పూర్వకాలంలో దేవుడు ప్రజలతో మాట్లాడేవాడట. అలా మాట్లాడేది కేవలం తన స్వరంతోనే గాక, చేష్టలతో కూడా! ఆయా సంఘటనల్లో తనవైన నిర్ణయాలను, ఆదేశాలను తెలియజేసేవాడట. అలాగే బైబిల్ పూర్వ నిబంధనలో ఆరోను పెద్దరికాన్నీ, అర్చకాధిపత్యాన్నీ నిర్ణయించడానికి ఓ సంఘటన జరిగింది. అదే ‘బాగా ఏండిపోయిన చేతికర్ర మళ్లీ చిగురించడం’. దానిని దైవ నిర్ణయంగా భావించి అక్కడివారంతా ఆ చేతికర్ర గలవాణ్ని పూజాధికారిగా అంగీకరించడం విశేషం. క్రీస్తుకు ముందు 1500 సంవత్సరాల కిందట జరిగిన కథ ఇది. ఆరోను ఎవరో కాదు, ప్రజల్ని ఈజిప్టు చెరలోంచి బంధ విముక్తుల్ని చేసి విడిపించి తెచ్చిన మహానాయకుడు మోషే సోదరుడు. అతనికి ఒక అక్క కూడా ఉంది. ఆమె పేరు మిరియాం. ఆరోను ఇశ్రాయేలీయ పన్నెండు గోత్రాల్లో ఒక గోత్రానికి పెద్ద. ప్రజలను ఆధ్యాత్మికంగా నడిపించడంలో మోషేకు సహకరించిన వ్యక్తి.
ఆరోనుకు మరో పేరు అహరోను. కాంతిదాయకుడు అని, కొండంత బలవంతుడు అని ఆ పేరుకు అర్థం. ఆరోను పూజారి నియమాలకు సంబంధించిన వాడు, నిష్ఠాగరిష్ఠుడు. అయితే తన పూజారి పదవిని నిర్ధారించేది దేవుడే! ప్రజల్లో అప్పటికే ఈ అన్నదమ్ముల (మోషే, ఆరోను) నాయకత్వంపై గొణుగుడు ప్రారంభమైంది. ఇద్దరి మధ్యా పోటీ చాపకింద నీరులా ప్రవహించింది. ఆ నేపథ్యంలో పన్నెండు గోత్రాల వారూ తమ తమ చేతికర్రలు మందిరంలో ఉంచాలి. దేవుడు ఏ గోత్రపు నాయకత్వాన్ని ఆశీర్వదిస్తాడో ఆ వ్యక్తి చేతికర్ర చిగురులెత్తి పుష్పించాలి. అలా చిగురించిన చేతికర్ర గలవాడిని అందరూ పూజాధికారిగా అంగీకరిస్తారు. దేవుడి ఆశీర్వాదంతో ఆరోను చేతికర్ర చివురించింది, పుష్పించింది, ఫలించింది కూడా! మహోత్సవంతో ప్రజలంతా ఆరోనును దైవార్చకుడిగా గౌరవించారు.