భారతీయులు వైదిక ధర్మంలో పరమ పవిత్రంగా భావించే కాలంలో ‘శరత్ రుతువు’ విశిష్టమైనది. ఈ రుతువులో ప్రారంభమయ్యే నవరాత్రులు శక్తి స్వరూపమైన దుర్గాదేవి ఉపాసనకు గొప్పవని భావిస్తారు. దేవీ నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి ఒక్కోరోజు ఒక్కో అలంకారం చేస్తారు. ఈ క్రమంలో మహాదుర్గగా ఆరాధిస్తారు. దుర్గముడు అనే రాక్షసుడిని సంహారం చేసిన శక్తి స్వరూపం దుర్గాదేవి. అమ్మవారు మహాప్రకృతి స్వరూపిణి. ఇచ్ఛ, జ్ఞాన, క్రియాశక్తుల సమష్టి ఆరాధనే దుర్గాదేవి ఉపాసన. సమస్త దేవీదేవతా శక్తులు, తేజస్సులు మూర్తీభవించిన తేజోరూపం ఈ తల్లి స్వరూపం. సింహ వాహనాన్ని అధిరోహించి, ఎనిమిది చేతుల్లో కత్తి, డాలు, గద, శంఖం, కలశం, త్రిశూలం, చక్రం, ధనుర్బాణాలు ధరించి ఉంటుంది. ఇది సర్వశత్రు సంహారక రూపం.
దుర్గతులను నివారించే పరాశక్తి దుర్గాదేవి. కోటి సూర్యప్రభలతో వెలుగొందే అమ్మను పూజించడం వల్ల శత్రుపీడ తొలగిపోతుంది. విజయం కలుగుతుంది. సకల గ్రహబాధలూ ఆ తల్లి నామ స్మరణతో పలాయనం చిత్తగిస్తాయి. పంచ ప్రకృతి మహాస్వరూపాల్లో మొదటిది దుర్గారూపం. భవబంధాలలో చిక్కుకున్న మానవుడిని అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదించే మాత. ఎర్రని వస్త్రం, ఎర్రని అక్షతలు అమ్మవారికి సమర్పించాలి. ఎర్రని పుష్పాలతో పూజించాలి. శివుడి శక్తి రూపమే ‘దుర్గ’ అని ఆదిశంకరాచార్యులు పేర్కొన్నారు. అమ్మవారు రాత్రి రూపానికి ప్రతీక అయితే, పరమేశ్వరుడు పగటి రూపం కలవాడు. అందుకే అమ్మవారిని రాత్రిపూట అర్చిస్తే ఇష్టకామ్యాలు నెరవేరుతాయని మత్స్యపురాణం ద్వారా తెలుస్తున్నది.
దుర్గాదేవి ‘లోహుడు’ అనే రాక్షసుడిని వధిస్తే లోహం పుట్టిందని, అందువల్ల లోహ పరికరాలను తల్లి ముందు ఉంచి పూజిస్తారని చెబుతారు. దుర్గలో ‘దుర్’ అంటే దుఃఖం, దుర్భిక్షం, దుర్వ్యసనం, దారిద్య్రం అని అర్థాలు ఉన్నాయి. ‘గ’ అంటే నశింపజేసేది అని అర్థం. మొత్తంగా దారిద్య్రాన్ని నాశనం చేసే శక్తి దుర్గాంబ. నవరాత్రుల సందర్భంగా దుర్గాదేవి ఆరాధన వల్ల సమస్త గ్రహబాధలు తొలగిపోతాయని విశ్వసిస్తారు. అమ్మ శీఘ్ర అనుగ్రహకారిణి. శక్తి స్వరూపమైన అమ్మవారు అష్టమినాడు దుర్గాదేవి అలంకారంలో పూజలు అందుకుంటుంది. కొత్తగా వ్యాపారం ప్రారంభించేవారు ఈ రోజున ఆరంభించడం శుభసూచకంగా భావిస్తారు. దుర్గాష్టమి సందర్భంగా అమ్మవారికి బెల్లాన్ని నివేదనగా సమర్పిస్తే సమస్త శోకాలూ తొలగిపోతాయి.