ష్మీకటాక్షం సిద్ధిస్తుంది అనడంలో సందేహం లేదు.
-డా॥ వెలుదండ సత్యనారాయణ